Site icon NTV Telugu

బీజేపీ, జనసేన నేతల కామెంట్స్ మిత్రభేదానికి బాటలేస్తున్నాయా..?

Janma Jenasena1 Copy

Janma Jenasena1 Copy

కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు చేసిన ఈ కామెంట్స్‌ అనేక సందేహాలకు.. చర్చకు కారణం అవుతున్నాయి. టీడీపీ వన్‌సైడ్‌ లవ్వు.. జనసేనను కన్నుగీటడం.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్‌ కల్యాణ్‌ ప్రకటన.. ఇంతలోనే అందరం కలవాలి.. త్యాగాలకు సిద్ధమని చంద్రబాబు స్టేట్‌మెంట్‌ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. దీంతో బంతి బీజేపీ కోర్టులో పడింది. కాషాయ పార్టీ 2014ను రిపీట్‌ చేస్తుందా? బద్ధ శత్రువుగా భావిస్తున్న టీడీపీతో జత కడుతుందా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. పైగా మిత్రపక్షంగా ఉంటూ.. తమకు శత్రువైన టీడీపీకి చేరువయ్యేలా జనసేనాని చేస్తున్న ప్రకటనలు బీజేపీ శిబిరంలో అలజడి రేపుతున్నాయి. పొత్తులపై నిర్ణయం అంతిమంగా బీజేపీ జాతీయ నాయకత్వానిదే అయినా.. రాష్ట్రస్థాయిలో స్పందించాల్సిన పరిస్థితి ఏపీ బీజేపీ నేతలపై పడింది. అయితే ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నారో లేదో కానీ.. ఈ సమయంలో వారు చేస్తున్న కామెంట్స్‌ మరింత గందరగోళానికి దారితీస్తున్నాయి. ఆ కోవలోకే వస్తున్నాయి ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు తాజా వ్యాఖ్యలు

వీర్రాజు చెప్పిన జనంతో పొత్తు అంటే అర్థం ఏంటి? ఏ పార్టీ అయినా జనం మద్దతు ఆశిస్తుంది? ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటాయి. అయినప్పటికీ జనంతో పొత్తు అని చెబుతూనే.. జనసేనతోనూ పొత్తు అని గొంతు సవరించారు. పైగా బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకేంటి నష్టమని మీడియా ప్రతినిధులపై చిర్రుబుర్రులాడారు. జనసేన వైఖరిపై ప్రశ్నిస్తే దానికి లౌక్యంగా ఎలా సమాధానం చెప్పాలో వీర్రాజుకు తెలియంది కాదు. కానీ.. ఒక విధమైన అసహనం ఆయనలో కనిపించిందనేది విశ్లేషకుల మాట. ఇదే సమయంలో బీజేపీ, జనసేన పొత్తుపై రకరకాల ప్రశ్నలు.. చర్చలు జోరందుకున్నాయి. జనసేనని బీజేపీ వదులుకుంటుందా? టీడీపీతో వెళ్లిపోవాలని జనసేన నిర్ణయించిందా? 2019లో మాదిరి బీజేపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తుందా? అని ఎన్నో మరెన్నో ప్రశ్నలు చర్చల్లో ఉన్నాయి.

2014లో బీజేపీతో జనసేనాని ఎందుకు కలిశారో.. 2018లో ఎందుకు దూరం అయ్యారో తెలిసిన చరిత్రే. 2019 ఎన్నికల తర్వాత అనూహ్యంగా బీజేపీకి దగ్గరయ్యారు పవన్‌ కల్యాణ్‌. ఇద్దరూ మిత్రపక్షంగా ప్రకటించుకున్నారు కానీ.. ఎక్కడా మనసులు, మాటలు కలవలేదు. కలిసి పోరాటాలు చేసిన సందర్భాలు లేవు. నిరసనలు.. ఆందోళన కార్యక్రమాల్లో ఎవరి దారి వారిదే. పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూనే టీడీపీతో అవగాహన ఏర్పాటు చేసుకుంది జనసేన. అప్పటి నుంచే మిత్రపక్షాల మధ్య గ్యాప్‌ వచ్చిందని అనుమానించారు. GHMC ఎన్నికల సమయంలో జనసేన ఒంటరిగా వెళ్తానంటే.. చివరి క్షణంలో బీజేపీ పెద్దలు వెళ్లి బుజ్జగించారు. ఆ ఎన్నికల్లో బీజేపీని సీట్లు అడగకుండా పోటీ నుంచి తప్పుకొంది జనసేన. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సమయంలోనూ ఎవరు పోటీ చేయాలనే దానిపై రెండుపార్టీల శిబిరాల్లోనూ వాడీవేడీ చర్చ జరిగింది. చివరకు బీజేపీ ఒత్తిడితో జనసేన వెనక్కి తగ్గింది. అది జనసైనికులకు రుచించలేదు. బద్వేలు ఉపఎన్నిక సమయంలోనూ రెండు పార్టీలు పోటీపై వేర్వేరుగా ప్రకటనలు చేశాయి. జనసేన పోటీ చేయడం లేదని చెబితే.. బీజేపీ క్యాండిడేట్‌ను బరిలో దించింది. ఇలా అనేక ఉదంతాలు మిత్రపక్షాల మధ్య స్నేహానికంటే.. అంతర్గత వైరాన్నే పెంచాయి. గ్రౌండ్‌ లెవల్లో టీడీపీ కేడర్‌తో మింగిలైనంత ఈజీగా బీజేపీ శ్రేణులతో కలిసి పనిచేయలేకపోతున్నారట జనసైనికులు.

జనసేన ఆవిర్భావ సభలో వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌.. బీజేపీ పెద్దలు ఇచ్చే రోడ్‌ మ్యాప్‌ కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ఆ దిశగా రెండు పార్టీల మధ్య అడుగులు పడిన ఉదంతాలు లేవు. పైగా కొత్త పొత్తుల దిశగా టీడీపీ, జనసేనలు మాటలతో దగ్గరవుతున్నాయి. జనసేనను వదులుకోవడానికి బీజేపీ ఇష్ట పడకపోయినా.. పరిస్థితులు మాత్రం కమలనాథుల చెయ్యి దాటిపోయినట్టే కనిపిస్తోంది. అందుకే జనసేనను కంటే జనాన్ని నమ్ముకోవాలని అనుకుంటున్నారో ఏమో.. జనంతో పొత్తు అని కొత్త కామెంట్ పాస్‌ చేశారు వీర్రాజు. ఇక రాం రాం చెప్పుకోవడమే మిగిలిందని చెవులు కొరుక్కుంటున్నారు. మరి.. ఈ ఎపిసోడ్‌కు కమలనాథులు ముగింపు పలుకుతారో.. జనసేన ఎండ్‌కార్డు వేస్తుందో చూడాలి.

 

Exit mobile version