Site icon NTV Telugu

ఏపీకి ఇచ్చిన హామీలపై ప్రశ్నించని బీజేపీ నేతలు?

అమ్మ అడగదు… అడుక్కోనివ్వదు. ఆ పార్టీ నేతల తీరు కూడా అలాగే ఉందట. ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై వాళ్లు అడగలేరు. పైగా అడిగేవాళ్లకు అడ్డుపడుతున్నారట. ఈ అంశంపైనే ఇప్పుడు సెటైర్లు పేలుతున్నాయి. వారెవరో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఏపీకి ఇచ్చిన హామీలపై బీజేపీ నేతలు అడగలేరు?

విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు అనేక హామీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రెవెన్యూ లోటు భర్తీ దగ్గర నుంచి.. కీలక సంస్థల ఏర్పాటు.. పోలవరం నిర్మాణం.. ప్రత్యేక హోదా.. రైల్వేజోన్‌ వంటివి కీలకమైనవి. వీటిపై రాజకీయ రగడ ఎలా ఉన్నా.. ఈ హామీల అమలు ఏ దశలో ఉంది? హామీల అమలుకు రాష్ట్ర బీజేపీ నేతలు ఏ మేరకు చొరవ తీసుకుంటున్నారు? అన్న అంశాలపై ఎప్పుడూ చర్చే. ఇటీవల జరిగిన తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల సమయంలోనూ బీజేపీ నేతలే లక్ష్యంగా ఈ ప్రశ్నలు చర్చకు వచ్చాయి. కేంద్రం అన్నీ చేస్తుందని బీజేపీ నాయకులు చెప్పినా.. శేష ప్రశ్నలు అలాగే ఉండిపోతున్నాయి. ఇలాంటి దశలో ఏపీకి వచ్చే కేంద్రమంత్రులను హామీలపై అడిగే అవకాశం ఉన్నా.. ఆ ధైర్యం చేయడం లేదు ఏపీ బీజేపీ నేతలు. వాళ్లు అడగలేరు. ఒకవేళ అడిగేందుకు మీడియా ముందుకు వచ్చినా.. రక్షణ కవచంగా నిలుచుంటున్నారట. ప్రస్తుతం ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది.

తిరుమలకు వచ్చే కేంద్రమంత్రులకు అడ్డుగోడలా ఏపీ బీజేపీ నేతలు!

మోడీ ప్రభుత్వంలోని అనేక మంది కేంద్రమంత్రులు శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారు.. ఇకపైనా వస్తారు. ఆ సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలపై ప్రశ్నించే సౌలభ్యం ఉంటుంది. బీజేపీ నేతలు అడగకపోయినా.. మీడియా ప్రశ్నించడానికి వీలుకలుగుతుంది. కానీ.. వెంకన్న దర్శనం కోసం వచ్చే కేంద్రమంత్రులు చుట్టూ ఏపీ బీజేపీ నేతలు అడ్డుగోడలా ఉంటున్నారు. విభజన హామీలపై మీడియా అడిగితే తమకు ఇబ్బంది వస్తుందని అనుకుంటున్నారో ఏమో.. చాలా జాగ్రత్త పడుతున్నారట ఏపీ కమలనాథులు.

కొండపై రాజకీయాలు వద్దని తప్పించుకుంటున్నారా?

తిరుమలకు వచ్చే కేంద్రమంత్రులకు దగ్గరుండి దర్శనం చేయించామా లేదా? వాళ్లు సంతృప్తి చెందారా లేదా అన్నదానికే ప్రాధాన్యం ఇస్తున్నారు బీజేపీ నేతలు. ఒకవేళ మీడియాతో మాట్లాడినా.. పొడిపొడిగా దర్శనం గురించే చెప్పించి పంపించి వేస్తున్నారు. దేశం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించాం. మోడీ నాయకత్వంలో దేశం ముందుకెళ్తోంది అని కేంద్రమంత్రులందరితో ఒకటే పాట పాడిస్తున్నారు. విభజన హామీలపై మీడియా వాళ్లు ప్రశ్నిస్తే మాత్రం.. ఇప్పుడు కాదని జారుకుంటున్నారు. పైగా కొండపై రాజకీయాలు మాట్లాడకూడదని నీతి వాక్యాలు చెబుతూ తప్పించుకుంటున్నారు.

అడిగితేనే ఏపీ సమస్యలు కేంద్రం దృష్టికి వెళ్తాయి!

రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలను రాజకీయకోణంలో చూడటం ఏపీ బీజేపీ నేతలకు చెల్లింది. ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని అడగాలంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్న అంశం. అదే ఇక్కడికి వచ్చిన కేంద్రమంత్రులను అడిగితే ఏపీ సమస్యలు వాళ్ల దృష్టికి వెళ్తాయి. ఈ లాజిక్‌ను కమలనాథలు మర్చిపోతున్నారనే అభిప్రాయం కలుగుతోందట. వారి శైలి చూస్తుంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.





Exit mobile version