Site icon NTV Telugu

iBomma: పైరసీ నష్టం సరే.. మరి సినీ పెద్దల దోపిడీ సంగతేంటి?

Ibomma

Ibomma

ibomma: దమ్ముంటే పట్టుకోండని సవాల్‌ విసిరితే… చూస్తూ ఊరుకుంటారు.. తాట తీశారు సీపీ సజ్జనార్‌. సినామా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం తెచ్చిపెడుతూ… జనాల పర్సనల్‌ డేటా చోరీ చేస్తూ.. దేశ భద్రతకే ముప్పుగా మారిన ఇమంది రవి ఆటకట్టించారు. ఇమంది రవిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏళ్ల తరబడి రవి సృష్టించుకున్న పైరసీ రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించారు. ఇప్పటికే ఐ బొమ్మ. బప్పం టీవీ, ఇరాదా వంటి సైట్లను క్లోజ్‌ చేసిన పోలీసులు… పైరసీ కంటెంట్‌ ఉన్న మిగతా వెబ్‌సైట్లపై యాక్షన్‌కు సిద్దమవుతున్నారు. తీగ లాగితే డొంక కదిలింది, ఇమ్మడి రవి సృష్టించుకున్న పైరసీ కోటను బద్దలు కొట్టారు హైదరాబాద్‌ పోలీసులు. ఇన్నాళ్లుగా పేరు, ఊరు, ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు…ఇలా ఏ ఒక్కటీ బహిర్గతం కాకుండా జాగ్రత్తపడ్డ ఇమంది రవి .. హైదరాబాద్‌ పోలీసుల ట్రాప్‌లో పడి అడ్డంగా దొరికిపోయాడు. దమ్ముంటే పట్టుకోండని సవాల్‌ విసిరి.. ఇప్పుడు జైల్లో ఊసలు లెక్కపెడుతున్నాడు.

బెట్టింగ్‌ యాప్‌లు, గేమింగ్‌ యాప్‌లపై నిఘా పెట్టిన పోలీసులకు… ఐ బొమ్మ, బప్పం టీవీ లీడ్‌ దొరికింది. ఈ దిశగా దర్యాప్తు చేస్తే.. ఇమంది రవి నెట్‌వర్క్‌ను గుర్తించగలిగారు. పైరసీ కేసులో రెండు నెలల క్రితం అరెస్ట్‌ అయిన శివాజీ, ప్రశాంత్‌ అనే ఇద్దరు నిందితులు కూడా ఇమంది రవి అనే పేరు ప్రస్తావించడం.. బెట్టింగ్‌ యాప్‌ దర్యాప్తులోనూ ఈ పేరు వినిపించడంతో లైన్ దొరికింది. రవి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టారు. హైదరాబాద్‌ వస్తున్నాడని గ్రహించి అరెస్ట్‌ చేశారు. ఐబొమ్మ రవిని అరెస్టు చెయ్యడంతో సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. చిరంజీవి, నాగార్జున, దిల్‌ రాజు, రాజమౌలి, సురేష్‌ బాబుతోపాటు మరికొందరు ప్రొడ్యూసర్లు సీపీ సజ్జనార్‌ను కలిశారు. ఇమంది రవి నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్‌ డిస్క్‌లను వీళ్లకు చూపించారు సీపీ.

ఐ బొమ్మ పైరసీ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. రవి చెప్పిన మాటలకు పోలీసులు షాక్ అయ్యారు. రవి హార్డ్ డిస్కులో 21 వేల సినిమాలు ఉన్నాయి. రవి దగ్గర టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు.. ఇంకా ఇతర భాషా సినిమాలు కూడా వున్నాయి. ఇమంది రవికి ఆదాయం పైరసీ సినిమాల వల్లే కాదు…బెట్టింగ్‌ యాప్‌ నిర్వాహకుల నుంచి కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తోందని పోలీసుల విచారణలో తేలింది. ముఖ్యంగా వన్‌ ఎక్స్‌ బెట్టింగ్‌ యాప్‌ కి ఐ బొమ్మ, బప్పం టీవీ ద్వారా ప్రమోషన్‌ చేసినట్లు గుర్తించారు. తన వెబ్‌సైట్‌ వీక్షకులు, సినిమాలు డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న వారి పర్సనల్‌ డేలా చోరీ చేసి డార్క్‌ వెబ్‌లకు అమ్ముతున్నట్లు కూడా గుర్తించారు. ఇదే మరింతగా ఆందోళన కలిగించే విషయం. జనాల డేటాను ఏం చేశాడు? ఎవరికి అమ్ముకున్నాడు? వారు ఆ డేటాతో ఏం చేశారన్నదానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఫ్రీగా కొత్త సినిమాలు చూస్తున్నాం అని జనాలు అనుకుంటున్నారు కానీ.. మీ డేటా చోరీ చేసి..ప్రమాదంలోకి నెడుతున్నాడని ప్రజలు గుర్తుంచుకోవాలంటున్నారు పోలీసులు. సినిమా ఇండస్ట్రీ కంటే ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారని పోలీసుల వాదన.

సినిమాలను పైరసీ చెయ్యడం, లేదంటే బయటి వ్యక్తులతో పైరసీ సినిమాలను కొనుగోలు చేసి తన సైట్‌లో అప్‌లోడ్‌ చేయడమే కాకుండా… తనకున్న టెక్నాలజీ తెలివితో కొన్ని సైట్లను హ్యాక్‌ చేసి సినిమా కాపీలను దొంగిలించి అప్‌లోడ్ చేశాడు రవి. అటు పైరసీ సినిమాలు అమ్మిన డబ్బులు, ఇటు బెట్టింగ్‌ నిర్వాహకుల నుంచి కాసులు…కోట్లు వెనకేసున్నాడు. ఆస్తులు పోగేశాడు. కరేబియన్ దీవుల్లో అతని లగ్జరీ లైఫ్, వివాహ జీవితం, అతని కుటుంబ నేపథ్యం, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి పైరసీ చోర్‌గా మారిన తీరు…అన్నింటికంటే పోలీసులకు అతను చిక్కిన ప్రాసెస్….విడాకులు తీసుకోవాలనుకుంటున్న భార్య పాత్ర…సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది.

ఇమంది రవి. విశాఖపట్నం స్వస్థలం. బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివాడు. ఎంబీఏ కూడా కంప్లీట్ చేశాడు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేశాడు. టెక్నికల్‌ పరంగా మంచి ఎక్స్‌పర్ట్. హ్యాకింగ్‌ లోనూ దిట్ట. కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలను సొంతంగా పెట్టాడు. నష్టాలు రావడంతో మూసేశాడు. సినిమాలు బాగా చూసేవాడు. పైరసీ సినిమాలు చూసే అలవాటున్న రవి…ఏకంగా పైరసీ సినిమాలను అప్‌లోడ్‌ చేసేందుకు ఓ వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేశాడు. తన పేరుతో వచ్చేలా ఐ బొమ్మ అని పేరు పెట్టాడు. బ్యాకప్‌లో భాగంగా.. బప్పం టీవీ, ఇరాదా వంటి మరికొన్ని వెబ్‌సైట్‌ లను సృష్టించాడు. టెలిగ్రాం యాప్‌లో పైరసీ సినిమాలు అప్‌లోడ్ చేశాడు. ఇలా ఏకంగా 70 కి పైగా వెబ్‌సైట్లు నిర్వహిస్తున్నాడు.

సినిమాలను పైరసీ చెయ్యడం నేరమని తెలుసు. అయినా అత్యాశతో అడ్డదారి వెతుక్కున్నాడు. ఎప్పుడో ఒకప్పుడు దొరక్క తప్పదని తెలిసి…పక్కాగా బ్యాకప్‌ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాడు. వేరే పేర్లతో మహారాష్ట్రలో డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డులు తీసుకున్నాడు. సినీరంగం అప్రమత్తమై ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు వెంటాడారు. దీంతో భారత పౌరసత్వాన్ని వదిలి కరేబియన్‌ దీవుల్లో ఉన్న సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ దేశ పౌరసత్వం తీసుకున్నాడు. ఫ్రాన్స్‌లో ఉంటూ వివిధ దేశాలు తిరిగేవాడు. 2019లో ఐబొమ్మ ప్రారంభించి 21 వేల సినిమాలు పైరసీ చేశాడు. అమెరికా, స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్స్‌లో సర్వర్లను పెట్టాడు. 110 డొమైన్స్‌ కొనుక్కున్నాడు. ఒకటి బ్లాక్‌ చేస్తే మరొకటి ఓపెన్‌ చేస్తూ పైరసీ చిత్రాలు రిలీజ్ చేశాడు. DRM టెక్నాలజీతో నిమిషాల్లో ఓటీటీ వెబ్‌సైట్లను హ్యాక్ చేసేవాడు. మూవీరూల్జ్, ఇతర పైరసీ సైట్ల నుంచి సినిమాలను డౌన్‌లోడ్ చేసి, HD ఫార్మాట్‌కు కన్వర్ట్ చేసి ఐబొమ్మలో అప్‌లోడ్ చేసేవాడు.

కేవలం పైరసీ ద్వారానే ఈస్థాయిలో సంపాదన సాధ్యంకాదు. కానీ ఐబొమ్మ రవి కోట్లకు పడగలెత్తాడు. అందుకు బెట్టింగ్ ముఠాలతో చేతులు కలిపాడు. ఫ్రీ మూవీ ముసుగులో బెట్టింగ్‌, గేమింగ్ వల విసిరాడు. ఐబొమ్మలో మూవీ స్టార్టింగ్, మధ్యలో, చివర్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. డౌన్‌లోడ్‌ క్లిక్ చెయ్యగానే, బెట్టింగ్‌ వెబ్‌సైట్లు కనిపించేలా వెబ్‌సైట్ డిజైన్ చేశాడు. జనంతో APK ఫైల్స్ డౌన్‌లోడ్‌ చేయించి పర్సనల్ డేటా దొంగిలించాడు. దాదాపు 50లక్షలమంది సబ్‌స్ట్రైబర్ల డేటా రవి దగ్గర ఉందని తెలుస్తోంది. 35 బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేశాడు. హైదరాబాద్‌లో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో కాస్ట్‌లీ ఫ్లాట్ కొన్నాడు. ఇంకా చాలా చోట్ల ఆస్తులు పోగేసుకున్నాడు.

రవి వ్యక్తిగత జీవితం గందరగోళం. మొదటి భార్యకు ఎప్పుడో విడాకులిక్చాడు. 2022లో ఓ ముస్లిం అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూడా విడాకులు ఇచ్చాడు. ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఆమె వుంటోంది. ఆమెతో విడాకుల సెటిల్‌మెంట్‌ వ్యవహారం నడుస్తోంది. మరోవైపు తనపై పోలీసుల ఫోకస్ పెరగడంతో, హైదరాబాద్‌, వైజాగ్‌లో తన పేరు మీదున్న ఆస్తులు అమ్మాలని డిసైడయ్యాడు. తాను ఎలా వుంటాడో బాహ్య ప్రపంచానికి తెలియకపోవడంతో, తననెవరూ గుర్తుపట్టలేరని భావించి హైదరాబాద్‌ వచ్చే ప్రయత్నం చేశాడు. భారత్‌ లో ఉన్న ఆస్తులను అమ్ముకుని పూర్తిగా కరేబియన్‌ లో సెటిల్‌ అయ్యేందుకు ప్లాన్‌ చేసుకున్నాడు. ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా హైదరాబాద్ వచ్చాడు. అతను వస్తున్న విషయం మాజీ భార్య పోలీసులకు ఉప్పందించిందన్న ప్రచారం జరుగుతోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు…కూకట్‌పల్లిలోని గేటెడ్‌ కమ్యూనిటీలో వున్న రవిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించిన తర్వాత మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆయన దగ్గర్నుంచి క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డులు, హార్డ్‌ డిస్క్‌లు, మూడు ల్యాప్‌టాప్‌లు, ఆరు సీపీయూలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

తన కొడుకు బాధ్యతగా జీవిస్తున్నాడని భావించాను గాని… పనికి మాలిన పనులు చేస్తాడనుకోలేదన్నారు ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ నిర్వాహకుడు ఇమంది రవి తండ్రి అప్పారావు. కొడుకును డిగ్రీ వరకూ చదివించానన్నారు. తన కోడలు మంచిదని… ప్రేమించానంటే దగ్గరుండి పెళ్లి చేశానన్నారు. సినిసిమా ఇండస్ట్రీపై మీద ఆధారపడి ఎన్నో వేలమంది బతుకుతున్నారు. వారి కష్టాన్ని దౌర్జన్యంగా దోచుకుంటున్నాడు ఐబొమ్మ రవి. ఇండస్ట్రీకి వేల కోట్ల రూపాయల నష్టం తెస్తున్నాడు. ఐబొమ్మ రవిని పోలీసులు పట్టుకోవడంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఐ బొమ్మ రవి అరెస్టుపై సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది. ఏదీ ఉచితంగా రాదు. ఒకవేళ అలా వస్తే దాని వెనక పెద్ద ప్రమాదం పొంచి ఉంటుందని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఫ్రీ సినిమా అనేది కేవలం ఒక ముసుగు మాత్రమే. దానితో వల వేసి, జనాల డేటాను చోరీ చేస్తున్నాడు ఐబొమ్మ రవి. బెట్టింగ్‌ యాప్‌లతో జనాలకే ఎక్కువ నష్టం చేస్తున్నాడని…తన కుటుంబంలోనూ ఒకరు డిజిటల్ అరెస్ట్‌ అయిన విషయాన్ని చెప్పారు మరో నటుడు నాగార్జున. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యిండి…మూవీ చోర్‌గా మారాడు ఇమ్మంది రవి. వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు. చివరికి దొరికాడు.

పైరసీ కేటుగాళ్లు ప్రతిరోజూ పట్టుబడుతున్నారు. కొన్ని సైట్లు మూతపడుతున్నాయి. కానీ కొన్నాళ్ల తర్వాత మరో పేరుతో సైట్లు పెట్టేస్తున్నారు. జనాలు కూడా పైరసీ సినిమాలను ఎగబడి చూస్తున్నారు. అంటే పైరసీని అరికట్టడం ఐబొమ్మ రవిని పట్టుకున్నంత ఈజీ కాదు. అతను హైదరాబాద్ వచ్చాడు కాబట్టి..పోలీసులు పట్టుకోగలిగారు. కరీబియన్ దీవుల్లోనే వుండివుంటే…అతను పట్టుబడేవాడా అనేది డౌట్. ఇప్పుడతన్ని పట్టుకున్నారు. అతను కాకపోతే మరొకడు, మరో దేశం నుంచి దర్జాగా కొత్త పైరేటెడ్ సినిమాలను అప్‌లోడ్ చేస్తుంటాడు. ఇక్కడ పరిష్కారం కంటికి కనపడని పైరసీ కేటుగాళ్లను పట్టుకోవడం కాదు….పైరసీ వైపు చూడకుండా స్వచ్చందంగా జనాలు థియేటర్‌కు వచ్చేలా చెయ్యడం…కానీ ఆకాశాన్నంటుతున్న సినిమా టికెట్లు, క్యాంటీన్ ఫీజులతో సామాన్య ప్రేక్షకులు టాకీస్‌కు వచ్చే పరిస్థితి వుందా?

ఐ బొమ్మ రవిని పట్టుకోగానే సినీ పెద్దలంతా పండగ చేసుకుంటున్నారు. తమ కష్టాన్ని దోచుకుంటున్నవాన్ని అరెస్టు చేసినందుకు పోలీసులకు శతకోటి ధన్యవాదాలంటున్నారు. మరి బెనిటిఫిట్ షోల పేరుతో ప్రేక్షకులను దోచుకుంటున్నది ఎవరనే ప్రశ్న సగటు జనాల నుంచి దూసుకొస్తోంది. సినిమా థియేటర్‌ వైపు రాకుండా, రేట్లతో భయపెడుతున్నది ఎవరు? పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు….సినీ పెద్దల హడావుడి అంతా ఇంతకాదు. పాలకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వాలని వేడుకుంటున్నారు. చివరికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని….అమాంతం రేట్లు పెంచేసుకుంటారు. ఒక్కో టికెట్ రేట్‌ను ఓ రేంజ్‌లో పెంచేస్తారు. మరి బెనిఫిట్ షోల పేరుతో వసులూ చేస్తున్న డబ్బులు ఎవరి బెనిఫిట్ కోసం…? జనాల అభిమానాన్ని టికెట్ల రూపంలో ఇంతగా దోచుకోవాలా? పైరసీ దోపిడీ అయినప్పడు ఇది కూడా దోపిడీ కాదా అని జనం ప్రశ్నిస్తున్నారు. అట్టర్ ఫ్లాప్ సినిమాకు బీభత్సమైన హైప్ క్రియేట్ చేసి మొదటి రెండ్రోజులు అడ్డంగా దోచుకోవడం దోపిడీ కాదా అని క్వశ్చన్స్ చేస్తున్నారు.

బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల పేరుతో సినీ నిర్మాతలు జనాల జేబులకు చిల్లు పెడుతుంటే మల్టీప్లెక్స్ యాజమాన్యాల క్యాంటీన్‌ దోపిడీ మరో ఎత్తు. వాటర్ బాటిల్ రెండొందలకు అమ్మేస్తారు. కూల్‌డ్రింక్స్ మూడొందలు అంటారు. పాప్‌కార్న్ కాంబో నాలుగొందలు తక్కువ వుండదు. ఒక్కోసారి టికెట్‌ రేట్ల కన్నా…పాప్‌ కార్న్ ధరలే అధికంగా వుంటాయి. అటు టికెట్ రేట్ల పెంపు, ఇటు క్యాంటీన్ ధరలతో మధ్యలో దోపిడీకి గురవుతున్నది సగటు ప్రేక్షకుడే. ఫ్యామిలీతో కలిసి వీకెండ్‌లో థియేటర్‌కు వెళితే ఈజీగా 10 వేలు ఖర్చయిపోతాయి. అలా నెలకు రెండుసార్లు వెళ్లినా….అతని నెల జీతంలో సగం వినోదానికి సమర్పితం. మరో విచిత్రమేమిటంటే.. థియేటర్లలో విక్రయించే కొన్ని తినుబండారాలపై ప్రత్యేక ఎమ్మార్పీలుంటాయి. ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఎమ్మార్పీకే విక్రయిస్తున్నాం అని క్యాంటీన్ల నిర్వాహకులు దబా యిస్తుంటారు. థియేటర్లలో ధరలు భరించలేని వారెవరైనా బయట నుంచి తినుబండారాలను తీసుకెళ్లడానికి అనుమతించరు. కనీసం మంచి నీళ్ల బాటిల్‌ను కూడా తీసుకెళ్లనీయరు. గేటు బయటే అలాంటి వాటిని తిరస్కరిస్తారు. విధి లేని పరిస్థితుల్లో ప్రేక్షకులు చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోంది. అటు నిర్మాతలు, ఇటు థియేటర్ల యాజమాన్యాలు జనాలను నిలువునా దోచేస్తున్నాయి.

సినిమాకు వెళితే రేట్ల సినిమా తప్పదని ఓటీటీ వరకు వేచిచూద్దామని చాలామంది అనుకుంటారు. కానీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల దోపిడీ నెక్ట్స్ లెవల్. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు భారీగా పెంచేశాయి. కొన్ని చిత్రాలైతే ఓన్లీ ఏదో ఒక ఓటీటీలోనే ఎక్స్‌క్లూజివ్‌గా రిలీజ్ అవుతుంది. అంటే సినిమా బాగుందన్న టాక్‌ వస్తే….సచ్చినట్టుగా డబ్బులు కట్టాల్సిందే. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ కూడా భారీగా దండుకుంటున్నాయి. ఇదీ పైరసీ కేటుగాళ్లు మధ్యతరగతి జనాల ఇలాంటి ఇబ్బందులను క్యాష్‌ చేసుకుంటున్నారు. ఇలా ఎడాపెడా అందరూ సినీ ప్రేక్షకులను దోచుకుంటున్నారు. పైరసీతో తమ కష్టాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్న సినీ పెద్దలు…తమ దోపిడీ గురించి మాత్రం మాట్లాడరు. జనాలను పైరసీకి ఆశ్రయించేలా చేసిందే కొందరు బడా దర్శకులు, నిర్మాతలు, హీరోలు. తమ సూపర్ డూపర్ గా వుంటుందని ఏవేవో ప్రచారాలు సృష్టించి, థియేటర్‌కు పిలిచి జేబులు కొల్లగొడుతున్నారు. సినిమా టికెట్ ఎందుకు పెంచుతున్నారంటే…భారీగా ఖర్చయ్యింది..ఎందుకు ఖర్చయిందంటే హీరోల రెమ్యూనరేషన్ ఎక్కువ…హీరోయిన్లు వారి వెంట వచ్చే వారి ఫైవ్ స్టార్ హోటళ్ల ఖర్చెక్కువ….దర్శకుల పారితోషికమూ ఎక్కువేనంటారు. అందుకే ఇంత రేట్ పెంచేశామంటారు. ఇంతరేటు పెట్టి కొనలేనివారు పైరసి చూస్తే….అయ్యో తమ కష్టం నీరుగారిపోయిందని లబోదిబోమంటారు. ప్రేక్షకున్ని థియేటర్‌కు రప్పించడానికి టికెట్ రేట్లు మాత్రం తగ్గించరు. పైరసీ ముమ్మాటికి తప్పే. ఐ-బొమ్మ రవిలాంటివారు చేసింది నేరమే. మరి సినీ పెద్దలు చేస్తున్నదేంటి? బెనిఫిట్ షోలు, క్యాంటీన్ రేట్లు ఎందుకంతగా పెంచేస్తున్నారని సగటు ప్రేక్షకుడు ప్రశ్నిస్తున్నాడు. ఐబొమ్మ రవితోనే పైరసీ ఆగిపోదు. కొత్తకొత్త కేటుగాళ్లు వస్తూనే వుంటారు. దీనికి పరిష్కారం టికెట్ రేట్లు, క్యాంటీన్ ధరలు సామాన్యులకూ అందుబాటులోకి తేవడమేంటున్నారు ప్రేక్షకులు.

Exit mobile version