NEET Exam Cancelled: ఎన్నో ఆశలు.. ఇంకెన్నో ఆకాంక్షలు.. కంటిమీద కునుకు లేకుండా.. రాత్రి పగలు అన్న తేడా లేకుండా… శక్తినంతా ధారపోసి చదివిన కష్టం మొత్తం.. బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయింది.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో నీట్(NEET) మాఫియా చెలగాటమాడుతోంది. ఎంతో పకడ్బందీగా.. పారదర్శకంగా మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించాల్సిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. మరోసారి తాను ఎంత పనికిమాలిన సంస్థో నిరూపించుకుంది. ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు… ప్రతి యేటా ఇదే తంతు.. అసలు నీట్ పేపర్లు ఎందుకు లీక్ అవుతున్నాయి..? ఎడ్యుకేషన్ మాఫియా నెట్‌వర్క్‌ల వెనుక ఉన్నదెవరు..? లక్షల మంది విద్యార్థుల జీవితాలను ప్రతి సంవత్సరం రోడ్డున పడేస్తున్నదెవరు…? 
CBI విచారణకు ఆదేశం:
దేశంలో… ఎక్కడో ఒక మూల.. ఎవరికీ తెలియకుండా విద్యార్థులు నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండొచ్చు. ఏళ్ల తరబడి నిద్రలేకుండా చదివిన చదువు.. రాసిన పరీక్షకు అర్థం లేకుండా పోయిందన్న బాధతో విద్యార్థులే కాదు.. వాళ్ల తల్లిదండ్రులు కూడా మౌనంగా రోదిస్తూ ఉండొచ్చు.. ఎంతో ప్రతిష్టాత్మకమైన మెడికల్ ఎంట్రెన్స్ పరీక్ష నీట్ కు సంబంధించి.. త్వరలోనే ఫలితాలు వస్తాయని… తమ వైద్య విద్య కల నెరవేరబోతోందని.. కలలు కంటున్న లక్షలాది మంది విద్యార్థుల గుండెలు… ఇప్పుడు రగిలిపోతున్నాయి. మే 3న నీట్ పరీక్ష రాసి మెడికల్ సీటు వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న 22.79 లక్షల మంది విద్యార్థుల కలలను చిదిమేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ- ఎన్టీఏ. పేపర్ లీక్ కారణంగా పరీక్ష రద్దు చేస్తున్నట్లు.. మళ్ళీ కొత్తగా నిర్వహించబోతున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశించింది.
కష్టానికి విలువేలేదు:
తమ తాహతుకు మించి.. లక్షలు ఖర్చు చేసి తల్లిదండ్రులు తమ పిల్లలను నీట్‌కు సన్నద్ధం చేస్తూ ఉంటారు. ఒక్క మార్కు తేడాతో కూడా జీవితాలు మారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి.. స్టూడెంట్స్ కూడా ఎంతో శ్రద్ధతో అన్నీ త్యాగం చేసి మరీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంటి వారి కష్టానికి విలువ లేకుండా చేస్తున్నాయి పేపర్ లీక్ మాఫియా అడ్డాలు. ఈ మొత్తం ఆపరేషన్‌కు కేంద్రం రాజస్థాన్‌లోని సికార్. అక్కడ సగటు విజయాల శాతం జాతీయ సగటు కంటే ఆరు రెట్లు ఎక్కువ. అది ఎలా సాధ్యం అని మీరు ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే నీట్ దందా అంతా ఇక్కడే సాగుతుంది. పరీక్షకు ఒక రోజు ముందే విద్యార్థులకు గెస్ పేపర్ పేరుతో ఒక మాక్ టెస్ట్ నిర్వహించారు. అందులో ఇచ్చిన 410 ప్రశ్నల్లో.. అసలు నీట్ పరీక్షలో వచ్చే 180 ప్రశ్నల్లో 140 ప్రశ్నలు యథాతథంగా ఉన్నాయి. ఆప్షన్ల క్రమం కూడా మారలేదు. అంటే పరీక్ష హాలులోకి వెళ్లకముందే విద్యార్థికి 720 మార్కులకు గానూ 600 మార్కులు గ్యారెంటీ అన్నమాట. 2024లో కూడా ఇలానే జరిగింది. అప్పుడు గ్రేస్ మార్కులు, పేపర్ లీక్ వార్తలు వచ్చినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చుట్టూ ఎన్నో వివాదాలు చుట్టు ముడుతున్నా… దాని పనితనం ఏమాత్రం మెరుగుపడక పోగా… ప్రతి యేటా ఇలాంటి లీకులతో మరింత భ్రష్టుపట్టి పోతోంది.
పేపర్లు అమ్ముకుంటుంది ఎవరు?
మరో షాకింగ్ విషయం ఏంటంటే.. పేపర్ల అమ్మకం. ఒక్కో పేపర్ ధర 5 లక్షల నుండి 20 లక్షల రూపాయల వరకు పలుకుతోంది. డబ్బున్న వారు పేపర్లు కొని డాక్టర్లు అయిపోతుంటే… పేద, మధ్యతరగతి విద్యార్థుల కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది. నీట్ ఇప్పుడు ఒక ప్రవేశ పరీక్షలా కాకుండా అదొక వేలం పాటలా మారిపోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి నీట్ పేపర్ బయటకు ఎలా వస్తుంది అన్న ప్రశ్న వేసుకుంటే… గోల్ మాల్ అంతా ఎన్టీఏ కేంద్రంగానే జరుగుతుందా అన్న అనుమానాలు రాకమానవు. సాంకేతికంగా మనం చాలా ముందున్నామని చెప్పుకుంటాం. జీపీఎస్ ట్రాక్డ్ పేపర్లు, ఏఐ, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ తనిఖీలు, చివరకు 5జీ జామర్లు కూడా వినియోగిస్తున్నారు. అయినా ఇవేవీ పేపర్ లీక్ మాఫియా ముందు పని చేయలేదు. అంటే లోపం సిస్టమ్‌లోనే ఉంది. వ్యవస్థ లోపల ఉన్నవారే ఈ సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నారన్నది క్లిస్టర్ క్లియర్.
ప్రభుత్వం కళ్లు తెరవదా?
విద్యార్థులు మానసిక వేదనలకు గురవుతున్నా… కొందరు ఆత్మహత్యల వరకు వెళ్తున్నా… మెడికల్ ఎంట్రన్స్ పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేకపోవడం సిగ్గుచేటు. పరీక్ష రద్దు చేయడం అనేది తాత్కాలిక పరిష్కారమే కానీ.. మళ్ళీ పరీక్ష రాసే విద్యార్థుల మానసిక పరిస్థితిని ఎవరు అర్థం చేసుకుంటారు? పదే పదే పరీక్షలు రాస్తూ కోచింగ్ సెంటర్లకు ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు కుంగిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. కేవలం విచారణలు కమిటీలతో కాలయాపన చేయకుండా, పేపర్ లీక్ మాఫియాను ఉక్కు పాదంతో అణచివేయాలి. ఒకవేళ దీని వెనుక ఎంత గొప్ప వ్యక్తులున్నా… ప్రభుత్వం ఉపేక్షించకూడదు.
చాలా పరీక్షలు ఇంతే:
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సమూల మార్పులు చేయాలి. ఎందుకంటే ఎన్టీఏనే భారీ ఎడ్యుకేషనల్ స్కామ్స్ కు కేంద్ర బిందువుగా మారుతోంది. నీట్ మాత్రమే కాదు… ఎన్టీఏ నిర్వహిస్తున్న ఇతర పరీక్షల్లో కూడా ఎన్నో లోపాలున్నాయి. అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. CUET టెస్ట్ కూడా ఎన్నో గందరగోళాలకు దారితీస్తోంది. CBSE దశాబ్దాల పాటు ఆల్ ఇండియా ఎంట్రెన్స్ టెస్ట్ లను విజయవంతంగా నిర్వహించింది. ఎలాంటి సంక్షోభాలు కనిపించలేదు. అలాగే ఐఐటీ-జేఈఈ పరీక్షలు కూడా ఎన్నో సంవత్సరాల పాటు ఎటువంటి లోపాలు లేకుండా జరిగాయి. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ప్రవేశ పరీక్షలను ఓ ప్రహసనంగా మార్చేసింది. ఇంకా చెప్పాలంటే మొత్తం విద్యా వ్యవస్థకే NTA ఓ మచ్చగా మారింది.
కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ప్రతి యేటా ఇలానే సంక్షోభంలో చిక్కుకుంటాయి. పరీక్షా పేపర్లు లీక్ అయినప్పుడు విచారణకు ఆదేశించి చేతులు దులుపుకోకుండా… అసలు ఎలాంటి లీకులు, విమర్శలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించగలగాలి. ఎన్టీఏను ఎలా సంస్కరించాలి…? పూర్తి స్థాయి పారదర్శక , నైపుణ్యం కలిగిన ఒక ప్రొఫెషనల్ సంస్థగా ఎలా మార్చాలి అన్న అంశాలపై కేంద్రం తక్షణం ఫోకస్ చేయాలి. లేకపోతే భవిష్యత్తులో మన ప్రాణాలను కాపాడే డాక్టర్లు మెరిట్ ద్వారా వచ్చిన వారు కాకుండా.. పేపర్ కొనుక్కున్న వారు అవుతారు. ఇది దేశ భవిష్యత్తుకే ప్రమాదం.
:- ఫణి కుమార్ (NTV DIGITAL)
