Site icon NTV Telugu

Ganga-Jamuni-Tehzeeb: భిన్నత్వంలో ఏకత్వం..హిందూ-ముస్లింల శతాబ్దాల బంధానికి ఈ సంస్కృతి ప్రతీరూపం

Ganga Jamuni Tehzeeb

Ganga Jamuni Tehzeeb

Ramadan 2026: సాయంత్రం ఆకాశం మెల్లగా చీకటిలో కలిసిపోతుంది. చంద్రుని కోసం ఎదురు చూస్తున్న ఆ క్షణం గాలిలో ఒక పవిత్రమైన ప్రశాంతత కలుగుతుంది. ఒక చిన్న వీధిలో వెలుగులు మెరుస్తున్నాయి. ఇంటి ముందు దీపాలు వెలిగిస్తున్న చేతులే కొద్దిసేపటికి ఇఫ్తార్ కోసం ఖర్జూరాలు పంచుతున్నాయి. ఒక వైపు ఆలయం గంట మోగుతుంది. ఇంకో వైపు మసీదు అజాన్ వినిపిస్తుంది. ఆ శబ్దాలు వేరైనా ఆ అనుభూతి మాత్రం ఒక్కటే..!

శతాబ్దాల క్రితం నుంచే ఈ భరత భూమిపై గంగా, యమున సంస్కృతులు కలిసిపోయాయి. పూజ చేసే చేతులే దానం చేసే చేతులయ్యాయి. ఉపవాసం చేసే మనసులే ఇతరుల ఆకలి తీర్చే హృదయాలయ్యాయి. ఇక్కడ పండుగలు మతాలకే పరిమితం కావు.. మనుషుల మధ్య ప్రేమకు ప్రతిరూపాలగా మారిపోతాయి. గంగా-జముని-తహజీబ్ జీవించే క్షణమే రమజాన్. ఇంతకీ ఏంటీ గంగా-జముని-తహజీబ్?

ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే గంగా-జముని-తహజీబ్ అనే భావన ఎక్కడి నుంచి వచ్చిందో ముందుగా అర్థం చేసుకోవాలి. గంగా -జముని అంటే గంగా, యమున నదుల మధ్య ఉన్న ఉత్తర భారత ప్రాంతం. తహజీబ్ అనే పదం అరబ్‌ భాష నుంచి వచ్చింది. దాని అర్థం సంస్కారం, జీవన విధానం, మానవీయ విలువలు.

ఈ మూడు కలిసి గంగా-జముని-తహజీబ్ అనే భావనగా మారాయి. అంటే రెండు భిన్న సంప్రదాయాలు ఒకదాన్ని మరొకటి గౌరవిస్తూ, కలిసి జీవించే సంస్కృతి. ఈ భావనకు పునాది 13వ శతాబ్దం సమయంలోనే పడింది. ఢిల్లీ సుల్తానుల కాలంలో ఉత్తర భారతంలో కొత్త సంస్కృతులు ప్రవేశించాయి. అక్కడే స్థానిక హిందూ సంప్రదాయాలు, కొత్తగా వచ్చిన ముస్లిం సంప్రదాయాలు ఒకదానితో ఒకటి కలవడం ప్రారంభమైంది. ఇది ఒక్కరోజులో జరిగిన మార్పు కాదు. శతాబ్దాల పాటు నెమ్మదిగా ఏర్పడిన సహజీవనం. ఈ మార్పుకు ముఖ్య కారణం భక్తి ఉద్యమం. ఖ్వాజా మోయినుద్దీన్ చిష్తీ లాంటి సూఫీ గురువులు ప్రేమ, సమానత్వం, సహనం గురించి బోధించారు. అదే సమయంలో హిందూ పండితులు కూడా దేవుని ముందు అందరూ ఒకటే అని చెప్పారు. ఈ రెండు భావాలు ప్రజల మధ్య ఒకే దారిలో చేరాయి.

16వ శతాబ్దంలో మొఘల్ కాలంలో ఈ సంస్కృతి మరింత బలపడింది. అక్బర్ పాలనలో భిన్న మతాల మధ్య పరస్పర గౌరవ భావం పెరిగింది. కళలు, సంగీతం, నిర్మాణాలలో ఈ కలయిక స్పష్టంగా కనిపించింది. సాధారణ ప్రజల జీవితంలో కూడా ఇది భాగమైంది. ఆహారం, భాష, పండుగలు లాంటి అంశాల్లో ఈ కలయిక స్పష్టంగా కనిపించేది. తర్వాత 18,19వ శతాబ్దాల్లో లక్నో లాంటి ప్రాంతాల్లో ఈ సంస్కృతి మరింత అందంగా రూపుదిద్దుకుంది. ఉర్దూ భాష అభివృద్ధి కూడా ఈ కలయికకు ఉదాహరణ.

ఒకే వాక్యంలో వేర్వేరు భాషల పదాలు సహజంగా కలిసి వినిపించాయి. పండుగలు ఒకరి దగ్గర ఒకరు జరుపుకోవడం, ఆహారం పంచుకోవడం, ఒకరి సంప్రదాయాలను మరొకరు గౌరవించడం సాధారణంగా మారింది. 1857లో జరిగిన తొలి స్వాతంత్ర్య సమరంలో కూడా ఈ ఐక్యత స్పష్టంగా కనిపించింది. హిందూ, ముస్లిం సైనికులు కలిసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. తర్వాత స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా ఈ భావన కొనసాగింది. ఇది కేవలం సంస్కృతి మాత్రమే కాదు, దేశాన్ని కలిపే ఒక శక్తిగా మారింది. ఈ మొత్తం ప్రయాణం చూస్తే గంగా జముని తహజీబ్ అనేది ఒక పుస్తక పదం కాదు. ఇది శతాబ్దాలుగా మన దేశంలో జీవిస్తున్న జీవన విధానం. ఒకరి ప్రార్థనను ఇంకొకరు గౌరవించడం, ఒకరి పండుగను ఇంకొకరు ఆనందంగా పంచుకోవడం, భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడడం. అందుకే రమజాన్ సమయంలో ఒక ఇఫ్తార్ దగ్గర వేర్వేరు మతాల వారు కలిసి కూర్చుని తినడం ఒక సాధారణ దృశ్యంగా మారింది.

ఇది శతాబ్దాల చరిత్ర, మనసుల మధ్య ఏర్పడిన అనుబంధంతో పాటు ఈ నేల నేర్పిన విలువలకు ప్రతిబింబం. ఇదే ఇండియా ప్రత్యేకత. వేర్వేరు మార్గాలు ఉన్నా, మనసు ఒక్కటే ఉండే జీవన విధానం భారత్‌లోనే కనిపిస్తుందని చెప్పేందుకు అతిపెద్ద ఉదాహరణ!

 

Exit mobile version