Site icon NTV Telugu

Indians Doctors Leaving UK: ఆ దేశంలో బిచ్చగాళ్లుగా మారుతున్న భారతీయ డాక్టర్లు.. తెల్లదొరలకు బై బై!

Explores how economic burdens, tax and pension deductions, stricter visas, and scarce training spots are accelerating departures of Indian doctors and nurses from the NHS, with many eyeing Australia, Canada, and other countries.

Indian Doctors Leaving Uk Britain

ఒకప్పుడు వేలాది మంది భారతీయ డాక్టర్లు, నర్సులు కన్న కల ఇప్పుడు కల్లోలంగా మారింది. తెల్ల కోటు, గౌరవం, స్థిరమైన జీవితం, ప్రపంచంలోనే పేరు ఉన్న ఆరోగ్య వ్యవస్థలో సేవ చేసే అవకాశం. అదే NHS. బ్రిటన్‌ నేషనల్ హెల్త్ సర్వీస్..! దశాబ్దాల పాటు భారత వైద్యులకి యూకే ఒక డ్రీమ్ డెస్టినేషన్‌గా నిలిచింది. కానీ ఇప్పుడు అదే NHS నుంచి భారతీయులు ఒక్కొక్కరిగా క్విట్‌ అవుతున్నారు.

అయితే వర్క్‌ మీద అసంతృప్తితో కాదు.. లైఫ్‌ మీద విసుగుతో వైదొలుగుతున్నారు. పెరిగిన ఖర్చులతో జీవితం భారంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. జీతం వస్తోంది కానీ చేతిలో మిగలడం లేదు. ట్యాక్సులు పెరుగుతున్నాయి. ఇల్లు అద్దెకు తీసుకోవడమే కష్టమవుతోంది. వీసా నిబంధనలు కఠినమయ్యాయి. భవిష్యత్తుపై భరోసా కరిగిపోతోంది. ఒకప్పుడు గర్వంగా చెప్పుకున్న ‘I work for NHS’ అనే నినాదం ఇప్పుడు అనిశ్చితితో నిండిపోయిన ప్రశ్నగా మారింది. ఇంతకి భారతీయ వైద్యులు యూకే వైపు ఎందుకు అడుగులు వెయ్యడంలేదు? ఇప్పటికే అక్కడ పనిచేస్తున్నవారు ఇతర దేశాల వైపు ఎందుకు చూస్తున్నారు?

బ్రిటన్ పార్లమెంట్‌లో ఇటీవల సమర్పించిన అధికారిక డేటా ప్రకారం భారతీయులకు జారీ చేసిన హెల్త్ అండ్ కేర్ వర్కర్ వీసాలు దాదాపు 67 శాతం తగ్గాయి. ముఖ్యంగా నర్సుల విషయంలో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. ఒకప్పుడు NHSకు ప్రధాన బలమైన భారతీయ నర్సులకు జారీ అయ్యే వీసాలు దాదాపు 79 శాతం వరకు పడిపోయాయి. ఇది ఒక్కసారిగా జరిగిన మార్పు కాదు. రెండు-మూడు ఏళ్లుగా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

వామ్మో ఇంత కోతా?

ఈ నిర్ణయాలకు ప్రధాన కారణం డబ్బు. సీనియర్ కన్సల్టెంట్లకు జీతం బాగానే ఉన్నా, అందులో నుంచి కట్ అయ్యే ట్యాక్సులు భయపెడుతున్నాయి. టాప్-పే బ్యాండ్‌లో ఉన్న డాక్టర్లకు దాదాపు 45శాతం ఇన్‌కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది. దీనికి తోడు నేషనల్ ఇన్సూరెన్స్ కంట్రిబ్యూషన్‌తో పాటు NHS పెన్షన్ కోసం కూడా జీతంలో కోత ఉంటుంది. అందుకే లక్షల పౌండ్లు సంపాదిస్తున్నట్టు కనిపించినా, చేతిలో మిగిలేది చాలా తక్కువ. జూనియర్ డాక్టర్లు, ట్రెయినీలు అయితే మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు. వారి జీతాలు పెరగకపోవడం ఒక వైపు.. ఇటు లండన్ లాంటి నగరాల్లో ఇంటి అద్దెలు చెల్లించడమే పెద్ద గగనమైపోయింది.

రెన్యూవల్స్‌లోనూ ఇబ్బందులే:

ఇక్కడితో సమస్య ఆగలేదు. ఇమ్మిగ్రేషన్ పాలసీలు మరో పెద్ద దెబ్బగా చెప్పాలి. నెట్-మైగ్రేషన్ తగ్గించాలన్న ప్రభుత్వ లక్ష్యాలు చట్టబద్ధంగా పనిచేసే విదేశీ వైద్యులపైనే ఎక్కువ ప్రభావం చూపుతున్నాయన్న వాదన బలపడుతోంది. వర్క్ వీసా రెన్యూవల్స్, ఫ్యామిలీ డిపెండెంట్ నిబంధనలు, సెటిల్మెంట్ రూల్స్ కఠినంగా మారాయి. ఈ రోజు NHSలో పనిచేస్తున్న డాక్టర్‌కు రేపు అక్కడే ఉంటానన్న భరోసా లేకుండా పోతోంది. ఇటు కెరీర్ విషయంలోనూ అడ్డంకులు పెరిగాయి. యూకేలోనే చదివే మెడికల్ గ్రాడ్యుయేట్ల సంఖ్య భారీగా పెరిగింది కానీ ట్రైనింగ్ పోస్టులు, కన్సల్టెంట్ పోస్టులు ఆ స్థాయిలో పెరగలేదు. మరోవైపు అంతర్జాతీయ డాక్టర్లకు తప్పనిసరిగా అవసరమైన PLAB పరీక్షల సంఖ్యను కూడా పరిమితం చేస్తున్నారు. పరీక్షలు ఖరీదైనవే కాదు.. పాస్ అయినా ఉద్యోగం దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు.

ఇతర దేశాలవైపు చూపు:

ఈ పరిస్థితుల్లో భారతీయ డాక్టర్లు ఇతర దేశాలవైపు చూస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, గల్ఫ్ దేశాలు ఇప్పుడు మెరుగైన అల్టెర్‌నెట్‌గా కనిపిస్తున్నాయి. అక్కడ జీతాలు ఎక్కువగా ఉండటం, ట్యాక్స్ భారం తక్కువగా ఉండటం, శాశ్వత నివాసానికి స్పష్టమైన మార్గాలు ఉండటం చాలా మందిని ఆకర్షిస్తోంది. మరికొందరు మాత్రం అంతర్జాతీయ అనుభవంతో తిరిగి భారత్‌కే వస్తున్నారు. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు మెరుగైన అవకాశాలు ఇస్తున్నాయని భావిస్తున్నారు. ఇది NHSకు కూడా ఒక హెచ్చరికే. 1948లో NHS ఏర్పడినప్పటి నుంచి భారతీయ డాక్టర్లు, నర్సులు దాని వెన్నెముకలా పనిచేశారు. అయితే కోవిడ్ తర్వాత వచ్చిన ఆర్థిక ఒత్తిడి, భారీ ఖర్చు, ఏజెన్సీ స్టాఫ్‌పై కోతలు ఈ వ్యవస్థను మరింత సంక్షోభంలోకి నెట్టాయి.

ఉద్యోగ భద్రత తగ్గితే, సేవ చేసే చేతులే తగ్గిపోతాయన్న నిజం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఇది కేవలం భారతీయుల వలస కథ కాదు.ఇది ఒక వ్యవస్థ మార్పు కథ. ఒకప్పుడు గ్లోబల్ హెల్త్‌కేర్‌కు ఆదర్శంగా నిలిచిన NHS ఇప్పుడు తన ఆకర్షణను మెల్లగా కోల్పోతున్న దశలో ఉంది. భారతీయ వైద్యుల కోసం యూకే ఇక డ్రీమ్ డెస్టినేషన్ కాదేమో అన్న భావన బలపడుతోంది. ఇక ఇదే రకంగా పాలసీలు, ఆర్థిక ఒత్తిళ్లు కొనసాగితే.. రానున్న రోజుల్లో NHSలో భారతీయుల పాత్ర చరిత్ర పుస్తకాలకే పరిమితమవడం ఖాయమేనని చెప్పుకోవాలి!

ALSO READ: పేలిన భారీ బాం*బ్.. లక్షల మంది బలి.. 2026లో అంతకు మించిన విధ్వంసం?

Exit mobile version