NTV Telugu Site icon

బెజవాడ టీడీపీలో అనూహ్య పరిణామాలు..!

బెజవాడ టీడీపీ అంతర్గత రాజకీయాల్లో పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. ఒక్కసారిగా సీన్‌ రివర్స్ అయింది. పార్టీకి దూరమైపోతారని భావించిన కేశినేని నాని రీయాక్టీవ్‌ అయ్యారు. అప్పటి వరకు యాక్టీవ్‌గా ఉన్న బుద్దా వెంకన్న, బొండా ఉమాలు డీలా పడ్డారు. ఇంతకీ ఏం జరిగింది? ఇకపై ఏం జరగబోతోంది?

చంద్రబాబు దీక్షతో మారిన బెజవాడ టీడీపీ సీన్‌..!

మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బెజవాడ టీడీపీ టీమ్‌ బాగా డిస్ట్రబ్‌ అయింది. నగరంలో ‘టీమ్‌ టీడీపీకి’ కీలకంగా ఉన్న ఎంపీ కేశినేని నానితో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు.. మరో నేత నాగుల్‌ మీరాకు గొడవ జరిగింది. దీంతో బెజవాడ పార్లమెంట్‌ కమిటీ కూర్పు కొలిక్కిరాక.. చాలాకాలం కమిటీని ప్రకటించ లేదు. ఎంపీ నాని సైలెంట్‌ అయ్యారు. టీడీపీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు నాని. బుజ్జగించేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నించినా ఎంపీ మెత్తబడలేదు. ఇక నాని పార్టీకి దూరమైనట్టేనని అనుకున్నారు. అయితే ఈ పరిస్థితిని ఒక్కసారిగా తారుమారు చేసింది చంద్రబాబు దీక్ష.

చంద్రబాబుతో కేశినేని నాని భేటీని శంకించిన వ్యతిరేక వర్గం..!
బెజవాడ టీడీపీ కమిటీలో కేశినేని నాని అనుచరులకు ప్రాధాన్యం..!

పార్టీ కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేశారని.. డ్రగ్స్‌ మహమ్మరిని అరికట్టాలని చంద్రబాబు 36 గంటల దీక్ష చేపట్టడం.. ఆ దీక్షకు సంఘీభావంగా తన కార్యకర్తలతో కేశినేని నాని తరలి రావడంతో బెజవాడ టీడీపీ అంతర్గత రాజకీయాల్లో సీన్‌ రివర్స్‌ అయింది. చంద్రబాబుతో దీక్షా వేదిక మీదే భేటీ కావడమే కాకుండా.. వైసీపీపై గట్టి కామెంట్లే చేశారు ఎంపీ. ఆ తర్వాత నానిని వెంటబెట్టుకుని చంద్రబాబు కార్‌వాన్‌లోకి వెళ్లారు. కొంతసేపు చర్చించారు. ఇదంతా జరుగుతుండగానే.. బుద్దా వెంకన్న అండ్ టీమ్‌ ఏదో జరగబోతోందని శంకించింది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిస్తే.. ఆ బృందంలో కేశినేని నాని కూడా ఉన్నారు. దీంతో బుద్దా వెంకన్న, బోండా టీమ్‌కు క్లియర్‌ పిక్చర్‌ వచ్చినట్టైంది. ఆ తర్వాత రెండు రోజులకే.. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న టీడీపీ బెజవాడ పార్లమెంట్‌ కమిటీని ప్రకటించేశారు చంద్రబాబు. అందులో కేశినేని నాని అనుచరులకు సముచితస్థాయిలో స్థానం కల్పించారు. రాష్ట్ర మైనార్టీ విభాగంలో కేశినేని నాని ప్రధాన అనుచరుడు ఫతావుల్లాకు ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. పార్టీ కమిటీని ప్రకటించాక.. పదవులు ఆశించిన కొందరు లోకల్‌ లీడర్లు భగ్గుమన్నారు. విభేదాలు బయటపడ్డాయి.

చంద్రబాబుతో మనసులో మాట చెప్పేసిన కేశినేని నాని..!
చంద్రబాబు కూడా క్లారిటీకి వచ్చేశారా?

ఈ పరిణామంతో బుద్దా, బోండా వర్గాలు కుతకుతలాడుతున్నట్టు సమాచారం. మొన్నటి వరకు తమవైపు ఉన్నట్టుగా కన్పించిన వాతావరణం సడెన్‌గా కేశినేని నానికి ఎలా అనుకూలంగా మారిందని చర్చించుకుంటున్నారట. చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంలో కేశినేని నాని తన మనస్సులోని మాటలను.. బెజవాడలో జరుగుతున్న పరిణామాలను క్లియర్‌గా విడమరిచి చెప్పారట. పార్టీకోసం కష్టపడి పనిచేస్తుండగా ఇబ్బంది పెడితే.. తాను సర్దుకుపోయినా.. కేడర్‌లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని గట్టిగానే చెప్పేశారట. ఇదే సమయంలో కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా తనకు వ్యతిరేకంగా బెజవాడ నేతలు బుద్దా, బోండా, నాగుల్‌ మీరాలు ప్రెస్‌ మీట్‌ పెట్టే ముందు జరిగిన పరిణామాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈ విధంగా తన మనసులోని అంశాలన్నింటినీ చంద్రబాబు ముందు పెట్టేసి క్లియర్‌ చేసుకున్నారు నాని. దీంతో చంద్రబాబు కూడా క్లారిటీకి వచ్చేశారట. ఆ తర్వాతే సీన్‌ రివర్స్‌ అయిందని అభిప్రాయపడుతున్నారు తమ్ముళ్లు.

బుద్దా, బోండా వర్గానికి బ్రేక్‌ పడ్డట్టేనా?

ఇప్పుడు తామేం చేయాలనే దానిపై క్లారిటీ లేక బుద్దా, బోండా టీమ్‌ నానా తంటాలు పడుతోందట. కేశినేని నానితో గ్యాప్‌ రావడంతో సిటీలో తమకు తిరుగే ఉండదని భావించారు. ఇప్పుడు ఆ టీమ్‌కు బ్రేకులు పడ్డట్టేనని కేశినేని సన్నిహితులు అనుకుంటున్నారట. మొత్తంగా చంద్రబాబు దీక్షతో పార్టీకి ఎంత మేలు జరిగిందో ఏమో.. బెజవాడ టీడీపీ అంతర్గత రాజకీయాల్లో మాత్రం ఆసక్తికర పరిణామాలు జరుగుతాయనే చర్చ జోరందుకుంది.