Comedian Satya Leading in Telugu Comedy Special Story: తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నంతమంది కమెడియన్లు ఇక ఏ సినీ పరిశ్రమలో ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు చూసుకుంటే రేలంగి, రమణారెడ్డి వంటి వారితో మొదలుపెట్టి బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, చిట్టిబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలో ఉండేవారు. ఎవరికివారు తమదైన శైలిలో సత్తా చాటే ప్రయత్నం చేస్తూ ఉండేవారు. అయితే ఈ అందరిలో ఎక్కువగా చాలాకాలం పాటు నిలబడిన కమెడియన్స్ ఎవరంటే ఒక తరానికి బ్రహ్మానందం, కాగా తర్వాతి తరానికి సునీల్ అని చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాలు కేవలం వీరి కామెడీ వల్లనే నడిచాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వారి తర్వాత ఆ స్థాయిలో అంతే నేచురల్ గా నటించే కమెడియన్లు తెలుగుకి దొరకలేదు అని భావిస్తూ వచ్చారు. అయితే అడపా దడపా సత్య మంచి సినిమాలతో ఆకట్టుకుంటూ వచ్చాడు.
Samantha: సమంత.. ఉమెన్ ఆఫ్ ది ఇయర్
ఇక నిన్న రిలీజ్ అయిన మత్తు వదలరా 2 సినిమాతో తనలోని కామెడీ విశ్వరూపం మొత్తాన్ని సత్య ప్రేక్షకులకు పరిచయం చేశాడు. నిజానికి సత్య సినిమాల మీద ఉన్న పిచ్చితో బీటెక్ మధ్యలోనే ఆపేసి అమలాపురం నుంచి హైదరాబాద్ వచ్చాడు. ద్రోణా లాంటి కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తూ సినీ రంగంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అదే క్రమంలో అమృతం సీరియల్ కి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తూనే అడపాదడపా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉండేవాడు. అయితే సత్యము బ్రేక్ తీసుకు వచ్చిన క్యారెక్టర్ పిల్ల జమిందార్. ఆ సినిమా దెబ్బతో ఏకంగా పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్, కెమెరామెన్ గంగతో రాంబాబు లాంటి సినిమాలు పడ్డాయి.
ఆ తర్వాత చేసిన స్వామి రారా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, కార్తికేయ లాంటి సినిమాలు బాగా వర్కౌట్ అయ్యాయి. తర్వాత దొరికిన రౌడీ ఫెలో అంటే సినిమాలో ఆయనకు పడిన పాత్రలు కామెడీ యాంగిల్ ని ఎలివేట్ చేస్తూ మంచి కమెడియన్గా నిలబడగలడు అనే నమ్మకాన్ని ఇచ్చింది. ఇక మత్తు వదలరా సినిమాతో మరింత పేరు తెచ్చుకున్న సత్య తర్వాత వివాహ భోజనంబు సినిమాతో హీరోగా కూడా మారాడు. అయితే ఒకరకంగా చెప్పాలంటే జబర్దస్త్ అనే షో మొదలైన తర్వాత కామెడీ చేయించడం రెండూ కష్టంగా మారిపోయాయి. ఉన్న కామెడీ కంటెంట్ మొత్తాన్ని వారం వారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేసేందుకు జబర్దస్త్ నిర్వాహకులు చాలా కష్టపడుతున్నారు.
ఆ షో ద్వారా వచ్చిన చాలామంది కమెడియన్లుగా మారి తర్వాత హీరోలుగా మారే ప్రయత్నం చేస్తున్నా అవి అంతగా సక్సెస్ కాలేదు. అయితే ఇలాంటి తరుణంలో కూడా సత్య లాంటి పెర్ఫార్మర్లు దొరికినప్పుడు రితేష్ రానా లాంటి డైరెక్టర్లు ఖచ్చితంగా వారిని వాడుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే నిన్న మత్తు వదలరా 2 సినిమా హీరో కీరవాణి కొడుకు శ్రీ సింహా అయినా సరే సత్య మాత్రం మత్తు వదలరా 2 సినిమాని తన భుజస్కంధాల మీద మోసినట్లు అనిపించింది. అతని టైమింగ్ డైలాగ్ డెలివరీ సహా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా ప్రేక్షకులను నవ్వించేలా ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమను యోగి బాబు అనే కమీడియన్ ఏలుతుంటే తెలుగు కామెడీ రంగంలో మాత్రం సత్య లీడింగ్ ప్లేస్ లో ఉన్నాడని చెప్పొచ్చు.