Site icon NTV Telugu

దవులూరి ఇంట్లో వాళ్లకే కీలక పదవులు

Dalluri Danchadu

Dalluri Danchadu

కాకినాడ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పెద్దాపురం. అధికార వైసీపీకి కలిసి రావడం లేదు ఈ సెగ్మెంట్‌. పెరుగుతున్న వర్గ విభేదాలతో పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతుందన్నది కేడర్‌ ఆందోళన. పెద్దాపురం వైసీపీ ఇంఛార్జ్‌గా దవులూరి దొరబాబు ఉన్నారు. ఫ్యామిలీ ప్యాక్‌ కింద మూడు కీలక పదవులను ఇంట్లో వాళ్లకు ఇచ్చుకుని కుటుంబ పాలనకు తెరతీశారనే విమర్శ ఆయనపై ఉంది. దొరబాబు ప్రస్తుతం రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌. ఆయన తల్లి పార్వతి సామర్లకోట మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌. తండ్రి దవులూరి సుబ్బారావు సామర్లకోట మున్సిపాలిటీలో కోఆప్షన్‌ సభ్యుడిగా ఉన్నారు. పార్టీలో దవులూరి ఇంట్లోనే అందరికీ పదవులు రావడంతో.. పార్టీలో మొదటి నుంచి ఉన్న వైసీపీ నేతలకు రుచించడం లేదట.

విదేశాల్లో వ్యాపారాలు చేసిన దొరబాబు 13 ఏళ్ల క్రితం పెద్దాపురం వచ్చి రాజకీయ అరంగేట్రం చేశారు. మొదట ప్రజారాజ్యం టికెట్‌ కోసం.. తర్వాత టీడీపీ నుంచి పోటీకి ట్రై చేసి.. కుదరక డీలా పడ్డారు. చివరకు జగన్‌ పాదయాత్ర సమయంలో వైసీపీ కండువా కప్పుకొన్నారు. అయితే పార్టీలో ఇతర నేతలకు పదవులు దక్కకుండా కుట్రలు చేస్తున్నారనేది వైసీపీ వర్గాల ఆరోపణ. 2019లో దొరబాబు పెద్దాపురం వైసీపీ టికెట్‌ ఆశించారు. కానీ.. మాజీ మంత్రి తోట నరసింహం భార్య వాణికి పార్టీ ఛాన్స్‌ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీ పార్లమెంట్ నాయకుడితో కుమ్మక్కై సొంత పార్టీ అభ్యర్థిని ఓడించారని వైసీపీ కేడర్‌ ఇప్పటికీ చెవులు కొరుక్కుంటోందట. టీడీపీ నాయకులతో డబ్బుల పంపిణీకి సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయని కేడర్‌ ఆరోపిస్తోంది.

వైసీపీ ఇంఛార్జ్‌ పదవికోసం తోట సుబ్బారావు నాయుడుకు పొగపెట్టి బయటకు పంపింది దొరబాబే అన్నది లోకల్‌గా పార్టీలోని ఒక వర్గం ఆరోపణ. నాయుడికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో జరిగిన ప్రచారం వెనక దొరబాబే ఉన్నారని.. ఇందుకోసం ప్రత్యేకంగా టీమ్‌ను ఏర్పాటు చేశారని ఆరోపిస్తుంటారు. దవులూరి ఇంఛార్జ్‌గా వచ్చాక పెద్దాపురం వైసీపీలో వర్గ విభేదాలు పెరిగాయన్నది పార్టీ శ్రేణుల మాట. సొంతపార్టీ నాయకులను పక్కనపెట్టి.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టారనే వైసీపీ శ్రేణులు రుసరుసలాడుతున్నాయట. ఈ కారణంగానే కొందరు పార్టీకి దూరమైనట్టు చెబుతున్నారు.

దొరబాబు తండ్రి సుబ్బారావు నోటిదురుసు కూడా వైసీపీకి ప్రతికూలంగా మారుతుందనేది కేడర్‌ వాదన. మున్సిపల్‌ ఎన్నికల్లో ఛైర్‌పర్సన్‌ పదవి కోసం 4 కోట్లు ఖర్చు చేశామని.. ఎవరో వచ్చి తమ కుర్చీని తన్నుకు పోతున్నారని ఆయన దుర్భాషలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే నియోజకవర్గంలో మైనింగ్‌ మాఫియాకు కొమ్ముకాసి కోట్లు కాజేసిన సంగతి ఏంటని వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల వైసీపీ దళిత సామాజికవర్గ కార్యకర్తలు తిరుగుబాటు సభ నిర్వహించారు. పైగా తమపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ.. తిరుగుబాటు సభను నిర్వహించడం కలకలం రేపింది.

నిన్నమొన్నటి వరకు కామ్‌గా ఉన్న కార్యకర్తలు ఇప్పుడు ఓపెన్‌గా దొరబాబుపై కామెంట్స్‌ చేస్తుండటం చర్చగా మారుతోంది. పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారట. ఇదే విధంగా ఉపేక్షిస్తే వచ్చే ఎన్నికల్లో పెద్దపురంలో వైసీపీ కొత్తగా ఆశించేది ఏమీ ఉండబోదని అభిప్రాయపడుతున్నారట కార్యకర్తలు. మరి.. అధిష్ఠానం ఏం చేస్తుందో చూడాలి.

Watch Here : https://youtu.be/f82PmBAX7rs

Exit mobile version