NTV Telugu Site icon

Off The Record: పెనుకొండలో పక్కలో బల్లెం

Maxresdefault (3)

Maxresdefault (3)

పెనుకొండ టీడీపీలో సీనియర్ నేతకు ఇంటిపోరు..BK Parthasarathi కి పక్కలో బల్లెం | OTR | Ntv

ఏ పోరైనా తట్టుకోవచ్చు కానీ.. ఇంటి పోరు పడలేమంటారు. సరిగ్గా అలాంటి పరిస్థితే ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎదుర్కొంటున్నారు. మొన్నటి వరకు తన సీటుకు పోటీయే లేదనుకున్న ఆ నేతకు సొంత నియోజకవర్గంలోనే ఇంటిపోరు మొదలైంది. ఓ మహిళా నేత పక్కలో బల్లెంలా మారారు. ఏ కార్యక్రమైనా వేర్వేరుగా చేయడం పరిపాటైంది. మధ్యలో ఇంకో నేత కూడా తన వారసుడి అప్లికేషన్‌ పట్టుకుని క్యూలో నిలుచున్నారట. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.

పార్థసారథికే సవాల్‌ విసురుతున్న సవిత
హిందూపురం పార్లమెంట్. రాష్ట్రంలో టీడీపీకి అత్యంత పట్టున్న ప్రాంతం. ప్రస్తుతం ఈ పార్లమెంట్ మొత్తం శ్రీసత్యసాయి జిల్లాలో ఉంది. ఈ జిల్లాకు టీడీపీ అధ్యక్షుడు బి.కే. పార్థసారధి. ఆయన ఒకసారి ఎంపీగా, ఎమ్మెల్యేగా, జడ్పీ ఛైర్మన్‌గాను పని చేశారు. పెనుకొండ నియోజకవర్గానికి చెందిన ఈయన గతంలో ఉమ్మడి జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగానూ ఉన్నారు. పార్టీపై గ్రిప్ ఉన్నప్పటికీ సొంత నియోజకవర్గంలో సమస్యలను చక్కదిద్దుకోలేకపోతున్నారట. 2019లో ఓటమి తర్వాత సీన్ మారిపోయింది. పెనుకొండలో ఓ మహిళా నేత దూసుకొచ్చారు. ఆమె పార్థసారధి కోటరీలో ఉన్న కురుబ సవిత. గతంలో కురుబ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌. ప్రస్తుతం పార్థసారధికే సవాల్‌ విసురుతున్నారు సవిత.

గతంలో కిష్టప్పకు పార్థసారథికి పొసిగేది కాదు
2014లో నిమ్మల కిష్టప్ప ఎంపీగా, పార్థసారథి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇద్దరికీ అసలు పొసిగేది కాదు. రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. అందుకే 2019 ఎన్నికల్లో పెనుకొండ టికెట్ కోసం నిమ్మల గట్టిగా ట్రై చేశారు. అధిష్ఠానం నో చెప్పడంతో ఆయన ఎంపీగా బరిలో ఉన్నారు. పెనుకొండలో కురుబలు ఎక్కువ. పార్థసారధి, సవిత ఇద్దరూ ఆ సామాజికవర్గానికి చెందిన వారే. నిమ్మల మాత్రం బీసీల్లో మరో సామాజికవర్గానికి చెందిన నేత. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టుగా.. పార్థసారధిని టార్గెట్ చేసేందుకు సవితకు నిమ్మల సపోర్ట్ చేస్తున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం అయినాసరే రెండు గ్రూపులు విడివిడిగా చేస్తున్నాయి. రెండు పార్టీ కార్యాలయాలు కూడా ఏర్పాటయ్యాయి. పార్టీ క్యాడర్ ఎవరికి నచ్చిన వారి పక్కన వాళ్లు చేరిపోయారు.

పార్థసారథిని, సవితను పిలిచి మాట్లాడిన పార్టీ పెద్దలు
ఇటీవల జరిగిన బాబాయ్య దర్గా ఉరుసులో కూడా సవిత, పార్థసారథి ఇద్దరూ వేర్వేరుగా సేవా కార్యక్రమాలు చేసి.. ఆయన వేరు, మేము వేరు అనే సంకేతాన్ని ఇచ్చారు. జిల్లా అధ్యక్షునిగా ఉన్న పార్థసారధికి సొంత నియోజకవర్గంలో తలపోటు ఎక్కువ కావడంతో అధిష్టానం కూడా గుర్తించి ఇద్దర్నీ పిలిచి మాట్లాడింది. నియోజకవర్గంలో పార్టీకి డ్యామేజ్ కాకుండా కష్టపడి పని చేయాలని రోటీన్‌గా చెప్పి వదిలేశారు. కానీ పరిష్కారం చేయలేదు. సీటు కోసం గ్రూపులు కట్టి పోరాడుతున్న ఇద్దరిలో ఏ ఒక్కరికైనా అధిష్ఠానం హామీ ఇచ్చిందా అనే అనుమానం ఈ రెండు వర్గాల్లోను ఉందట. అయినా పైకిమాత్రం ధీమాతో ఉన్నారట. ఎందుకంటే అధినేతను కలిసిన తరువాత ఇద్దరూ మరింత యాక్టీవ్‌గా పని చేస్తున్నారు. అది కూడా ఎవరికి వారే. ఎదురుపడ్డా ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు. తాజాగా సవిత పెనుకొండలో ఒక పార్టీ కార్యాలయాన్నే ఏర్పాటు చేశారు. పార్థా మాత్రం తన సొంత ఇంటి నుంచే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

కొడుక్కి సీటు ఇప్పించుకునే ప్రయత్నాల్లో నిమ్మల కిష్టప్ప
అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇరువర్గాల నేతలు చేసుకునే విమర్శలు.. సోషల్‌ మీడియాలో వేసుకుంటున్న సెటైర్లు వీరి మధ్య దూరాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ ఇద్దరి గొడవ సంగతి ఇలా ఉంటే తనకు మిస్‌ అయిన సీటును కొడుక్కైనా ఇప్పించుకోవాలనే ప్రయత్నాల్లో నిమ్మల కిష్టప్ప ఉన్నారట. దీంతో పెనుకొండ టీడీపీ పరిస్థితి ఒక సీటు మూడు పోటీలు అన్నట్టు తయారైంది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఒకరికో ఇద్దరికో సీట్లు ఇప్పించాల్సిన నేతకు సొంత నియోజకవర్గంలోనే రాకూడని కష్టం వచ్చింది. ఎన్నికలకు ఎంతో దూరం లేదు. ఇలాంటి సమయంలో కూడా ఇంత కన్ఫూజన్ ఉండటం.. కార్యకర్తలను డైలమాలో పడేస్తోంది. ఇప్పటికే శ్రీసత్యసాయి జిల్లాలోని టీడీపీలో విభేదాలు పతాకస్థాయిలో ఉండటంతో సొంత ఇంటిని చక్కదిద్ది తర్వాత జిల్లాను ఎప్పుడు సరిదిద్దుతారో పార్థుడికే తెలియాలి.