ఏపీలో టీడీపీకి విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయా? గవర్నర్ అపాయింట్‌మెంట్ పొందడంలోనూ ఆ పార్టీ విఫలం అవుతోందా? లోపం ఎక్కడుంది? టీడీపీలో జరుగుతున్న చర్చ ఏంటి?
ప్రణాళికలో లోపమా? మరేదైనా కారణమా?
రాజకీయ పార్టీలు గవర్నర్‌తో భేటీ కావడం సాధారణం. ప్రభుత్వాలపై ఫిర్యాదు చేసేందుకు.. వివిధ విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు రాజ్‌భవన్‌కు వెళ్తుంటారు నాయకులు. గవర్నర్ వ్యవస్థపై టీడీపీకి మొదటినుంచి తీవ్ర అసంతృప్తి ఉన్నా.. ఆయా సందర్భాలలో రాజ్‌భవన్‌కు వెళ్లిన ఉదంతాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ.. ఆయా అంశాలపై తరచూ గవర్నర్‌ను కలిసే ప్రయత్నం చేస్తోంది. ప్రణాళికలో లోపమో.. మరేదైనా కారణమో కానీ.. రాజ్‌భవన్ లోపలికి వెళ్తున్న టీడీపీ నేతలు.. గవర్నర్‌తో భేటీ కాలేకపోతున్నారు.
చంద్రబాబు అయితే ఓకే.. టీడీపీ నేతలు వెళ్తే…!?
ఈ రెండేళ్ల కాలంలో చంద్రబాబు ఒకటి రెండు సందర్భాలలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. రాష్ట్రంలో టీడీపీ నేతలపై దాడులు.. పోలీసు శాఖ వైఖరిపై ఫిర్యాదులు చేశారు. తర్వాత మాత్రం ఫిర్యాదు చేసే బాధ్యతను పార్టీ నేతలకు అప్పగించారు చంద్రబాబు. ఆ విధంగా రాజ్‌భవన్‌కు వెళ్తే గవర్నర్‌ను కలవడం సాధ్యపడటం లేదట.
సెక్రటరీకో.. మరో అధికారికో వినతిపత్రం ఇస్తున్నారట!
గవర్నర్ అపాయింట్‌మెంట్ అంటే అప్పటికప్పుడు జరిగేది కాదు. ముందుగా రాజ్‌భవన్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి. ఎవరు వస్తారు? ఎంత మంది వస్తారు అనే వివరాలు వెల్లడించాలి. ఆ విధంగా రాజ్‌భవన్‌కు వెళ్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల బృందానికి గవర్నర్ అపాయింట్‌మెంట్ దొరకడం లేదని పార్టీలో చర్చ జరుగుతోంది. రాజ్‌భవన్ గేటుదాటి వెళ్లాక.. గవర్నర్ సెక్రటరీకో.. అక్కడ ఉండే మరో అధికారికో వినతిపత్రం ఇచ్చి వచ్చేస్తున్నారట.
గవర్నర్‌ను కలవలేదన్న ప్రచారం ఇబ్బంది పెడుతోందా?
బీజేపీకి దొరికినంత ఈజీగా తమకు గవర్నర్ అపాయింట్‌మెంట్ దొరకడం లేదన్నది టీడీపీ వర్గాల ప్రశ్న. పైగా రాజ్‌భవన్‌లో టీడీపీ నేతలు ఎవరిని కలిశారు అన్నది నిమిషాల్లోనే వివిధ మార్గాల ద్వారా సమాచారం బయటకు వస్తోంది. ఏ ఉద్దేశంతో అయితే రాజ్‌భవన్‌కు వెళ్లారో అది ప్రచారం జరిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ.. టీడీపీ నేతలు గవర్నర్‌ను కలవలేదు.. కేవలం సెక్రటరీని కలిశారు అనే ప్రచారం పార్టీ నేతలను ఇబ్బంది పెడుతోందట.
కోవిడ్ కారణంగా భేటీలకు దూరంగా గవర్నర్!
అత్యంత కీలక సందర్భాలలోనే రాజ్‌భవన్ తలుపు తడితే బెటర్?
టీడీపీలో జరుగుతున్న ఈ చర్చపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గవర్నర్ దగ్గరకు తరచూ వెళ్లడం మంచిది కాదన్నది కొందరి వాదన. తరచూ వెళ్లే ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం వల్ల.. రాజ్‌భవన్‌లో అధికారులను కలిసి రావాల్సి వస్తోందని.. ఇకపై మరింత ప్లానింగ్‌తో వెళ్లాలని కొందరు సూచిస్తున్నారట. చంద్రబాబు వెళ్తే రాజ్‌భవన్ గవర్నర్ అపాయింట్ ఇస్తుందని.. పార్టీ నేతలు వెళ్లడం వల్లే అది సాధ్యం కావడం లేదని కొందరి అభిప్రాయం. పైగా కోవిడ్ కారణంగా గవర్నర్ భేటీలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యమైన వ్యవహారాల్లో మాత్రమే ఆయన అపాయింట్‌మెంట్ ఇస్తున్నారు. పీఏసీ ఛైర్మన్ హోదాలో పయ్యావుల కేశవ్ కోరినప్పుడు గవర్నర్ అపాయింట్‌మెంట్ లభించింది. ఈ విధంగా అత్యంత కీలమైన సందర్భాలలో మాత్రమే రాజ్‌భవన్ తలుపులు తడితేనే బెటర్ అని అనుకుంటున్నారట. అప్పుడే గవర్నర్ దగ్గరకు వెళ్లిన విషయానికి ప్రాధాన్యం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారట. మరి ఇప్పటికీ బీజేపీకి వచ్చే అవకాశం తమకెందుకు రావడం లేదని లెక్కలు వేసుకుంటారో.. వ్యూహంలో మార్పులు చేస్తారో చూడాలి.
