మీరు కొనుగోలు చేస్తున్న ఇల్లు… నిజంగా మీ డబ్బుతో కొంటున్నారా? లేకపోతే ఇంకా సంపాదించని వచ్చే 20 నుంచి 30 ఏళ్ల జీతంతో కొంటున్నారా? ఇది కాస్త విచిత్రంగా అనిపించవచ్చు కానీ ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న రియాలిటీ ఇదే.
ఒకప్పుడు ఇల్లు కొనాలంటే కుటుంబాలు సంవత్సరాల తరబడి పొదుపు చేసేవి. ముందుగా డౌన్ పేమెంట్ కోసం డబ్బు కూడబెట్టేవి. తమ సామర్థ్యానికి తగ్గ ఇల్లు ఎంచుకునేవి. రిటైర్మెంట్ వచ్చేలోపు లోన్ పూర్తిగా తీర్చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్లేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
జీతాలు పెరగకుండా ఇల్లు కొనవచ్చా?
ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో చాలా మంది ముందుగా ఏ ఇల్లు కొనాలని ఆలోచించడం లేదు. ముందు బ్యాంక్ దగ్గరకు వెళ్లి నాకు ఎంత లోన్ వస్తుందని అడుగుతున్నారు. బ్యాంక్ చెప్పిన మొత్తానికి సరిపోయే ఇల్లు వెతుకుతున్నారు. అంటే ఒక కుటుంబం ఎంత సంపాదిస్తోంది అన్నదానికంటే బ్యాంక్ ఎంత అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నదే ఇప్పుడు నిర్ణయాత్మక అంశంగా మారిపోయింది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఇళ్ల ధరలు పెరుగుతున్న వేగంతో జీతాలు పెరగడం లేదు.
దీంతో చాలామంది భారీ హౌసింగ్ లోన్లు తీసుకుంటున్నారు. 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల కాలపరిమితితో లోన్లు తీసుకుంటున్నారు. భర్తా-భార్య..ఇలా ఇద్దరి జీతాలను కలిపి చూపించి ఎక్కువ లోన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం చేతిలో ఉన్న డబ్బుతో కాకుండా భవిష్యత్తులో సంపాదిస్తామనే ఆశతో ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక నిపుణుల ప్రకారం ఒకప్పుడు ప్రజలు తమకు అందుబాటులో ఉన్న ఇంటిని కొనేవారు. ఇప్పుడు మాత్రం వారికి అర్హత ఉన్న లోన్ మొత్తాన్ని బట్టి ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ రెండు మధ్య తేడా చాలా పెద్దది. ఎందుకంటే బ్యాంక్ మీకు ఎంత లోన్ ఇస్తుందో అది మీ ఆర్థిక భద్రతకు హామీ కాదు. బ్యాంక్ ఇచ్చే గరిష్ట లోన్ మీ జీవితానికి సరిపోతుందా లేదా అనేది వేరే విషయం.
EMIల ట్రాప్‌లో పడుతున్నారా?
చాలామంది నెలవారీ ఈఎంఐ మాత్రమే చూస్తున్నారు. కానీ ఇంటి నిర్వహణ ఖర్చులు, ప్రాపర్టీ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగితే వచ్చే అదనపు భారం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఫలితంగా ఇల్లు కొన్న తర్వాత అసలు ఆర్థిక ఒత్తిడి మొదలవుతోంది. ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు వార్షిక ఆదాయంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ధర-ఆదాయ రేషియో 7 నుంచి 10 మధ్య ఉంది. అంటే మన నగరాల్లో ఇళ్లు ఇప్పటికే చాలా ఖరీదైనవిగా మారిపోయాయి. అందుకే ప్రజలు తమ పొదుపులపై ఆధారపడకుండా భారీ లోన్లపై ఆధారపడుతున్నారు.
ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఇళ్లు తక్కువ ధరకేమీ రావడం లేదు. కేవలం చెల్లించే కాలం మాత్రమే పెరుగుతోంది. ఒకప్పుడు 10 నుంచి 15 సంవత్సరాల్లో తీర్చగలిగే లోన్ ఇప్పుడు 20 నుంచి 30 సంవత్సరాలకు చేరుకుంది. అంటే ఇంటి ధర తగ్గలేదు. కానీ చెల్లింపును ఎక్కువ సంవత్సరాలకు విభజించడం ద్వారా నెలవారీ ఈఎంఐని తక్కువగా చూపిస్తున్నారు. ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్ ఇప్పటికే సుమారు 37లక్షల కోట్ల రూపాయల స్థాయికి చేరుకుంది.
అయితే ఇక్కడ మరో పెద్ద సమస్య ఉంది. ఇంటి ఈఎంఐ కుటుంబం మొత్తం ఆర్థిక ప్రణాళికను తినేస్తోంది. సాధారణంగా ఒక కుటుంబం నెలవారీ నికర ఆదాయంలో 30 నుంచి 35 శాతం మాత్రమే హౌసింగ్ ఈఎంఐకి వెళ్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు చాలామంది తమ టేక్ హోమ్ జీతంలో 40 నుంచి 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఈఎంఐలకు ఖర్చు చేస్తున్నారు. దీంతో ఏమవుతోంది? రిటైర్మెంట్ కోసం పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. మ్యూచువల్ ఫండ్లు, SIPలు ఆగిపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల కోసం కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ కూడా చాలామంది సృష్టించలేకపోతున్నారు.
ఇల్లు కోసం చెల్లించే ఈఎంఐ మొత్తం పెట్టుబడి సామర్థ్యాన్ని మింగేస్తోంది. ఈ ప్రభావం దేశ స్థాయిలో కూడా కనిపిస్తోంది. భారత్‌లో ఆర్థిక పొదుపులు 2020-జీడీపీలో సుమారు 22.7 శాతం ఉండగా 2024 నాటికి అవి 18.1 శాతానికి పడిపోయాయి. పెరుగుతున్న హౌసింగ్ లోన్లు ప్రజల పొదుపులను తగ్గిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంకా ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఈ లోన్లు రిటైర్మెంట్ వరకు కొనసాగుతున్నాయి. 25 లేదా 30 సంవత్సరాల లోన్ తీసుకున్న వ్యక్తి ఉద్యోగ జీవితాన్ని ముగించిన తర్వాత కూడా ఈఎంఐలు చెల్లించాల్సి రావచ్చు. రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ లేదా పొదుపుల నుంచే లోన్ కట్టాల్సి వస్తుంది. అప్పుడు ఆరోగ్య ఖర్చులు, రోజువారీ జీవన ఖర్చులకు అందుబాటులో ఉండాల్సిన డబ్బు తగ్గిపోతుంది. మరొక ప్రమాదం డబుల్ ఇన్‌కమ్ ఉందని భ్రమపడడం.
ఎందుకంటే భర్తా-భార్య ఇద్దరూ ఉద్యోగాలు చేస్తారని భావించి భారీ లోన్లు తీసుకుంటున్నారు. కానీ 20 నుంచి 30 సంవత్సరాల పాటు ఇద్దరి ఉద్యోగాలు నిరంతరంగా కొనసాగుతాయని ఎవరూ హామీ ఇవ్వలేరు. ఉద్యోగం పోవచ్చు. ఆరోగ్య సమస్యలు రావచ్చు. పరిశ్రమల్లో తొలగింపులు జరగవచ్చు. అప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థ కూలిపోవచ్చు.
ఉదాహరణకు ఒక యువ దంపతులు మెట్రో నగరంలో ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేశారనుకుందాం. వారి కుటుంబ ఆదాయంలో దాదాపు 55 శాతం ఈఎంఐలకు వెళ్తోంది. మొదట్లో అన్నీ బాగానే కనిపించాయి కానీ తర్వాత కార్పొరేట్ లేఆఫ్స్‌లో భాగంగా ఒకరి ఉద్యోగం పోతే పరిస్థితి ఏంటి? ఏడాదిలోపే తీవ్రమైన నగదు సంక్షోభంలో పడిపోతారు. ఎమర్జెన్సీ ఫండ్ ఉండదు. పెట్టుబడులు కూడా ఆపేశారు. ఫలితంగా పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది.
ఇంకో ఆసక్తికరమైన మార్పు కూడా కనిపిస్తోంది. ఇప్పుడు ఇల్లు కొనగలిగే వారి మధ్య ఒక కొత్త విభజన ఏర్పడుతోంది. కుటుంబ సంపద ఉన్నవారు, తల్లిదండ్రుల సహాయం పొందేవారు సులభంగా డౌన్ పేమెంట్ చెల్లించి మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. కానీ అలాంటి సహాయం లేని మధ్యతరగతి కుటుంబాలు మరింత దూర ప్రాంతాల్లో ఇళ్లు కొనాల్సి వస్తోంది. చిన్న ఇళ్లను ఎంచుకోవాల్సి వస్తోంది. లేదా మరింత పెద్ద అప్పులు తీసుకోవాల్సి వస్తోంది. అయితే ప్రతి ఒక్కరు ఇలాంటి ఒత్తిడిలో ఉన్నారని అనుకోవద్దు. లగ్జరీ హౌసింగ్ మార్కెట్ మాత్రం ఇప్పటికీ బలంగానే ఉంది. వ్యాపారవేత్తలు, ఉన్నతాధికారులు, అధిక సంపద కలిగిన వ్యక్తులు పెద్ద మొత్తంలో సొంత పెట్టుబడితో ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. వారు పూర్తిగా అప్పులపై ఆధారపడటం లేదు. కాబట్టి సమస్య ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న మీకు లోన్ వస్తుందా లేదా అనేది కాదు. ఆ ఇంటిని కొనుగోలు చేసే క్రమంలో మీ భవిష్యత్తు ఆర్థిక భద్రతను ఎంత వరకు త్యాగం చేస్తున్నారనేదే అసలు ప్రశ్న. ఎందుకంటే నేటి భారతంలో చాలా మంది ఇళ్లు తమ చేతిలో ఉన్న డబ్బుతో కాదు… ఇంకా సంపాదించని వచ్చే 20 నుంచి 30 ఏళ్ల ఆదాయంతో కొనుగోలు చేస్తుండడం ఆందోళన కలిగించే అంశం.
