Site icon NTV Telugu

Off The Record: ఎమ్మిగనూరు వైసీపీలో బుట్టా వర్సెస్‌ చెన్నకేశవ ఫైట్‌..

Butta Renuka Vs Chennakesav

Butta Renuka Vs Chennakesav

ఆమెని ఎలాగైనా సరే…. నియోజకవర్గం నుంచి పంపేయాలని ఆ పెద్దాయన, ఉఫ్‌మని ఊదేస్తే కొట్టుకుపోవడానికి నేనేమన్నా ఎండుటాకునా? టిష్యూ పేపర్‌నా..? శివంగిని… అంటూ ఆమె మేటర్‌ని మాంఛి రక్తి కట్టిస్తున్నారు. వైసీపీ కేడర్ కూడా ఇద్దరి మధ్య సేఫ్‌ గేమ్‌ ఆడుతూ తూనికలు-కొలతలు వేస్తోందట. ఏ నియోజకవర్గంలో ఉందా ఢీ అంటే ఢీ అనే పరిస్థితి? ఎవరా ఇద్దరు నేతలు?

Also Read:GOAT Teaser: నవ్వులు పంచేలా.. సుడిగాలి సుధీర్‌ GOAT టీజర్‌..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీలో రచ్చ రంబోలా అవుతోంది. అసలే రగుతున్న అగ్గికి తాజాగా ఫ్లెక్సీ ఎపిసోడ్‌ ఆజ్యం పోసింది. మొన్నటి దాకా ఇన్చార్జ్‌గా ఉన్న మాజీ ఎంపీ బుట్టా రేణుక ఫ్లెక్సీని గుర్తు తెలియని కొందరు రాత్రి వేళలో చించేశారు. దాంతో రగిలిపోయిన మాజీ ఎంపీ వర్గీయులు…ఆ పని చేసిందెవరో తేల్చాలంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వాళ్ళిక తమ స్టైల్‌ విచారణ మొదలుపెట్టాక సీసీ ఫుటేజి కనిపించింది. ఎమ్మిగనూరు మండలానికి చెందిన దైవందిన్నె వీరేంద్ర, కలుగోట్ల రాము కలిసి ప్లెక్సీ చించేసినట్టు గుర్తించి వాళ్ళిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తీరా చూస్తే… ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి వర్గీయులు.

చెన్న కేశవరెడ్డి మనవడే ప్రస్తుతం నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్‌ రాజీవ్ రెడ్డి. దీంతో… ఎమ్మిగనూరు వైసీపీలో రచ్చ మాములుగా లేదుగా… అని మాట్లాడుకుంటున్నారు ఈ పరిణామాలను గమనిస్తున్న వాళ్ళు. 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. చెన్నకేశవరెడ్డికి వయసు మీద పడడంతో ఎమ్మిగనూరు వ్యవహారాలను ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి చూసేవారు. కీలక విషయాలన్నింటిలోను చెన్న కేశవరెడ్డి నిర్ణయమే ఫైనల్‌ అన్నట్టు ఉండేది. సామాజిక సమీకరణలు, ఇతర కారణాలతో 2024లో ఈ ఎమ్మెల్యే టిక్కెట్‌ని మాజీ ఎంపీ బుట్టా రేణుకకు ఇచ్చింది పార్టీ అధిష్టానం. ఇక్క అప్పటి నుంచి బుట్టా, చెన్నకేశవ మధ్య గ్యాప్ పెరిగింది. ఎన్నికల్లో రేణుక ఓటమికి ఈ విభేదాలు కూడా ఒక కారణం అంటారు.

ఫలితాల తర్వాత ఎమ్మిగనూరు అసెంబ్లీ ఇన్చార్జిగా తమ కుటుంబం నుంచి ఒకర్ని నియమించాలంటూ చెన్న కేశవరెడ్డి గట్టిగా చేసిన ప్రయత్నాలతో ఎట్టకేలకు బుట్టా రేణుకను తప్పించి ఇన్చార్జ్‌గా రాజీవ్ రెడ్డిని నియమించారు. రాబోయే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ టికెట్ బుట్టా రేణుకకు ఖరారు చేసి ఆమెను పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జిగా నియమించింది అధిష్టానం. ఆ విధంగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తుండగానే… తాజాగా ఫ్లెక్సీ ఎపిసోడ్‌ కలకలం రేపింది. ఇన్ఛార్జ్‌ మార్పుతో సమస్యలకు చెక్ పెట్టినట్టేనని వైసీపీ అధిష్టానం భావిస్తున్నా…అది పరిష్కారం అవకపోగా… మరింత ముదురుతున్నట్టు అంచనా వేస్తున్నారు పరిశీలకులు. ఎమ్మిగనూరులోని అసెంబ్లీ ఇన్ఛార్జ్‌ ఆఫీసును కాస్తా పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జి ఆఫీసుగా మార్చేసిన బుట్టా….తాను మాత్రం ఇక్కడి నుంచి కదిలేది లేదని చెప్పకనే చెప్పేశారు.

తరచూ అసెంబ్లీ సెగ్మెంట్‌ని సందర్శిస్తూ… తన గ్రూప్‌లో ఏమాత్రం పట్టు సడలకుండా జాగ్రత్త పడుతున్నారట మాజీ ఎంపీ. రేణుక వర్గీయులైన లోకల్‌ కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షుడు, ఇతర నాయకులు కూడా రెగ్యులర్‌గా ఆమెతో టచ్‌లో ఉంటున్నట్టు తెలుస్తోంది. మరో వైపు చెన్న కేశవరెడ్డి వర్గీయులు మాత్రం బుట్టా రేణుకను ఎమ్మిగనూరులో లేకుండా ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారట. ఫ్లెక్సీ చించివేత కూడా అందులో భాగమే అయి ఉండవచ్చని మాట్లాడుకుంటున్నారు స్థానికంగా. అలాగే… బుట్టా వర్గీయుల్లో కొందరిని తమ వైపు లాక్కునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. చెన్న కేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డి ఎమ్మిగనూరు పై పూర్తి పట్టుకోసం పావులు కదుపుతున్నారు. ఇలా ఎవరికి వారు పట్టుదలగా ఉండటంతో… ఎమ్మిగనూరు వైసీపీలో రచ్చ రచ్చ అవుతోంది.

Also Read:Oppo A6x 5G: ఒప్పో A6x 5G విడుదల.. 6,500mAh బ్యాటరీ.. బడ్జెట్ ధరలోనే

మాజీ ఎమ్మెల్యే వర్గానికి దీటుగా బుట్టా రేణుక వర్గం కూడా పావుకు కదుపుతుండటం కాక పెంచుతోంది. అలాగే… రేణుక వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న ఓ విషయంపై కూడా చర్చ జరుగుతోంది. ఎమ్మిగనూరు వైసీపీ ఇన్చార్జిగా తిరిగి బుట్టా రావడం ఖాయమన్న సంకేతాలు ఉన్నాయంటూ వాట్సాప్ మెసేజ్‌లు తెగ సర్క్యులేట్‌ అవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎమ్మిగనూరు అసెంబ్లీ అభ్యర్థి అవకాశాలు బలంగా ఉన్నాయంటూ వైరల్ చేస్తున్నారు. ఆదోని జిల్లా డిమాండ్‌తో జేఏసీ కి మద్దతుగా 50 వాహనాలతో ఎమ్మిగనూరులో భారీ ర్యాలీ చేసి అక్కడి నుంచి ఆదోనికి బయల్దేరడం కూడా అందులో భాగమేనట. అలాగే ఎమ్మిగనూరు కౌన్సిలర్లలో మెజారిటీ బుట్టా వెంటే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రోగ్రాం నిర్వహిస్తే అక్కడికి వెళ్లినా… అదే నాయకులు మళ్లీ బుట్టాతో టచ్‌లోకి వెళ్తున్నారట. దీంతో నువ్వా నేనా అన్నట్టు జరుగుతున్న వర్గపోరులో చివరికి పై చేయి ఎవరిదన్న ఉత్కంఠ మరింత పెరుగుతోంది పార్టీ వర్గాల్లో.

Exit mobile version