NTV Telugu Site icon

Iran – Israel War : ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడి.. యుద్ధం తప్పదా..?

Iran Israel War

Iran Israel War

అనుకున్నట్టే అయింది.. పశ్చిమాసియా భగ్గుమంటోంది. తమ శత్రుమూకలను వేటాడి వెంటాడి మట్టుపెడుతున్న ఇజ్రాయెల్ పై ఇరాన్ యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్ పై క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్.. ఇరాన్ ను హెచ్చరించింది. అదే జరిగితే మరింతగా విరుచుకుపడతాం అని ఇరాన్ బదులిచ్చింది. మధ్యలో అమెరికా జోక్యం చేసుకుంది. దీంతో యుద్ధం వచ్చేసిందేమోననే అనుమానాలు కలుగుతున్నాయి.

హెజ్బొల్లా, హమాస్ అగ్రనేతలను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తీవ్రవాద సంస్థలకు మద్దతుగా నిలుస్తున్న ఇరాన్.. ఇప్పుడు ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ అన్నంతపనీ చేసింది. ఆ దేశ నగరాలైన టెల్ అవీవ్, జెరూసలెంపై క్షిపణులతో దాడి చేసింది. సుమారు 2వందల క్షిపణులను ఆ దేశంలోని పలు ప్రాంతాలపై ప్రయోగించింది. ఇరాన్‌ నుంచి ప్రయోగించిన క్షిపణులు కేవలం 12 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయి. ఈ దాడుల గురించి తమ అంతర్జాతీయ భాగస్వాములకు కూడా ఇరాన్‌ సమాచారం ఇచ్చింది. పదుల సంఖ్యలో బాలిస్టిక్‌ క్షిపణుల్ని వాడినట్లు అధికారికంగానూ ప్రకటించింది. ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులకు దిగితే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్‌ హెచ్చరించింది. ఇరాన్‌ క్షిపణులతో బెంబేలెత్తిన ఇజ్రాయెలీలు షెల్టర్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. దేశమంతటా సైరన్ల మోత మోగింది. టీవీ ఛానళ్లు, మొబైల్‌ ఫోన్ల ద్వారా ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. అయితే.. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో చాలా వాటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకుంది. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు.. ఎంతమంది గాయపడ్డారనే సమాచారం ఇంతవరకూ అందలేదు. అయితే అతి తక్కువ మంది మాత్రమే గాయపడినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.

ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇజ్రాయెల్ శత్రుమూకలు ఎక్కడున్నా ఏరిపారేస్తామని ఆ దేశ ప్రధాని నెతన్యాహూ ప్రకటించింది. ఇందుకు అమెరికా కూడా మద్దతు ప్రకటించింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఓ వీడియో విడుదల చేశారు. ఇరాన్‌లోని నిరంకుశ పాలనను అంతం చేసి అక్కడి ప్రజలకు స్వేచ్ఛ కల్పిస్తామని చెప్పారు. ఇరాన్‌ కీలుబొమ్మలను ఒక్కొక్కటిగా పెకలించి వేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులను అమెరికా కూడా తీవ్రంగా పరిగణనిస్తోంది. ఆ క్షిపణులను అడ్డుకోవాలని అమెరికా దళాలకు బైడెన్ ఆదేశించారు. తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ వెల్లడించారు. ఇరాన్, దాని మద్దతున్న గ్రూపుల నుంచి అమెరికా సిబ్బంది, మిత్రులను రక్షించుకునేందుకు అమెరికా సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దీంతో ఈ పోరు యుద్ధంగా మారుతుందనే భయాందోళన నెలకొంది.

హెజ్బోల్లాపై ప్రతీకారం తీర్చుకునేందుకు లెబనాన్ లో భూతల దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ క్షిపణులతో విరుచుకు పడింది. అయితే ఇజ్రాయెల్ దళాలు మాత్రం లెబనాన్ లో దాడులను ముమ్మరం చేశాయి. గత వారం లెబనాన్ లో హెజ్బొల్లా ముఖ్య నేతలను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. అనంతరం ఆ దేశంలోకి ప్రవేశించి భూతల దాడులు చేపట్టింది. ముఖ్యంగా సరిహద్దు గ్రామాలపై విరుచుకు పడుతోంది. ఇజ్రాయెల్‌ సైన్యంలో అత్యంత శక్తిమంతమైన దళాల్లో ఒకటైన ‘డివిజన్‌ 98’ పారా ట్రూపర్‌ కమాండోలు దక్షిణ లెబనాన్‌లోకి అడుగుపెట్టారు. దీంతో దక్షిణ లెబనాన్‌లోని కొన్ని ప్రాంతాల ప్రజలకు ఇజ్రాయెల్‌ పలు సూచనలు చేసింది. మరోవైపు హెజ్‌బొల్లా నుంచి దాడులు మరింత ముమ్మరమయ్యే అవకాశం ఉండడంతో తమ ప్రజల కదలికలపై కూడా ఇజ్రాయెల్‌ సైన్యం ఆంక్షలు విధించింది. అయితే.. హెజ్‌బొల్లా మాత్రం ఇజ్రాయెల్ దాడుల వార్తల్ని తోసిపుచ్చింది. ఇజ్రాయెల్‌ బలగాలు లెబనాన్‌లోకి రాలేదని చెప్పుకొచ్చింది. ఖతార్, యూఏఈ, తుర్కియే, ఈజిప్ట్‌ లాంటి దేశాలు లెబనాన్‌కు మద్దతు ప్రకటించాయి. ప్రపంచదేశాలు మాత్రం లెబనాన్ నుంచి తమ ప్రజలు, ప్రతినిధులను వెనక్కు పిలిపించుకుంటున్నాయి.

పశ్చిమాసియాలోని తీవ్రవాద సంస్థలపై ఇజ్రాయెల్ కొంతకాలంగా దాడులు చేస్తోంది. అయితే ఇంతకాలం కామ్ గా ఉన్న ఇరాన్… ఇప్పుడే దాడులు చేయడానికి కారణమేంటి..? ఈ ఏడాది జులైలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఉన్న హ‌మాస్ నేత ఇస్మాయెల్ హ‌నియే బాంబుదాడిలో చనిపోయారు. ఈ దాడి చేసింది ఇజ్రాయెలే అని ఇరాన్ భావిస్తంది. త‌మ దేశ అతిథిగా ఉన్న హ‌నియే హత్యకు ప్ర‌తీకారం తప్పదని ఇరాన్ అప్పుడే హెచ్చరించింది. తాజాగా ఇరాన్‌కు అత్యంత స‌న్నిహితుడైన లెబనాన్‌కు చెందిన హెజ్‌బొల్లా అగ్ర‌నేత న‌స్ర‌ల్లాను ఇజ్రాయెల్ చంపేసింది. దీంతో ఇరాన్ తట్టుకోలేకపోయింది. రెండు రోజుల క్రితం యెమెన్‌లోని హౌతీల స్థావ‌రాల‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హ‌మాస్‌, హెజ్‌బొల్లా, హౌతీలు ఇరాన్‌కు మద్దతుగా ఉంటున్నాయి. వీళ్లను ఇరాన్ కాపాడుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ సంస్థలపై దాడులు చేస్తుండడంతో ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ఇజ్రాయెల్ పై దాడులు ప్రారంభించింది.

వాస్తవానికి ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొత్తకాదు.. గతంలో కూడా అనేకసార్లు ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సిరియాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్‌కు చెందిన సైనికాధికారులు చ‌నిపోయారు. ఇందుకు ప్ర‌తీకారంగా ఇరాన్ డ్రోన్లు, క్షిప‌ణుల‌తో ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. వీటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్‌ అడ్డుకుంది. ఇప్పుడు త‌మ అనుకూల ద‌ళాల నేత‌ల‌ను ఇజ్రాయెల్ చంప‌డంతో ఇరాన్ మ‌రోసారి క్షిపణులను ఎక్కుపెట్టింది. అయితే ఏప్రిల్లో ఇరాన్ దాడుల‌కు ప్ర‌తీకారంగా ఇజ్రాయెల్… ఆ దేశ అణుకేంద్రాలపై సైబర్ ఎటాక్స్ చేసింది. ఇప్పుడు ఇరాన్ నేరుగా క్షిపణులతో దాడులు చేయడంతో ఇజ్రాయెల్ ఎలాంటి చర్యలకు దిగుతుందోననే ఆందోళన సర్వత్రా నెలకొంది.

ఇజ్రాయెల్ ను ఎవరు టార్గెట్ చేసినా ఆ దేశం ఊరుకునే ప్రశ్నే లేదు. ప్రపంచంలో తమ శత్రువులు ఏ మూలన ఏ కలుగులో దాక్కున్నా మట్టుబెట్టడం ఇజ్రాయెల్ నైజం. అలాంటిది ఇప్పుడు ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ మన్నిస్తుందని భావించలేం. ఇజ్రాయెల్ కు ఎలాగూ అమెరికా లాంటి దేశాలు మద్దతుగా ఉన్నాయి. ఇరాన్ కు రష్యాగా అండగా నిలబడొచ్చు. అదే జరిగితే యుద్ధం తప్పదేమో..!

Show comments