Site icon NTV Telugu

ఆదోని టీడీపీలో అసమ్మతి సెగలు

Tdpy

Tdpy

కర్నూలు జిల్లా ఆదోని ఒకప్పుడు టీడీపీకి బాగా పట్టున్న నియోజకవర్గం. ప్రస్తుతం ఆదోని టీడీపీ ఇంచార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కొనసాగుతున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ 42 వార్డులకు గాను.. టీడీపీకి దక్కింది ఒక్క వార్డే. 5 గ్రామ పంచాయతీలలోనే టీడీపీ మద్దతుదార్లు గెలిచారు. రెండు ఎంపీటీసీలు దక్కాయి. పరిస్థితి ఈ విధంగా దిగజారిపోయినా పార్టీ నేతలు వర్గపోరును విడిచిపెట్టడం లేదు.

ఆదోనిలో టీడీపీ పరాజయానికి.. పతనానికి మీనాక్షి నాయుడు కుటుంబమే కారణమని అసమ్మతి వర్గం చంద్రబాబుకు ఫిర్యాదు చేసిందట. ఇంఛార్జ్‌ హోదాలో ఆయన టీడీపీ బలోపేతం చేయడం లేదని.. కేడర్‌ను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారట. అధికారపార్టీని సమర్ధంగా ఎదుర్కోలేకపోతున్నట్టు ఆరోపిస్తున్నారు. పైగా వైసీపీ ఎమ్మెల్యేతో సంబంధాలున్నాయని.. చంద్రబాబుకు చెప్పేశారట.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మీనాక్షినాయుడు సోదరుడు ఉమాపతి అన్నీ తానై వ్యవహరించారని.. అధికారంపోయాక పార్టీని పట్టించుకోలేదని.. పత్తా లేకుండా పోయారని చంద్రబాబుకు ఫిర్యాదు చేసిందట అసమ్మతివర్గం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు కనీసం ప్రోత్సాహం లేదని.. ఆర్థికంగా కూడా మద్దతివ్వకపోవడంతో ఎన్నికల్లో ఓడిపోయినట్టు తెలిపారట. మీనాక్షి.. మీనాక్షి బ్రదర్‌ మీద పీకల్లోతు కోపంతో ఉన్న అసమ్మతి గ్రూప్‌.. టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంది. తమను సమావేశాలకు కూడా పిలవడం లేదని.. గుర్రుగా ఉందట. ఇటీవల టీడీపీ ఆవిర్భావ కార్యక్రమాలను సైతం విడిగానే చేసింది అసమ్మతి వర్గం.

ఆదోనిలో టీడీపీకి పూర్వ వైభవం రావాలంటే పార్టీ బాధ్యతలు మరొకరికి అప్పగించాలని.. ఎన్నికల్లో అభ్యర్థిని కూడా మార్చాలని అసమ్మతి వర్గం చెప్పిందట. ఆదోని మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మధిర భాస్కర్ రెడ్డి, మరో మాజీ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, తుంగభద్ర LLC మాజీ చైర్మన్ రామస్వామి, గుడిసె శ్రీరాములు, మైనారిటీ నేత గుజరి రవూఫ్ తదితరులు అసమ్మతి గ్రూపులో ఉన్నారట. గమ్మత్తు ఏంటంటే.. మీనాక్షి నాయుడిపై తిరుగుబాటు చేస్తున్న అసమ్మతివర్గంలో ఉన్నవాళ్లంతా ఒకప్పుడు ఆయనతో ఉన్నవాళ్లే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా మీనాక్షినాయుడు పదవులు ఇచ్చి ప్రోత్సహించిన వారే.

ఆదోని టీడీపీ నాయకత్వం మార్చాల్సిందేనని అసమ్మతి వర్గం గట్టిగా డిమాండ్‌ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మీనాక్షినాయుడుకు కాకుండా వేరొకరికి టికెట్‌ ఇవ్వాలని కోరారట. వీళ్లు ఇంతగా గొడవ చేస్తుంటే హైకమాండ్‌ మాత్రం మీనాక్షి వైపే మొగ్గు చూపిస్తోంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఇంఛార్జ్‌ మీనాక్షినాయుడే సుప్రీం అని.. అసమ్మతి వర్గం కూడా ఆయన ఆదేశాల ప్రకారమే నడుచుకోవాలని చెప్పారట. అంతేకాదు.. అసమ్మతి వర్గానికి షోకాజ్‌ ఇవ్వడానికి సిద్ధమైనట్టు సమాచారం. ట్విస్ట్‌ ఏంటంటే.. అతన్ని మార్చండి బాబో అంటున్న అసమ్మతి వర్గంపై మీనాక్షి నాయుడు సానుభూతి చూపిస్తున్నారట. వాళ్లు కూడా నా వర్గమే.. వాళ్లే వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపుతారు అని చెబుతున్నారట. మరి.. ఆదోని టీడీపీని గాడిలో పెట్టేందుకు పార్టీ ఎలాంటి మంత్రం వేస్తుందో చూడాలి.

 

Exit mobile version