Site icon NTV Telugu

Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

Bhogapuram Airport Row

Bhogapuram Airport Row

ఆ కమలం ఎమ్మెల్యే…. టీడీపీకి చెందిన ఓ కేంద్ర మంత్రి మీద తెగ గుస్సా అవుతున్నారు. బీ కాషియస్‌ అంటూ…. హైపిచ్‌ వాయిస్‌తో వార్నింగ్‌ ఇస్తున్నారు. ఆయన అభిప్రాయాలను, అభ్యంతరాలను దాదాపుగా సమర్ధిస్తున్నట్టు వైసీపీ లీడర్స్‌ మాట్లాడ్డం ఇంకా ఉత్కంఠ రేపుతోంది. ఆల్‌సెట్‌ అనుకున్న చోట పబ్లిక్‌ మేటర్స్‌ అంటూ మెలిక పెడుతున్న ఆ శాసనసభ్యుడెవరు? ఏ విషయంలో విభేదిస్తున్నారు?

పెన్మత్స విష్ణుకుమార్ రాజు…బీజేఎల్పీ నేత…!. కూటమి కాంబినేషన్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి సెకండ్ టైం ఎమ్మెల్యే. స్వపక్షమైనా.., విపక్షమైనా… లాజిక్ పాయింట్ దొరికితే గట్టిగానే తగులుకుంటారన్న పేరుంది. అది రుషికొండ వ్యవహారమైనా, గూగుల్ డేటా సెంటర్, గీతం భూములు… మేటర్‌ ఏదైనా ప్రభుత్వ విధానాల్ని సమర్ధించలేనప్పుడు నిశ్చితమైన అభిప్రాయంతో కనిపిస్తుంటారాయన. ఈ క్రమంలోనే… ఇప్పుడు భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ వంతు వచ్చింది. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ విమానాశ్రయం జూన్‌లో ప్రారంభం కావచ్చన్న అంచనాలున్నాయి. నిర్మాణ పనులు దాదాపు పూర్తికావొచ్చాయని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల సీఐఐ వేదిక మీద ప్రకటించారు. అదే సమయంలో… సిటీ మధ్యలో వున్న ప్రస్తుత విమానాశ్రయాన్ని పూర్తి స్ధాయిలో నావికాదళ అవసరాలకు బదిలీ చేస్తామని క్లారిటీగా చెప్పేశారాయన. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే రామ్మోహన్ నాయుడు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట ఎమ్మెల్యే. ప్రజలకు అందుబాటులో, సౌకర్యంగా వున్న ఎయిర్‌పోర్ట్‌ను మూసేసి…. ఎక్కడో రెండు గంటల దూరం ప్రయాణించి కొత్త ఎయిపోర్ట్‌కు వెళ్ళమని చెప్పడం ఎంత వరకు సహేతుకమని ఆయన ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇది కేవలం నా ఒక్కడి అభిప్రాయంగా చూడొద్దని, ఎయిర్ ప్యాసింజర్స్ కన్వినెంట్ యాంగిల్లో… పారిశ్రామిక వర్గాలు, ట్రావెలర్స్ అందరూ దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్నారన్నది విష్ణుకుమార్‌రాజు మాట. ఇందుకు ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయంటున్నారు కొందరు. ప్రస్తుతం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళడానికి ట్రాఫిక్ తక్కువగా వుండే వేగవంతమైన రహదారి సౌకర్యం లేదు. అది ఎయిర్‌ ప్యాసింజర్స్‌కు, టూరిస్ట్‌లకు ఇబ్బంది అవుతుందన్న ఆందోళన చాలామందిలో ఉంది. పోర్టు టూ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పేరుతో కైలాసగిరి నుంచి భోగాపురం వరకు ఆరు వరుసల రహదారి నిర్మాణం ఇంకా ప్రారంభం కావాల్సి వుంది. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ అమలులోకి వస్తే తప్ప ఆ విషయంలో క్లారిటీ రాదు. దీంతో.. ఆ సిక్స్‌లేన్‌ రోడ్‌ నిర్మాణం ఎప్పుడు ప్రారంభం అవుతుంది….ఎన్నేళ్ళలో పూర్తవుతుందన్న ఇప్పుడే చెప్పడం కష్టమని అధికార వర్గాలే అంటున్నాయి. ప్రత్యామ్నాయం పేరుతో ఏడు రహదారులను వీఎంఆర్డీఏ అభివృద్ధి చేస్తున్నప్పటికీ విమాన ప్రయాణికులకు దూరా భారాలు పెరుగుతాయి తప్ప తగ్గవన్న అభిప్రాయం ఉంది. ఈ పరిస్థితుల్లో… ప్రస్తుతం అందుబాటులో వున్న విమానాశ్రయాన్ని కొనసాగించాలని పట్టుబడుతున్నారట బీజేపీ ఎమ్మెల్యే. ఇది కేవలం సౌకర్యం మాత్రమే కాదని, దాదాపు నాలుగు దశాబ్దాలుగా విశాఖతో వున్న అనుబంధం కనుక గౌరవించాల్సిందేని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. ఢిల్లీ, ముంబై, గోవా వంటి చోట్ల రెండేసి విమానాశ్రయాలు వున్నప్పుడు వైజాగ్‌లో వుంటే తప్పేంటని ప్రశ్ని స్తున్నారాయన.

కనీసం బీచ్ కారిడార్ పనులు 25శాతం పూర్తయ్యే వరకైనా… డొమెస్టిక్ విమాన సర్వీసుల్ని ఉదయం, సాయంత్రం నడపండి, లేదంటే వందేభారత్ రైళ్ళనయిునా అదనంగా వేయించండన్న ప్రతిపాదన కేంద్ర మంత్రి దృష్టికి వెళ్ళేలా చేయాలన్నదే విష్ణుకుమార్‌రాజు వ్యూహంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో అది విష్ణు ఒక్కరి ఫీలింగ్‌ కాదని, విశాఖలోని కూటమి నేతలంతా దాదాపు అదే అభిప్రాయంతో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం విశాఖ నుంచి పనుల కోసం విజయవాడ వెళ్ళాలంటే విమానం కంటే వందేభారత్‌ రైలు బెటర్‌ అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. మరోవైపు ఇదే అంశం మీద వైసీపీ కూడా ఆందోళనకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బీచ్‌ కారిడార్ పనుల్ని వెంటనే ప్రారంభించాలన్న డిమాండ్‌తో వైసీపీ కార్యాచరణను సిద్ధం చేస్తోందట. ప్రస్తుతం వీఎంఐర్‌డీఏ చెబుతున్న ఏడు ప్రత్యామ్నాయ మార్గాలు పరిష్కారం కాదని, పోర్టు టూ ఎయిర్‌పోర్ట్‌ బీచ్‌ కారిడార్‌ ప్రాజెక్టే కరెక్ట్‌ అన్నది ప్రతిపక్షం వాదన. కైలాసగిరి, రుషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ 55 కిలోమీటర్ల బీచ్‌ కారిడార్‌ ప్రతిపాదనకు ఐదు వేల కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సైతం అంగీకారం తెలిపింది. అయితే… దీనికి భూసేకరణతో పాటు నిర్ధిష్ట కాలపరిమితి అవసరం. ఆ విషయాన్ని మర్చిపోయి కనెక్టివిటీ అభివృద్ధి చేయకుండా హడావిడిగా ఫ్లైట్ ఆపరేషన్స్ ప్రారంభించేస్తే… ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవన్నది వైసీపీ మాట. తమ హయాంలో అన్ని అనుమతులు సాధించిన ప్రాజెక్ట్‌ను ఇప్పటికీ ఎందుకు చేపట్టలేదని వైసీపీ ప్రశ్నిస్తోంది. అందు కోసం ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇలా…. ఏ కోణంలో చూసుకున్నా, ఇటు కూటమిలోని మిత్ర పక్షం, అటు ప్రతిపక్షం నుంచి ఎయిర్‌ పోర్ట్‌కు కనెక్టివిటీ విషయంలో తీవ్ర అభ్యంతరాలున్నాయి. వోవరాల్‌గా భోగాపురానికి దారేది అని ప్రశ్నిస్తున్న అందరికీ ప్రభుత్వం ఏం చెబుతుంది? రేపు ఎయిర్‌పోర్ట్‌ ఆపరేషన్స్‌ పూర్తి స్థాయిలో మొదలయ్యాక పరిస్థితి ఎలా మారుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version