Middle East Conflict Explained: యుద్ధం ముగిసిందనుకున్న వేళ.. మళ్లీ మంటలు రేగాయి. నిశ్శబ్దం వచ్చిందనుకున్న వేళ… మళ్లీ సైరన్లు మోగాయి. రిహద్దులు సద్దుమణిగాయనుకున్న వేళ.. మళ్లీ క్షిపణులు ఎగిరాయి. మధ్యప్రాచ్యం మరోసారి అగ్నిగుండంగా మారుతోంది. ఏప్రిల్‌లో కాల్పుల విరమణతో కొంత శాంతి నెలకొన్నట్టు కనిపించినా… జూన్‌లో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.
ఒక్క ఇజ్రాయెల్, ఒక్క ఇరాన్ మాత్రమే కాదు… లెబనాన్, యెమెన్, ఇరాక్ వరకు ఈ ఉద్రిక్తతలు విస్తరించడం ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతకీ కాల్పుల విరమణ తర్వాత మళ్లీ యుద్ధ మేఘాలు ఎందుకు కమ్ముకున్నాయి? ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన తాజా దాడుల వెనుక ఉన్న కారణాలేంటి?
మిడిల్ ఈస్ట్‌లో ఏం జరుగుతోంది?
జూన్ 7 రాత్రి మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇజ్రాయెల్ సైన్యం సమాచారం ప్రకారం ఇరాన్ ఉత్తర ఇజ్రాయెల్ వైపు క్షిపణులను ప్రయోగించింది. ఏప్రిల్ 8న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్‌పై క్షిపణులు ప్రయోగించడం ఇదే మొదటిసారి. కొన్ని నివేదికల ప్రకారం నాలుగు క్షిపణులు, మరికొన్ని నివేదికల ప్రకారం 11 క్షిపణులను ప్రయోగించారు. అయితే ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ వాటిని అడ్డుకుందని అధికారులు చెబుతున్నారు. ఈ దాడి వెనుక లెబనాన్ అంశం కీలకంగా మారింది.
ఇజ్రాయెల్ హెజ్బొల్లాను ఎందుకు లక్ష్యంగా చేసుకుంది?
జూన్ 7న బీరూట్ ప్రాంతంలో హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. హెజ్బొల్లా అనేది ఇరాన్ మద్దతు ఉన్న శక్తివంతమైన లెబనీస్ సాయుధ సంస్థ. లెబనాన్‌పై దాడులను తాము సహించబోమని ఇరాన్ చాలాకాలంగా హెచ్చరిస్తోంది. బీరూట్‌పై దాడి జరిగిన కొద్ది గంటలకే ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ వైపు దూసుకెళ్లాయి. ఇరాన్ దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ కూడా వెనక్కి తగ్గలేదు. జూన్ 8 తెల్లవారుజామున ఇరాన్‌లోని పలు సైనిక లక్ష్యాలపై దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. రాజధాని టెహ్రాన్‌తో పాటు ఇస్ఫహాన్, తబ్రిజ్ నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ గార్డ్స్ కూడా ఈ దాడులను ధృవీకరించాయి. కొన్ని ప్రాంతాల్లో విమానాశ్రయాల వద్ద కూడా అలర్ట్ ప్రకటించారు. ఈ ఘటనలను అర్థం చేసుకోవాలంటే ఓసారి బ్యాక్‌గ్రౌండ్‌ను గుర్తుచేసుకోవాలి.
2026 ఫిబ్రవరి 28న ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఆ తర్వాత దాదాపు 40రోజుల యుద్ధం కొనసాగింది. ఆ యుద్ధ సమయంలో ఇజ్రాయెల్‌పై సుమారు 650 క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇటు ఇజ్రాయెల్ ఏకంగా ఇరాన్ సుప్రీంలీడర్‌ను సైతం మట్టుబెట్టింది. ఇక ఏప్రిల్ 8న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి కొంత శాంతించింది. కానీ ఆ శాంతి పూర్తిగా నిలవలేదు. ఇప్పుడు మరో కీలక పరిణామం యెమెన్ కారణంగా జరిగింది. జూన్ 8న యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటు దళాలు ఇజ్రాయెల్‌వైపు క్షిపణి ప్రయోగించినట్టు సమాచారం వచ్చింది. ఏప్రిల్ 4 తర్వాత యెమెన్ నుంచి ఇజ్రాయెల్‌పై నమోదైన మొదటి క్షిపణి దాడి అదే. హౌతీలు చాలా కాలంగా ఇరాన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా రెడ్ సీ సముద్ర మార్గాల్లో నౌకాయానాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇప్పుడు వారి జోక్యంతో ఈ సంక్షోభం మరింత విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది.
ఇదే సమయంలో ఉత్తర ఇరాక్ ప్రాంతాల్లో కూడా ఇరాన్ సైనిక చర్యలు చేపట్టినట్టు నివేదికలు వచ్చాయి. ఒకవైపు లెబనాన్, మరోవైపు యెమెన్, ఇంకోవైపు ఇరాక్. ఇలా మధ్యప్రాచ్యంలోని అనేక ప్రాంతాలు ఒకే చైన్‌లో చిక్కుకుంటున్నాయి. అందుకే అంతర్జాతీయ సమాజం ఇప్పుడు దీన్ని కేవలం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణగా కాకుండా ప్రపంచ యుద్ధంగా భావిస్తోంది.
ఈ సంక్షోభంలో అమెరికా కూడా కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్‌లో మాట్లాడినట్టు అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇరాన్‌పై వెంటనే ప్రతీకార దాడులు చేయవద్దని, చర్చలకు అవకాశం ఇవ్వాలని ట్రంప్ సూచించినట్టు వార్తలు వచ్చాయి. అమెరికా ప్రస్తుతం ఇరాన్‌తో ఒక భారీ ఒప్పందం కోసం ప్రయత్నిస్తోంది. అందుకే యుద్ధం మరింత విస్తరించకుండా ఆపాలని చూస్తోంది. అయితే గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితులు మాత్రం వేరే కథ చెబుతున్నాయి. ఓవైపు క్షిపణులు ఎగురుతున్నాయి.. మరోవైపు సైరన్లు మోగుతున్నాయి.. ఇంకోవైపు వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ మరింత ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తోంది.
ఇజ్రాయెల్ కూడా తగిన సమాధానం ఇస్తామని చెబుతోంది. దీంతో ఏప్రిల్ కాల్పుల విరమణ ఇప్పుడు దాదాపు డాక్యుమెంట్లపై సంతకాలకే పరిమితమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతోంది. బ్రెంట్ ముడి చమురు ధరలు ఒక్కరోజులో మూడు శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు 96 డాలర్లకు పైగా చేరాయి. మధ్యప్రాచ్యం ప్రపంచ చమురు సరఫరాలో కీలక ప్రాంతం కావడంతో అక్కడి ప్రతి ఘర్షణ ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. మొత్తానికి కాల్పుల విరమణ తర్వాత ముగిసిందనుకున్న ఇజ్రాయెల్ -ఇరాన్ ఘర్షణ మళ్లీ మంటలు రేపుతోంది.
లెబనాన్‌లో మొదలైన ఉద్రిక్తత ఇరాన్ క్షిపణి దాడులకు దారి తీసింది. దానికి ప్రతిగా ఇజ్రాయెల్ ఇరాన్‌లోని లక్ష్యాలపై దాడులు చేసింది. ఇప్పుడు యెమెన్ హౌతీలు కూడా రంగంలోకి దిగారు. ప్రపంచ శక్తులు చర్చలతో పరిస్థితిని చల్లార్చేందుకు ప్రయత్నిస్తున్నా నేల మీద రియాల్టి మాత్రం తన్నుకు చావడం లాగానే కనిపిస్తోంది.

