40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీ… ఇప్పుడు ట్యూషన్ పెట్టించుకుని రాజకీయ పాఠాలు చెప్పించుకుంటోంది. అదీ ఒక్కరితో కాదు.. ఇద్దరితో. ఇప్పుడంతా పొలిటికల్ స్ట్రాటజిస్టుల ట్రెండ్ నడుస్తోంది. వ్యూహకర్తలు ఉంటే గెలుపు తీరాలకు చేరొచ్చనే భావన జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో బలంగా ఉంది. ఆ క్రమంలోనే టీడీపీ సైతం స్ట్రాటజిస్టులకు పార్టీని అప్పజెప్పింది. ముందుగా రాబిన్‌శర్మ టీమ్‌కు బాధ్యతలు అప్పగించారు. తాజాగా మరో స్ట్రాటజిస్ట్ కనుగోలు సునీల్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనే తెలంగాణలో కాంగ్రెస్‌కు కూడా వ్యూహకర్తగా పని చేస్తున్నారు. వీరిద్దరు ప్రస్తుతం టీడీపీని గాడిలో పెట్టే పనిలో ఉన్నారట.
టీడీపీ హయ్యర్ సర్కిల్స్‌లో ఇద్దరు స్ట్రాటజిస్టుల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. వీరిలో చాలామందికి తమ నియోజకవర్గాల్లో.. జిల్లాల్లో ఏం జరుగుతుంది..? గ్రౌండ్ రియాల్టీ ఏంటనేది స్పష్టంగా తెలుసు. ఇక చంద్రబాబు విషయానికొచ్చేసరికి.. ఆయనే అతిపెద్ద స్ట్రాటజిస్టు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో టీడీపీకి కావాల్సింది అధినాయకత్వంపై నమ్మకాన్ని కలిగించడం. ఇంఛార్జుల ఎంపిక.. అభ్యర్థుల ఖరారులో జాగ్రత్తలు తీసుకోవడమే. వీటి విషయాల్లో గ్రౌండ్‌లో ఉన్న పరిస్థితేంటీ..? ఎవరికి సీటిస్తే.. ఎలాంటి రియాక్షన్ వస్తుంది..? ఎవరిని ఇన్‌ఛార్జీగా నియమిస్తే సెగ్మెంట్‌లో పార్టీ పుంజుకుంటుందనే విషయాన్ని విశ్లేషించి తగిన ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సిన బాధ్యత స్ట్రాటజిస్టులదే. కానీ వ్యూహకర్తలు ఆ పని చేయడం లేదట. పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని.. పార్టీ ఎక్కడా కరెక్ట్‌లైన్‌లో వెళ్లడం లేదనే చర్చ పార్టీ వర్గాల్లో ఉందట.
పార్టీ ఇన్‌ఛార్జుల నియామకంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను ప్రస్తావిస్తున్నారు టీడీపీ నాయకులు. తాజాగా చీరాల ఇన్ఛార్జీగా కొండయ్య యాదవ్‌ను నియమించారు. ఆయన నియామకం అక్కడ సరైంది కాదన్నది పార్టీలో వాదన ఉందట. చీరాలలో యాదవ సామాజికవర్గానికి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు ఉండటం.. ఆ సామాజికవర్గలో చెప్పుకోదగ్గ నాయకుడు లేకపోవడంతో కొండయ్య వైపు మొగ్గు చూపినట్టు చెబుతున్నారు. అయితే పార్టీలో ఆయన ట్రాక్ రికార్డు అంత గొప్పగా లేదన్నది .. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారితో కలిసి గతంలో కొండయ్య తిరిగినట్టు ఆరోపిస్తున్నారు. ఇదే తరహాలో బాపట్ల వచ్చిన ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అక్కడ ఇంఛార్జ్‌గా వేగేశ్న నరేంద్ర వర్మ పేరు ప్రకటించడాన్ని పార్టీ వర్గాలు తప్పుపడుతున్నాయట. ఈ అంశాలపై ఎవరి వాదన వారిదే. ఇవన్నీ వ్యూహకర్తలు చెబితే చెస్తున్నారా? లేక వారితో సంబంధం లేకుండా చేస్తున్నారా అనేది అంతుచిక్కడం లేదట. వీటిపై వ్యూహకర్తలు పార్టీని ఎందుకు అలర్ట్ చేయడం లేదని ప్రశ్నించేవాళ్లూ ఉన్నారు.
వాస్తవానికి స్ట్రాటజిస్టులు.. పార్టీకి సంబంధించిన కీలకమైన.. సున్నితమైన అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. రాబిన్ శర్మ కానీ.. సునీల్ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. వైసీపీ తరహాలో సంస్ధాగతంగా టీడీపీని పటిష్టం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా? గ్రామస్థాయిలో టీడీపీ జెండా పట్టుకుని తిరిగే నాయకులు ఉన్నారు. కేడర్ బేస్డ్ పార్టీ. అలాంటి టీడీపీలో అభ్యర్థుల ఎంపిక.. ఇంఛార్జుల నియామకాల్లో జాగ్రత్తలు తీసుకోవడం.. చంద్రబాబు, లోకేష్‌ల ఇమేజ్ ఎలివేట్ అయ్యేలా వ్యహ రచన చేయడం కీలకమన్నది పార్టీ నేతల అభిప్రాయం. లోకేష్ ఇమేజ్ గతానికంటే మిన్నగా ఉందన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. చంద్రబాబు ఇమేజ్‌లో గతానికి.. ఇప్పటికీ ఏ మాత్రం తేడా లేదని అనుకుంటున్నారు. మరి ఇద్దరు ట్యూషన్ టీచర్లు ఏం చేస్తున్నారు అనేది టీడీపీ నేతల ప్రశ్న. నిరసన కార్యక్రమాలు చేపట్టం మినహా పొలిటికల్ అనాలిసిస్.. గ్రౌండ్ రియాలిటీలతో స్ట్రాటజీలు వేయడం లేదట. అందుకే ఇద్దరు ప్రైవేట్ మాస్టర్లు.. టీడీపీని ముంచుతారా.. తేలుస్తారా అని కేడర్ ఆందోళన చెందుతున్నారట.
