Off The Record: కాంగ్రెస్ హైకమాండ్ ఆశీస్సులతో తెలంగాణ క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్. చాలామంది ఆశావహులు క్యూలో ఉన్నా… అందర్నీ వెనక్కి నెట్టి ఏఐసీసీ కోటాలో నేరుగా మంత్రి అయ్యారాయన. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగినప్పుడే ఆయనకు మంత్రి పదవి దక్కింది. అయితే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండానే నేరుగా రేవంత్‌రెడ్డి కేబినెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు అజహర్. అంతవరకు బాగానే ఉన్నా… ఇప్పుడాయన పదవి విషయంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయన్న చర్చ మొదలైంది. ఇప్పట్లో రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ చేసే పరిస్ధితి లేదు. దాంతో ఆయన్ని చట్ట సభలకు ఎలా పంపిస్తారన్న మౌలికమైన ప్రశ్న తలెత్తుతోంది. గతంలో కాంగ్రెస్ సర్కార్ గవర్నర్ కోటాలో ఇద్దరు నేతల్ని నామినేట్ చేసింది. ఇందులో కోదండరామ్, అమీర్ అలీ ఖాన్‌కు ఛాన్స్ ఇచ్చారు. అంతకు ముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు నేతల్ని అదే గవర్నర్ కోటాలో నామినేట్ చేసింది. కానీ అప్పటి గవర్నర్ తమిళిసై ఆ పేర్లను తిరస్కరించారు. దాంతో దాసోజు శ్రావణ్, కుర్ర సత్య నారాయణ సుప్రీంకోర్టుకు వెళ్లారు. తమ పేర్లను తిరస్కరించడం, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఇద్దర్ని సిఫారసు చేయడాన్ని కోర్టులో సవాల్ చేశారు.
READ MORE: Iran: “మీ రికార్డులు మాకు తెలుసులేవోయ్”.. యూఎస్‌పై ఇరాన్ వ్యంగ్యాస్త్రాలు..
ఫైనల్‌గా కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లను రద్దు చేసింది కోర్ట్. ఆ తర్వాత తిరిగి అమీర్ స్థానంలో అజారుద్దీన్ పేరును చేర్చి లిస్ట్‌ను మరోసారి రాజ్‌భవన్‌కు పంపింది కాంగ్రెస్ సర్కార్. అయితే ఆ నియామకాలకు సంబంధించి సుప్రీం కోర్టు నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇక్కడే అజహర్‌కు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వాస్తవానికి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ అవకుండా ఎవరైనా మంత్రి పదవి స్వీకరిస్తే.. ఆరు నెలల్లోపు ఏదో ఒక చట్ట సభకు ఎన్నిక కావాలి. ఇప్పుడు అజహరుద్దీన్ మంత్రిగా బాధ్యతలు తీసుకుని రెండు నెలలు అవుతోంది. రూల్స్ ప్రకారం ఆయనకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. కానీ…. ఆలోపు ఎమ్మెల్సీ అవుతారన్న గ్యారంటీ మాత్రం కనిపించడం లేదంటున్నారు పరిశీలకులు. సుప్రీం కోర్ట్‌లో పెండింగ్‌లో ఉన్న కేసు క్లియర్ అయితే… ఇబ్బంది ఉండదుగానీ… అది ఎప్పటికి అవుతుందన్న డెడ్‌లైన్ మాత్రం కనిపించడం లేదు. మరోవైపు వచ్చే ఏడాది నవంబర్ వరకు ఒక్క ఎమ్మెల్సీ కూడా ఖాళీ అయ్యే అవకాశం లేకపోవడంతో అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా లేదా అన్న సందిగ్ధత పెరుగుతోంది. అలాగని అసెంబ్లీ వైపు చూస్తారా అంటే… ప్రస్తుతం శాసనసభలో ఏ స్థానం ఖాళీగా లేదు. ఒకవేళ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే…ఆ అసెంబ్లీ స్థానాలకు ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అప్పుడు పార్టీ ఫిరాయించిన నేతలతోనే ఎన్నికలకు వెళ్తారా? కొత్త వారికి అవకాశం ఇవ్వాలా అన్న విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా.. ఎట్నుంచి ఎటు చూసినా… అజహరుద్దీన్‌కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. మరోవైపు తాజా మాజీ ఎమ్మెల్సీ కోదండరాం పరిస్థితి కూడా విచిత్రంగా ఉందట. అటు ఎమ్మెల్సీ అని చెప్పుకోలేక… ఇటు మాజీ ఎమ్మెల్సీ అని పిలిపించుకోలేక ఆయన కూడా సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఒకరు అసెంబ్లీలో, మరొకరు శాసన మండలిలో తిరగటం చర్చనీయాంశంగా మారింది.
