Site icon NTV Telugu

Bhimavaram Politics : ఆ నియోజకవర్గంలో టీడీపీ నేతలు నిరుత్సహంలో ఉన్నారా..? కారణం ఏంటి..?

Bhimavaram

Bhimavaram

Bhimavaram Politics : అసెంబ్లీ ఎన్నికలొస్తున్నాయంటే అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే ఉంటుంది. అక్కడ అన్ని పార్టీల్లోనూ టికెట్‌ ఆశించే వారి మధ్య మాంచి పోటీ ఉంటుంది. ఐతే… అక్కడి టీడీపీ నేతలు మాత్రం ప్రస్తుతం నిరుత్సాహంలో మునిగిపోయారట. అసలు..ఈ పరిస్థితులు రావటానికి కారణం ఏంటి?

తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం నుంచి టీడీపీ పోటీ చేస్తుందా? లేక పొత్తుల్లో ఆ ప్రాంతం వేరే పార్టీ ఖాతాలో పడిపోనుందా అనే సందేహాలు ఆ పార్లీలో మొదలయ్యాయి. ఇది భీమవరం తెలుగు తమ్ముళ్లను నిరుత్సాహంలోకి నెట్టింది. పొత్తులో సీటు పోతే తమ భవిషత్తు ఏమిటనేది అర్ధంకాని పరిస్థితిలో అయోమయానికి గురవుతున్నారు టీడీపీ నేతలు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. ఇప్పటికే ఆయన ఆ దిశగా పావులు కదుపుతున్నారు. అయితే, ఆయన తెలుగుదేశంలోనే కొనసాగుతారా? లేక మరో పార్టీకి మారుతారా అనేది సస్పెన్స్‌గా మారింది.

2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పులపర్తి రామాంజనేయులు… 2014లో టీడీపీ తరపున పోటి చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరో సారి భీమవరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు పులపర్తి. కానీ… జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే… భీమవరం నుంచి మరోసారి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశముందనే ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే… టీడీపీ తరఫున పులపర్తికి పోటీ చేసే అవకాశం ఉండదు. ఒక వేళ టీడీపీకి జనసేనతో పొత్తు లేకపోయినా… సొంత పార్టీ నేతల నుంచి సీటు కోసం ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది.

భీమవరం టీడీపీ టిక్కెట్ కోసం ఈ సారి హేమాహేమీలు క్యూలో ఉన్నారు. ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జి తోట సీతారామలక్ష్మీ ఇప్పటికే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు గాని, తన కొడుక్కి గాని భీమవరం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారామె. టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి సైతం ఈ అంశం వెళ్లింది. అయితే… పొత్తులపై స్పష్టత రాకపోవడం వల్ల సీతారామలక్ష్మీకి స్పష్టమైన హామీ లభించలేదట. ఓ వైపు పొత్తులు, సొంత పార్టీలో సీటు కోసం ఎదురవుతున్న గట్టి పోటీతో పులపర్తి ఇంకో సారి జెండా తిప్పేసే సూచనలు కనిపిస్తున్నాయి. దీని కోసం ఆయన రకరకాలా మార్గాలను అన్వేషిస్తున్నారు.

అధికార వైసీపీలోకి వెళ్లేందుకు పులపర్తి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌పై పోటి చేసి గెలిచిన గ్రంధి శ్రీనివాస్… మంత్రి పదవి దక్కలేదనే ఆవేదనలో ఉన్నారు. ఇప్పటికే ఆయన అనుచరగణం సమక్షంలోనే అధిష్ఠానంపై అసంతృప్తిని వెళ్లగక్కారాయన. ఇది కాస్త ఆయన సీటుకే ఎసరు పెట్టేలా ఉంది. మరోవైపు… భీమవరంలోని క్షత్రియ సామాజిక వర్గానికి ఆయనకి మధ్య దూరం పెరిగిందని ప్రచారంలో ఉంది. ఈ పరిస్థితుల్లో గ్రంధికి మళ్లీ టికెట్‌ దొరుకుతుందా? అనే చర్చ నడుస్తోంది. ఒక వేళ గ్రంధికి వైసీపీలో రెడ్‌ సిగ్నల్‌ పడితే… అక్కడ పాగా వేయాలన్నది పులపర్తి ప్లాన్‌ అట. గ్రంధికి ఎదురయ్యే పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవాలని పులపర్తి రామాంజనేయులు భావిస్తున్నారని భీమవరంలో టాక్.

ఇటీవల కాలంలో టీడీపీ కార్యక్రమాలకు సైతం పులపర్తి దూరంగా ఉండడానికి పార్టీ మారే ఆలోచనే కారణమనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కాంగ్రెస్‌, టీడీపీల తరఫున ఎమ్మెల్యేగా పని చేసిన పులపర్తి ఇప్పుడు తనకు ఎవరు అవకాశమిచ్చినా బలం నిరూపించుకోడానికి సిద్ధమౌతున్నట్టు ఓపెన్‌ ఆఫర్‌తో ఉన్నారట. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో భీమవరం టీడీపీ కుదుపు తప్పదనడంలో సందేహం లేదు.

Exit mobile version