Site icon NTV Telugu

TRS : అనుచరులతో బొంతు పరేడ్..ఇదంతా ఆ టికెట్ కోసమేనా ?

Bomta

Bomta

బొంతు రామ్మోహన్‌. GHMC మాజీ మేయర్‌. ఇక్కడ చూస్తున్నది ఆయన పుట్టినరోజు వేడుకలే. గతంలో కూడా ఆయన బర్త్‌డే వేడుకలు చేసుకున్నా.. ఈ ఏడాది మాత్రం స్పెషల్‌గా చెబుతున్నారు. పుట్టినరోజు వేడుకలను బలప్రదర్శనకు వేదికగా మార్చేసి పార్టీలో చర్చగా మారారు మాజీ మేయర్‌. వచ్చే ఎన్నికల్లో ఆయన ఉప్పల్‌ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అందుకోసమే ఈ ఎత్తుగడలు.. అనుచరులతో పరేడ్‌లు అని టీఆర్ఎస్‌లో చర్చ సాగుతోంది. వాస్తవానికి మేయర్‌గా ఉన్న సమయంలోనే ఉప్పల్‌ నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉండాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ.. ఉప్పల్‌ టికెట్‌ను భేతి సుభాష్‌రెడ్డికి ఇవ్వడం.. ఆయన ఎమ్మెల్యేగా గెలవడం.. బొంతు మాజీ మేయర్‌ కావడం చక చకా జరిగిపోయింది.

వచ్చే ఎన్నికల్లో భేతికి టీఆర్ఎస్‌ టికెట్‌ ఇవ్వదనే లెక్కల్లో ఉన్నారట బొంతు. నియోజకవర్గంలో తనకు పట్టు ఉందని చెబుతూ.. అధిష్ఠానం దృష్టిలో పడేందుకు రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. పుట్టినరోజున బొంతు అనుచరులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా ర్యాలీనే నిర్వహించారు. పనిలో పనిగా ఉప్పల్‌ సీటు ఖరారైందని.. అందుకే సన్నిహితులు.. అనుచరులు హంగామా చేశారని ప్రచారం మొదలుపెట్టేశారు. ఉప్పల్‌ నుంచి యాదాద్రి వరకు నిర్వహించిన ర్యాలీపై ప్రస్తుతం గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే బలప్రదర్శన కోసం బొంతు చేసిన వృధా ప్రయాసగా ఎమ్మెల్యే భేతి వర్గం లైట్‌ తీసుకుంటున్నా.. దాల్‌ మే కుచ్‌ కాలా హై అంటున్నాయి పార్టీ వర్గాలు.

బొంతు రామ్మోహన్‌ చర్లప్లలి కార్పొరేటర్‌గా 2016 నుంచి 2021 వరకు ఉన్నారు. ఇది ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. ప్రస్తుతం ఈ స్థానంలో ఆయన భార్య శ్రీదేవి కార్పొరేటర్‌గా ఉన్నారు. ఆధిపత్యపోరాటం వల్ల బొంతుకు.. ఎమ్మెల్యే భేతి వర్గాలకు అస్సలు పడటం లేదు. ఎమ్మెల్యే అంటే అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లు.. మాజీ కార్పొరేటర్లు.. పార్టీ నేతలను బొంతు చేరదీస్తున్నారట. తాజాగా యాదాద్రి వరకు నిర్వహించిన ర్యాలీలో నలుగురు కార్పొరేటర్లు.. మరో నలుగురు మాజీలు పాల్గొనడంతో ఉప్పల్‌ రాజకీయం రంగులు మారుతోంది.

ఉప్పల్‌ విషయంలో మరో ఆసక్తికర చర్చ కూడా జరుగుతోంది. ఉప్పల్‌లో ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి రెండోసారి గెలవబోరని చెబుతున్నారు. ఇప్పటి వరకు గెలిచిన ఎమ్మెల్యేలు.. ఓడిన ఎమ్మెల్యేల లిస్ట్‌ను సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ చేస్తున్నారు. ఆ సెంటిమెంట్‌ను బొంతు క్యాచ్‌ చేసుకునే పనిలో ఉన్నారట. అయితే ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి మాత్రం పార్టీ తనకే అవకాశం ఇస్తుందని.. ఉప్పల్‌లో చరిత్ర తిరగ రాస్తానని అనుచరులకు చెబుతున్నారట. మొత్తానికి మాజీ మేయర్‌ బల ప్రదర్శన.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొత్త ఎత్తుగడలు ఉప్పల్‌ టీఆర్ఎస్‌ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. మరి.. ఈ ఆధిపత్యపోరాటంలో ఎవరు పైచెయ్యి సాధిస్తారో.. ఎవరు బరిలో ఉంటారో కాలమే చెప్పాలి.

 

Exit mobile version