Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్‌పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో చాలా మందికి పాస్‌పోర్ట్ ఉంటే… అదే అసలైన పౌరసత్వ గుర్తింపు అని ఓ బలమైన నమ్మకం ఉంది. ఎవరైనా విదేశాలకు వెళ్లాలన్నా… గుర్తింపు కార్డుగా చూపించాలన్నా అందరికీ ముందుగా గుర్తొచ్చేది పాస్‌పోర్టే. అయితే విదేశీ వ్యవహారాల శాఖ నుంచి వచ్చిన ఓ ప్రకటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాస్‌పోర్ట్ కేవలం ప్రయాణ పత్రం మాత్రమేనని.. అది పౌరసత్వానికి నిదర్శనం కాదని తేల్చి చెప్పింది. అసలు మన దేశంలో పౌరసత్వాన్ని ఎలా గుర్తిస్తారు? రాజ్యాంగం ఏం చెబుతోంది? పాస్‌పోర్ట్ పౌరసత్వ ధృవీకరణ పత్రం కాకపోతే.. అసలైన గుర్తింపు ఏది? ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు ?
విదేశీ వ్యవహారాల శాఖ ఏం చెప్పింది?
పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. భారతీయులకు పాస్‌పోర్ట్ కేవలం ఒక ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారుల పటిష్టమైన విచారణ తర్వాతే పౌరులకు దీన్ని జారీ చేస్తారు. భారత రిపబ్లిక్ పేరుతో జారీ అయ్యే ఈ పత్రం ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందుతుంది. అయితే ఇది ఒక వ్యక్తిని భారతీయ పౌరుడిగా గుర్తించేందుకు చట్టబద్ధమైన నిదర్శనం ఎంతమాత్రం కాదు. న్యాయపరమైన సవాళ్లు ఎదురైనప్పుడు.. కోర్టుల్లో పాస్‌పోర్ట్ చూపించి పౌరసత్వాన్ని నిరూపించుకోలేరు.
Also Read
పౌరసత్వం గురించి రాజ్యాంగంలో ఏముంది?
భారత పౌరులు ఎవరనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 నుంచి 11 వరకు… 1955 పౌరసత్వ చట్టం స్పష్టంగా నిర్వచించాయి. ఈ చట్టాల ప్రకారం ఏ ఒక్క పత్రం కూడా పౌరసత్వానికి పూర్తి స్థాయి ఆధారంగా పరిగణించదు. పౌరసత్వం అనేది పుట్టుక.. తల్లిదండ్రుల మూలాలు.. నివాసం ఆధారంగా వచ్చే ఒక చట్టపరమైన హోదా. మన దగ్గర ఉన్న రికార్డులు కేవలం ఆ వాస్తవాలను నిర్ధారించే సాక్ష్యాలుగా మాత్రమే పనిచేస్తాయి. ఉదాహరణకు ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ లాంటివి గుర్తింపు కార్డులు మాత్రమే కానీ అవే పౌరసత్వానికి తుది ఆధారాలు కావు.
1955 పౌరసత్వ చట్టం ప్రకారం పౌరసత్వాన్ని నాలుగు మార్గాల్లో పొందవచ్చు. మొదటిది పుట్టుకతో వచ్చే పౌరసత్వం. 1950 నుంచి 1987 మధ్య భారత్‌లో జన్మించిన వారందరూ సహజంగానే పౌరులు అవుతారు. ఆ తర్వాత 2003 వరకు జన్మించిన వారిలో తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కరైనా భారతీయులై ఉండాలి. ఇక రెండో మార్గం వారసత్వం. విదేశాల్లో పుట్టిన పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరు భారతీయులై ఉండి.. ఏడాదిలోపు కాన్సులేట్‌లో నమోదు చేసుకుంటే పౌరసత్వం లభిస్తుంది. మూడోది రిజిస్ట్రేషన్ ద్వారా.. నాలుగోది నిర్దిష్ట కాలం దేశంలో ఉండటం ద్వారా పొందే పౌరసత్వం. ఇది కనీసం 12 ఏళ్ల పాటు భారత్‌లో నివసించిన విదేశీయులకు ఇస్తారు. పాకిస్థాన్ సింగర్ అద్నాన్ సమీకి ఇలాగే భారత పౌరసత్వం లభించింది.
పౌరులు కాని వారికి పాస్‌పోర్టు ఇవ్వకూడదనే నియమం కూడా ఏమీ లేదు. పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పరిస్థితుల్లో విదేశీయులకు కూడా ట్రావెల్ డాక్యుమెంట్లు జారీ చేయవచ్చు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ అధికారాన్ని కేంద్రం ఉపయోగిస్తుంది. రాజకీయ కారణాలతో ఏ దేశం లేని వాళ్లుగా మిగిలిపోయిన వారికి ఇలాంటి వెసులుబాటు ఇస్తారు. భారత్‌లో ఉంటున్న టిబెటన్ శరణార్థులకు… శ్రీలంక తమిళులకు వేరే దేశాలకు వెళ్లేందుకు ప్రత్యేక ప్రయాణ పత్రాలు జారీ చేస్తారు. ఇవన్నీ చూస్తే.. పాస్‌పోర్ట్ ఉంటే వారు పక్కా భారతీయులు అనుకోవడం పొరపాటే అవుతుంది.
పౌరసత్వ వివాదాలపై దేశంలోని అత్యున్నత న్యాయస్థానాలు ఎన్నోసార్లు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయి. సుప్రీంకోర్టు సహా పలు హైకోర్టులు పాస్‌పోర్టును ఒక గుర్తింపుగా మాత్రమే చూశాయి. ఓటరు నమోదు కోసం ఎన్నికల సంఘం పాస్‌పోర్ట్, జనన ధృవీకరణ పత్రాలను బలమైన సాక్ష్యాలుగా అంగీకరిస్తుంది. కానీ కోర్టులు మాత్రం పౌరసత్వ వివాదాల్లో వీటిని తుది ఆధారాలుగా అంగీకరించవు. పౌరసత్వాన్ని నిరూపించుకునే బాధ్యత పూర్తిగా సదరు వ్యక్తి పైనే ఉంటుందని కోర్టులు కుండబద్దలు కొట్టాయి.
మిగతా దేశాలతో పోలిస్తే భారత పౌరసత్వ నిర్ధారణలో ఒక పెద్ద సమస్య దాగి ఉంది. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో పౌరులందరికీ ఒకే తరహా యూనివర్సల్ సిటిజన్ షిప్ సర్టిఫికెట్ ఉంటుంది. కానీ మన దేశంలో పౌరులందరికీ ఇచ్చే ఒకే ఒక్క పౌరసత్వ ధృవీకరణ పత్రం అంటూ ఏదీ లేదు. ఎక్కువ మంది భారతీయుల పౌరసత్వం పుట్టుక ఆధారంగానే వస్తుంది. చాలామంది పాత తరం భారతీయులకు ఓటరు జాబితాలు, స్కూల్ సర్టిఫికెట్లు, భూమి రికార్డులే ప్రధాన ఆధారాలు. వీటన్నింటినీ క్రమబద్ధీకరించేందుకే ఎన్నార్సీ అమలును గతంలో ప్రతిపాదించారు. అసోంలో అమలు చేసిన ఎన్నార్సీలో సరైన డాక్యుమెంట్లు లేక దాదాపు 19 లక్షల మంది జాబితాలో చోటు కోల్పోయారు. అందుకే రాజ్యాంగం కల్పించిన పౌరసత్వ నిబంధనల పట్ల సరైన అవగాహన ఉండటం అత్యంత అవసరం.
తాజావార్తలు
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!