OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో అవకతవకల పేరుతో వైసీపీ తన పోరాటాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకువెళ్ళాలనుకుంటోందా? కేవలం ఆరోపణలు, రాజకీయ విమర్శలతో సరిపెట్టకుండా… పక్కాగా, ఒక పథకం ప్రకారం, మొక్కకు అంటుకట్టినంత శ్రద్ధగా వ్యవహారాన్ని నడిపించాలనుకుంటోందా? గతంలో ఎన్నడూ లేని విధంగా… ఈసీకి లీగల్ నోటీస్‌తో ఆ సంకేతాలిచ్చేసిందా? అసలు విపక్షం ప్లాన్ ఏంటి? నెక్స్ట్ లెవల్‌కు ఎలా తీసుకువెళ్ళాలనుకుంటోంది? ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల వివాదాలు ఫిర్యాదుల స్థాయి దాటి లీగల్ వార్‌గా మారుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్నికల సంఘానికి వినతులు.. అధికారుల తీరుపై ఆరోపణలు.. న్యాయస్థానాల్లో పోరాటాలు చేసిన వైసీపీ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. నేరుగా ఈసీ ఉన్నతాధికారులకే లీగల్ నోటీసులతో ….. పోరాటాన్ని కొత్త మలుపు తిప్పడంతో పాటు ఈ విషయంలో తగ్గేదేలేదంటూ అధికార పక్షానికి సంకేతాలిచ్చిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తం ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి 672 ఫిర్యాదులు చేశామని చెబుతోంది వైసీపీ. నామినేషన్లకు అడ్డంకులు, అభ్యర్థులపై దాడులు, బలవంతపు ఉపసంహరణలు.. పోలింగ్.. కౌంటింగ్.. డిక్లరేషన్… ఇలా ప్రతి దశలోనూ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తోంది ప్రతిపక్షం. ఎంత చేసినా… ఎలాంటి స్పందన లేదంటూ కామ్‌గా స్టేట్‌మెంట్స్‌తో సరిపెట్టకుండా…చట్టపరమైన వత్తిడి పెంచే వ్యూహాన్ని ఎంచుకుందట ఫ్యాన్ పార్టీ. ఆ క్రమంలోనే… వైసీపీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది మెహఫూజ్ నజ్కీ లీగల్ నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్, డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, ఎన్నికల అధికారులందరికీ నోటీసులు పంపారు.
అంటే… ఎన్నికల నిర్వహణలో కీలకంగా ఉన్న అధికారులందరినీ ఒకే లీగల్ నోటీసు పరిధిలోకి తీసుకొచ్చింది ప్రతిపక్ష పార్టీ. సుప్రీం కోర్ట్ ఆదేశాలను రాష్ట్ర అధికార యంత్రాంగం ఎంతవరకు అమలు చేసిందన్న అంశాన్ని హైలైట్ చేయడం ద్వారా వత్తిడి పెంచాలన్నదే దీని ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోందని అంటున్నారు. ఇందులో డీజీపీ బాధ్యతలను ప్రత్యేకంగా ప్రస్తావించింది వైసీపీ. అభ్యర్థులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నామినేషన్లు దాఖలు చేసేందుకు పోలీసు బందోబస్తు కల్పించాల్సిన బాధ్యత డీజీపీపై ఉందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు పోలీసుల తీరుపై రాజకీయ విమర్శలు చేయగా…. ఇప్పుడు అదే అంశాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలు, అధికారుల విధులతో ముడిపెట్టి లాతో కొట్టాలనుకుంటోంది. లీగల్ ఫైట్‌లో ఇప్పుడు వైసీపీ దృష్టి ఎన్నికల సమయంలో జరిగిన ప్రతి పరిణామం మీద పడింది. ముఖ్యంగా సీసీ కెమెరాల ఫుటేజీని భద్రపరచడం గురించి లీగల్ నోటీసుల్లో గట్టిగా ప్రస్తావించింది. పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ జరిగిన రోజే అదే కేంద్రంలో ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జరుగుతున్నందున.. పోలింగ్ ప్రారంభం నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, బ్యాలెట్ పత్రాలు, ఎన్నికల రికార్డులను సీల్ చేసే వరకు నిరంతరాయంగా వీడియో రికార్డింగ్ ఉండాలని కోరింది.అంతేకాదు.. ఎన్నికల పిటిషన్ల దాఖలుకు నిర్దేశించిన గడువు ముగిసే వరకు ఫుటేజీని భద్రపరచాలని.. పిటిషన్లు దాఖలైతే వాటిపై తుది తీర్పు వచ్చేంత వరకు భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది ప్రతిపక్షం.
అలాగే… ఆర్టికల్ 144 ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడం అధికారులందరి బాధ్యత అంటూ తన లీగల్ నోటీస్‌లో గుర్తుచేసింది వైసీపీ. ఆ రకంగా ఈ పోరాటాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకువెళ్లాలని భావిస్తోందట ఫ్యాన్ పార్టీ అధిష్టానం. స్థానిక ఎన్నికల వివాదాన్ని ఇక్కడితో వదిలేయకూడదన్నదే ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఇన్నాళ్లు న్యాయస్థానాల్లో పోరాటాలు చేసిన ఆ పార్టీ.. ఇప్పుడు ప్రతి పరిణామాన్నీ ఆధారాలతో సహా నమోదు చేయడంపై దృష్టి పెట్టిందట. ముఖ్యంగా నామినేషన్ల తిరస్కరణలు, బలవంతపు ఉపసంహరణలు, పోలింగ్.. కౌంటింగ్ ప్రక్రియలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై విడివిడిగా లీగల్ ఫైట్ చేయాలని అనుకుంటోందట. ఇక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ కీలకం కానుంది. అందుకే… ఫుటేజ్ భద్రపరచకపోయినా.. ధ్వంసం చేసినా.. ఆ అంశాన్నే ఎన్నికల పిటిషన్లలో ప్రస్తావించే అవకాశం ఉందని అంటున్నాయి పార్టీ వర్గాలు. మరోవైపు ఈ అంశాన్ని కేవలం కోర్టులకే పరిమితం చేయకుండా.. ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్ కూడా ఉందట. స్వేచ్ఛాయుత ఎన్నికలు, ప్రజాస్వామ్య హక్కులు, ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత అనే అంశాల చుట్టూ రాజకీయ చర్చ పెట్టే ప్రణాళికలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా….మొత్తంగా చూస్తే.. ఇది కేవలం స్థానిక ఎన్నికలకు సంబంధించిన పోరాటం కాదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికకల కోసం జరుగుతున్న గ్రౌండ్ ప్రిపరేషన్‌లా కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

