8 ఏళ్లు.. నలుగురు సారథులు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ పరిస్థితి ఇది. ఎందుకిలా? ఇప్పుడీ శాఖపై జరుగుతున్న చర్చ ఏంటి? ఎదురయ్యే సవాళ్లేంటి?
8 ఏళ్లలో నలుగురు మంత్రులు..!
వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. ప్రస్తుతం తెలంగాణలో హాట్ సీట్. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఈ విభాగంలో మంత్రులుగా చేసిన వారిలో ఇద్దరు బర్తరఫ్ కాగా.. మరొకరికి మళ్లీ కేబినెట్‌లో చోటు దక్కలేదు. ఈటల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత ఈ మంత్రిత్వ శాఖను కొన్నాళ్లను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించారు. పేరుకు సీఎం పర్యవేక్షనే అయినా.. స్వయంగా చూసిందంతా మంత్రి హరీష్‌రావే. ఇప్పుడు అదే హరీష్‌రావుకు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ బాధ్యతలు కూడా అదనంగా అప్పగించారు. దీంతో 8 ఏళ్లలో నలుగురు సారథలు వచ్చారని వైద్య ఆరోగ్య శాఖలో ఒక్కటే చర్చ…!
అప్పట్లో రాజయ్య బర్తరఫ్..!
లక్ష్మారెడ్డికి మళ్లీ కేబినెట్‌లో దక్కని చోటు..!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ప్రభుత్వంలో తాటికొండ రాజయ్య డిప్యూటీ సీఎం హోదాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన మంత్రిగా బాధ్యత చేపట్టిన 8 నెలలకే అనుకోని వివాదాల్లో ఇరుక్కున్నారు. చివరకు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయ్యారు. తర్వాత వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికల వరకు ఆయనే హెల్త్ మినిస్టర్. ఆ ఎన్నికల్లో ఆయన మరోసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. కేబినెట్‌లో చోటు దక్కలేదు.
ఈటల సైతం కేబినెట్ నుంచి బర్తరఫ్..!
2018 ఎన్నికల తర్వాత వరసగా రెండోసారి తెలంగాణలో అధికారం చేపట్టిన టీఆర్ఎస్.. ఈటల రాజేందర్‌ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని చేసింది. మొదటి టర్మ్‌లో ఈటల ఆర్థిక మంత్రిగా ఉన్నారు. పలు ఆరోపణల మధ్య ఈ ఏడాది మే నెలలో కేబినెట్ నుంచి బర్తరఫ్ అయ్యారు ఈటల. ఆపై సీఎం కేసీఆర్ దగ్గరే ఈ మంత్రిత్వ శాఖ ఉండిపోయింది. ఇప్పుడు ఆర్థిక మంత్రి హరీష్‌రావుకు వైద్య ఆరోగ్య శాఖను అదనపు బాధ్యతలుగా అప్పగించారు.
హరీష్‌రావు కొత్త సారథ్యం..!
మొదటి నుంచి అనేక నాటకీయ పరిణామాలకు వేదికైన హెల్త్ మినిస్ట్రీలో.. ఇప్పుడు అనేక సవాళ్లు ఉన్నాయి. కోవిడ్ కాలంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతున్న సమయంలో కొత్త సారథిగా హరీష్‌రావు వచ్చారు. దీంతో రాజకీయ, ఉద్యోగ వర్గాల్లో ఆసక్తికర చర్చా మొదలైంది.
