Site icon NTV Telugu

Off The Record: తగ్గేదేలే అంటున్న బీఆర్ఎస్ నేతలు

Taggedi

Taggedi

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఎందుకు గీత దాటుతున్నారు? సొంత పార్టీ నేతలపైనే ఓపెన్‌గానే విమర్శలు.. అడ్డుకోవడం దేనికి సంకేతం? హైదరాబాద్‌లో జరిగిన రెండు ఘటనలపై గులాబీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? అధిష్ఠానం వాళ్లను కంట్రోల్‌ చేయలేకపోతోందా? పార్టీ ఇమేజ్‌ డ్యామేజ్‌ కాకుండా చర్యలు చేపడుతుందా.. లేదా?

తగ్గేదే లేదన్నట్టుగా పార్టీ నేతల చర్యలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని ఏడాది కూడా సమయం లేదు. ఇలాంటి తరుణంలో అధికారపార్టీ ఎమ్మెల్యేల తీరు గులాబీ శ్రేణులను కలవరపెడుతున్నాయి. ఎక్కడా లేని ధైర్యం వచ్చినట్టుగా ఎమ్మెల్యేలే సొంత పార్టీ నాయకులపై ఓపెన్‌గా విమర్శలు చేస్తున్నారు. ఒకరికొరు చెక్‌ పెట్టుకోవడానికి ఇంతకు మించిన సమయం రాబోదన్నట్టుగా శాసనసభ్యుల వైఖరి కనిపిస్తోంది. ఇందుకు మంత్రి మల్లారెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు నిప్పులు చెరగడం కానీ.. హైదరాబాద్‌లో అభివృద్ధి పనుల ప్రారంభానికి వచ్చిన మేయర్‌ విజయలక్ష్మిని లోకల్‌ ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకోవడం కానీ.. చర్చకు దారితీస్తున్నాయి. తగ్గేదే లేదన్నట్టుగా ఉన్న నేతలు చర్యలు.. కదలికలు ప్రశ్నలకు ఆస్కారం కల్పిస్తున్నాయి.

ఎమ్మెల్యేలు ఎంచుకున్న మార్గంపై చర్చ
తెలంగాణలో గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారి ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక మంత్రిపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు మంత్రికి.. ఎమ్మెల్యేలకు ఎక్కడ గ్యాప్‌ మొదలైంది అనే అంశం కంటే.. శాసనసభ్యులు ప్రత్యేకంగా సమావేశం కావడం.. తర్వాత మీడియా ముందుకు వచ్చి.. నిర్మొహమాటంగా వ్యాఖ్యలు చేయడం సంచలనం రేకెత్తించింది. రాత్రికి రాత్రి మంత్రి మల్లారెడ్డితో ఎమ్మెల్యేలు వివేక్‌, హన్మంతరావు, గాంధీ, కృష్ణారావు, సుభాష్‌రెడ్డిలకు విభేదాలు రాలేదు. మల్లారెడ్డి మంత్రి అయినప్పటి నుంచి రగడ ఉంది. కానీ.. ఎప్పుడూ ఈ స్థాయిలో రోడ్డెక్కలేదు. గొడవ జరుగుతుంది అనుకున్నప్పుడు కానీ.. చిన్నపాటి ఘర్షణలు తలెత్తినా పార్టీ అధిష్ఠానం పిలిచి సర్ది చెప్పిన ఉదంతాలు ఎన్నో. తాజా ఎపిసోడ్‌లోనూ మంత్రి తీరుపై అభ్యంతరాలు ఉంటే.. అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తే.. మరోలా ఉండేది. కానీ.. ఆ మార్గాన్ని ఎంచుకోకుండా ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయమే పార్టీలో హాట్‌టాపిక్‌ అయ్యింది.

తాజా సంఘటనలను అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుందా?
తాజాగా ఉప్పల్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి GHMC మేయర్‌ గద్వాల విజయలక్ష్మి వెళ్లారు. అయితే ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యేను ఆహ్వానించలేదని సుభాష్‌రెడ్డి అనుచరులు మేయర్‌ను అడ్డుకున్నారు. విజయలక్ష్మితో నడిరోడ్డుపైనే వాగ్వాదానికి దిగారు. దాంతో చేసేది లేక మేయర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అభివృద్ధి పనులు విషయంలో కలిసి సాగాల్సిన నాయకులు ఎందుకు పంతాలకు పోతున్నారు?

ఆధిపత్య పోరాటాలకు దిగి ఏం ఆశిస్తున్నారు అనేది ప్రశ్న. వీటన్నింటి అధిష్ఠానం ఎందుకు కంట్రోల్‌ చేయలేకపోతోంది అనే చర్చ పార్టీ వర్గాల్లోనూ ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి అంశాలపై ఉపేక్ష మంచిది కాదన్నది వారి అభిప్రాయం. అయితే పార్టీ ఇమేజ్‌కు డ్యామేజీ కలిగించేలా జరుగుతున్న సంఘటనలపై హైకమాండ్‌ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే కొనుగోలు ఎపిసోడ్‌ తర్వాత వ్యూహాత్మకంగా రాజకీయ అడుగులు వేస్తున్న పార్టీ పెద్దలు.. తాజా అంశాలను సీరియస్‌గా పరిగణనిస్తున్నట్టు సమాచారం. మరి.. పార్టీ నేతలను.. ఎమ్మెల్యేలను కంట్రోల్‌లో పెట్టడానికి హైకమాండ్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Exit mobile version