NTV Telugu Site icon

Mega Family: ఇందుకు కదా ఫాన్స్ అయ్యేది.. కొణిదెల హీరోల ‘మెగా’ సాయం!

Mega Family

Mega Family

Mega Family Helping Nature : ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలియగానే వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చే వారిలో మెగా ఫ్యామిలీ వారు ఒక్కరైనా ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన అధ్యాయాన్ని సృష్టించుకున్న మెగాస్టార్ చిరంజీవి కేవలం సంపాదన మీదే దృష్టి పెట్టలేదు. ఒకపక్క తాను సామాజిక సేవ చేస్తూనే తన అభిమానులను సైతం సేవ చేసేలా ప్రోత్సహించాడు. అభిమానులనే అంతలా సేవ చేసేందుకు ప్రోత్సహించిన ఆయన కుటుంబ సభ్యులను ఇంకెంత ప్రభావితం చేసి ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి విపత్తు వచ్చినా సరే సాయం అందించడంలో మెగా కుటుంబ సభ్యులు రెడీగా ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ చరణ్ సహా వరుణ్ తేజ్ వంటి వారు సైతం భారీ విరాళాలు అందిస్తు.. పెద్ద మనసు చాటుకుంటున్నారు.

Devara: దేవర.. అన్నీ రివర్సే అవుతున్నాయే!

కేవలం నెల వ్యవధిలోనే మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు 10 కోట్ల సాయం అందించారు అంటే ఆశ్చర్యం కలుగక మానదు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకోవడానికి చిరంజీవి కోటి విరాళం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెరో 50 లక్షల విరాళం అందించారు. ఈ సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన కష్టాలు తీవ్రంగా కలిచి వేసినట్లు చిరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తండ్రి బాటలోనే తనయుడు రామ్ చరణ్ కూడా రెండు రాష్ట్రాలకు కోటి రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నానను.. అంటూ చరణ్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. భారీ విరాళాన్ని అందించారు. తనవంతు సాయంగా 6 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు.

ఇందులో ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్స్‌కు కోటి చొప్పున ఇస్తానని.. ఏపీలోని 400 పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున మొత్తం 4 కోట్లు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రెండు తెలుగు రాష్ట్రాలకు 10 లక్షలు.. AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ సూచించిన పంచాయతీ రాజ్ శాఖకు 5 లక్షలు, మొత్తం 15 లక్షలు విరాళంగా ఇచ్చారు. మొత్తంగా ఒక్క కొణిదెల ఫ్యామిలీ నుంచే తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు 8 కోట్లకు పైగా విరాళం అందింది. ఇక గత నెలలో కేరళ వయనాడ్‌ బాధితుల కోసం కూడా చిరు, చరణ్ భారీ విరాళం చేసిన తెలిసిందే. స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిసి.. వయనాడ్‌ బాధితుల కోసం తన వంతు బాధ్యతగా కోటి రూపాయల చెక్కును అందజేశారు మెగాస్టార్. ఇలా.. మెగా హీరోలు చేసే సాయం చెప్పుకుంటూ పోతే.. ఆ లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది.

కరోనా సమయంలో సినీ కార్మికుల కోసం చిరు చేసిన సాయం అంతా ఇంతా కాదు. ఇక చిరంజీవి ‘ఐ అండ్ బ్లడ్ సెంటర్’ గురించి అందరికీ తెలిసిందే. ఇలా ఊహించని విపత్తు, మహమ్మారి, సామాజిక సేవా కార్యక్రమాలు అనే కాదు.. అభిమానుల కోసం, జర్నలిస్టుల కోసం ఈ మెగా హీరోలు చేసిన సహాయాలు చాలానే ఉన్నాయి. అందులో.. బయటకు వచ్చినవి కొన్ని, రానివి ఎన్నో. వాటిలో.. మచ్చుకు ఒకటి చెప్పుకుంటే.. తమిళ నటుడు పొన్నాంబళం కిడ్నీ సమస్యల కారణంగా తీవ్ర అనారోగ్యం బారిన పడినప్పుడు.. వైద్యానికి దాదాపు 60 ల‌క్ష‌లకు పైగా చిరు ఖ‌ర్చు చేశారు. అది పొన్నాంబళం చెబితే తప్ప బాటకు రాలేదు. ఇక మెగాస్టార్ స్ఫూర్తితో మెగా కాంపౌండ్ హీరోలు, మిగతా స్టార్ హీరోలు, నటీనటులు ముందుకొచ్చి సాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతేనా మెగాస్టార్ స్ఫూర్తితో ఆయనలా సామాజిక సేవా కార్యక్రమాలు చేసినవి కోకొల్లలు.