Site icon NTV Telugu

తెలంగాణలో ప్లాన్ మార్చిన బీజేపీ..

తెలంగాణలో ఇతర పార్టీ నేతలను ఆకర్షించే విషయంలో బీజేపీ ప్లాన్‌ మారిందా? ఇందుకోసం ఇద్దరు నాయకులు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారా? బీజేపీని వీడి వెళ్లిన వాళ్లను కూడా వెనక్కి తీసుకొస్తారా? కాషాయ శిబిరం వ్యూహం ఏంటి?

రెండో దశ చేరికలకు బీజేపీ తలుపులు తెరిచిందా?

బీజేపీలో చేరికలపై తెలంగాణలో మళ్లీ చర్చ మొదలైంది. అప్పట్లో కీలక నాయకులతో వరసగా మంతనాలు సాగించి.. కొందరిని తమ పార్టీలో చేర్చుకున్నారు కమలనాథులు. మధ్యలో ఈ ప్రక్రియకు బ్రేక్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ గాడిలో పెట్టింది బీజేపీ. ముఖ్యంగా హుజురాబాద్‌ ఉపఎన్నికలో గెలిచాక రెండో దశ చేరికలు మొదలుపెట్టినట్టు చర్చ జరుగుతోంది.

కిందిస్థాయిలోనూ చేరికలకు ఊతం..!

కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌లకు చెందిన రెండు డజన్ల నేతలు తమతో టచ్‌లో ఉన్నారని.. ఆ మధ్య బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లోనూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేరికల గురించి మాట్లాడారు. కేవలం ఎమ్మెల్యేలు.. ఎంపీలు చేరితేనే చేరినట్లు కాదని.. జిల్లా స్థాయిలో కాషాయ కండువా కప్పుకోవడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని తెలిపారాయన. దీంతో వివిధ పార్టీలకు చెందిన పెద్ద లీడర్లే కాకుండా.. చోటామోటా నాయకులను కూడా బీజేపీలోకి ఆహ్వానించాలనే ఆలోచనకు వచ్చినట్టు కిషన్‌రెడ్డి మాటలను విన్నవారు చెబుతున్నారు. ఇకపై కిందిస్థాయిలో చేరికలు జోరందుకుంటాయని అనుకుంటున్నారు.

చేరికలపై ఈటల ఆలోచనలకు పెద్దలు గ్రీన్‌సిగ్నల్‌..!

బీజేపీ జిల్లా శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సైతం.. బీజేపీలో చేరికలపై ప్రత్యేకంగా ప్రస్తావించారట. పార్టీని వదిలి వెళ్లిన వారిని సైతం తీసుకురావాలని సూచించారు. వారు ఇబ్బందులు పడ్డా.. ఒకనాడు భారత్‌మాతాకీ జై అన్నవారేనని తెలిపారు ఈటల. ఆయన కూడా జాయినింగ్స్‌పై కొంత శ్రద్ధ తీసుకోబోతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యమకారులను, అధికారపార్టీలో అసంతృప్తితో ఉన్నవాళ్లను.. టచ్‌లో ఉన్న వివిధ వర్గాల ప్రముఖులను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారట. ఢిల్లీ బీజేపీ పెద్దలు కూడా ఈ విషయంలో ఈటలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ నేతలతో మాట్లాడుతున్న డీకే అరుణ..!

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సైతం గతంలోనే కొందరు కాంగ్రెస్‌ నేతలు.. మాజీ ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆపరేషన్‌ మధ్యలోనే ఆగింది. ఇప్పుడు డీకే అరుణ మళ్లీ తన పని మొదలుపెట్టినట్టు సమాచారం. మాటలు.. మంతనాలు.. మంత్రాంగాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యోగ సంఘాల మాజీ నేత విఠల్‌, జర్నలిస్ట్‌లు బీజేపీలో చేరిపోయారు. వారి చేరిక వెనక తాజా రాజకీయ పరిస్థితులు.. సామాజికవర్గాల ప్రభావం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. మరి.. బీజేపీలో చేరికలు ఏ మేరకు ఉంటాయో.. ఎవరు చేరతారో.. చేరినవారు ఎంత వరకు ప్రభావం చూపిస్తారో కాలమే చెప్పాలి.

Exit mobile version