NTV Telugu Site icon

SpaceX Starship : ఎలాన్ మస్క్ మరో చరిత్ర… స్టార్‌షిప్‌ల సంగతేంటి..!

Spacex Starship

Spacex Starship

ఎలాన్ మస్క్.. ప్రపంచంలో పేరొందిన వ్యాపారవేత్త. ఈయన సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం చేయడంలో ఎలాన్ మస్క్ సిద్ధహస్తుడు. తాజాగా తన అంతరిక్ష ప్రయోగాల సంస్థ స్పేస్ ఎక్స్ మరో రికార్డును సొంతం చేసుకుంది. స్టార్ షిప్ రాకెట్ బూస్టర్ పైకెగిరిన తర్వాత సేఫ్ గా లాంచ్ ప్యాడ్ చేరుకుంది. గతంలో ఎన్నోసార్లు ఈ ప్రయోగం చేసినా సక్సెస్ కాలేదు. కానీ ఈసారి మాత్రం స్పేస్ సెన్సేషన్ సృష్టించింది.

ఏదైనా ఒక రాకెట్ పైకెగిరిన తర్వాత దాని భాగాలు ఏదైనా సముద్రంలోనో, భూమిపైనో పడిపోతుంటాయి. వాటిని మళ్లీ మళ్లీ వినియోగించడం సాధ్యం కావట్లేదు. కానీ ఎలాన్ మస్క్ మాత్రం సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో పలు దేశాలు ఎంతో కీలకంగా పనిచేస్తున్నాయి. అమెరికా, రష్యా, చైనా, ఇండియా, జపాన్ లాంటి దేశాలు అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రదేశాలుగా చలామణీ అవుతున్నాయి. దశాబ్దాలుగా ఇవి ఎన్నో సంచలనాలు నమోదు చేస్తున్నాయి. అయితే ఈ సంస్థలు చేపట్టిన రాకెట్లు కొన్ని సందర్భాల్లో మాత్రమే పునర్వినియోగానికి అనుకూలంగా ఉంటున్నాయి. మిగిలిన సమయాల్లో అవి భూమి మీదో.. లేకుంటో సముద్రంలోనే పడిపోతున్నాయి. ఆ భాగాలను తీసుకొచ్చి శాస్త్రవేత్తలు వివిధ ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఈ రాకెట్ల తయారీకి పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకే ఇలాంటి రాకెట్లను మళ్లీ మళ్లీ వినియోగించుకునేలా అభివృద్ధి చేయాలని అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో నాసా కాస్త ముందుంది. ప్రైవేటు సంస్థలకు ఇలాంటి రాకెట్ల తయారీ బాధ్యతను కట్టబెట్టింది. ఆ బాధ్యతను ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ ఇప్పుడు సక్సెస్ అయింది.

రాకెట్ ప్రయోగించిన తర్వాత అది మళ్లీ సేఫ్ గా భూమి మీద ల్యాండ్ అయితే సక్సెస్ అయినట్లు లెక్క. ఎన్నో ప్రయోగాల అనంతరం స్పేస్ ఎక్స్ కు చెందిన స్టార్ షిప్ సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ అయింది. టెక్సాస్‌లోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం స్టార్ షిప్ రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ రాకెట్ మొత్తం పొడవు 121 మీటర్లు. ఇందులో బూస్టర్ పొడవు 71 మీటర్లు. వ్యోమ నౌక పొడవు 50 మీటర్లు. వ్యోమ నౌకను లేదంటే క్యాప్సూల్ ను నిర్దేశిక కక్షలో ప్రవేశపెట్టేందుకు ఈ బూస్టర్ చాలా కీలకం. ఇందులోనే ఇంధనం నింపుతారు. సాధారణంగా రాకెట్ ను ప్రయోగించిన తర్వాత బూస్టర్ లు ఎక్కడో పడిపోతుంటాయి. వాటిని మళ్లీమళ్లీ వాడుకోవడం కుదరట్లేదు. కానీ ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ పునర్వినియోగానికి అనుకూలమైన బూస్టర్లను రూపొందించడంలో బిజీగా ఉంది. స్పేస్ ఎక్స్ సంస్థ ఇప్పటికే ఎన్నో స్టార్ షిప్ డిజైన్లను రూపొందించి ప్రయోగాలు చేపట్టింది. తాజాగా స్టార్ షిప్ ను ప్రయోగించిన తర్వాత వ్యౌమ నౌక అంతరిక్షానికి వెళ్లి హిందూ మహాసముద్రంలో విజయవంతంగా దిగింది. బూస్టర్ కూడా సేఫ్ గా లాంఛ్ ప్యాడ్ కు చేరుకుంది. అంతరిక్షానికి పంపిన తర్వాత బూస్టర్ సురక్షితంగా లాంచ్ టవర్ చేరితే సక్సెస్ అయినట్లు లెక్క. గతంలో చేసిన కొన్ని ప్రయోగాల బూస్టర్లు లాంచ్ ప్యాడ్ కు కాకుండా ప్రయోగకేంద్రంలో ఎక్కడో ఒక చోట ల్యాండ్ అయ్యాయి. కొన్ని పేలిపోయాయి. అయితే ఆదివారం తొలిసారి బూస్టర్ నేరుగా ల్యాంఛ్ పాడ్ కు చేరింది. దీంతో స్పేస్ ఎక్స్ కంపెనీ చరిత్ర సృష్టించినట్లయింది.

అసలు ఎలాన్ మస్క్ స్టార్ షిప్ ల ఉద్దేశమేంటో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర తిరగరాయాలనే పట్టుదలతో ఉన్నారాయన. అందుకే స్పేస్ ఎక్స్ ద్వారా విస్తృత ప్రయోగాలు చేస్తున్నారు. ఇటీవల సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్ లైనర్ ద్వారా అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి వెళ్లారు. కానీ అక్కడి నుంచి తిరిగి రాలేకపోయారు. దీంతో వీళ్లను తీసుకొచ్చేందుకు ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి వెళ్లింది. వీళ్లను ఫిబ్రవరిలో తిరిగి తీసుకురానుంది. దీన్ని బట్టి స్పేస్ ఎక్స్ కంపెనీ అంతరిక్ష ప్రయోగాల్లో ఎంత ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేస్తున్న స్టార్ షిప్ కూడా ఈ కోవలోకే చెందుతుంది. చంద్రుడు, అంగారకుడు లాంటి గ్రహాలపైకి ఇంధనాన్ని, మనుషులను చేర్చడంతో పాటు అక్కడి నుంచి మళ్లీ సురక్షితంగా భూమికి తీసుకువచ్చేందుకు స్టార్ షిప్స్ ను అభివృద్ధి చేస్తోంది స్పేస్ ఎక్స్ కంపెనీ.

ప్రపంచంలో ఇప్పటివరకూ అభివృద్ధి చేసిన అత్యాధునిక వ్యోమనౌక స్టార్ షిప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది భవిష్యత్తు అంతరిక్షయానాన్ని సమూలంగా మార్చేయబోతోంది. స్టార్ షిప్ చేయబోయే అద్భుతాలు అన్నీఇన్నీ కావు. ఇప్పటివరకూ ప్రపంచంలో ఏ దేశమూ అభివృద్ధి చేయలేని అత్యాధునిక వాహక నౌక ఇది. మళ్లీ మళ్లీ వినియోగించుకోగలగడం దీని గొప్పతనం. ఇది 150 మెట్రిక్ టన్నుల బరువును మోసుకెళ్లగలదు. దీని ద్వారా ఒకేసారి వంద మంది అంతరిక్షానికి వెళ్లొచ్చు.. తిరిగి రావచ్చు. అంతేకాదు భూకక్షలో ఇంధనాన్ని రీఫిల్ చేసుకోగలగడం వీటి ప్రత్యేకత. అంటే భూకక్షలో ఉన్న స్పేస్ ఎక్స్ ట్యాంకర్ల నుంచి మార్గమధ్యంలో స్టార్ షిప్ తనకు అవసరమైన మేర ఇంధనాన్ని నింపుకోగలుగుతుంది. ప్రయాణానికి అవసరమైన ఇంధనం మొత్తాన్ని భూమి నుంచే మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. పైగా ఇది ఒక్క అంతరిక్ష కేంద్రానికే పరిమితం కాదు.. చంద్రుడి దగ్గరకైనా, అంగారకుడిపైకైన వెళ్లొచ్చు.. ఇతర గ్రహాలపైకి వెళ్లగలిగేలా దీన్ని తీర్చిదిద్దగలిగారు. భవిష్యత్ స్పేస్ టూరిజంను కూడా దృష్టిలో ఉంచుకుని దీన్ని తయారు చేశారు.

ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ అంతరిక్ష పరిశోధన, ప్రయోగరంగాల్లో అద్భుతాలు చేస్తోందని చెప్పొచ్చు. ఆ కంపెనీ ఏం చేస్తుంది.. ఏం చేసిందనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. స్పేస్ ఎక్స్ పూర్తి పేరు స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్. ఇది ప్రైవేట్ రంగంలో ఉన్న అగ్రగామి అంతరిక్ష పరిశోధన, రాకెట్ తయారీ సంస్థ. 2002లో ఎలాన్ మస్క్ దీన్ని స్థాపించారు. అంతరిక్ష ప్రయాణాన్ని చౌకగా, సమర్థవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్పేస్ ఎక్స్ పనిచేస్తోంది. మానవాళిని అంతరిక్షంలోకి పంపించడం, ఇతర గ్రహాలపై నివాసం ఏర్పరచడం, ముఖ్యంగా మార్స్ పై మానవ నివాసం స్థాపించడం వంటివి ఈ సంస్థకు ప్రధాన లక్ష్యాలు. ఇప్పటివరకూ స్పేస్ ఎక్స్ ఎన్నో విజయాలు సాధించింది. స్పేస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ 1 అంతరిక్ష కక్షలోకి వెళ్లిన మొదటి ప్రైవేటు రాకెట్ గా చరిత్ర సృష్టించింది. ఇక ఫాల్కన్ 9 అత్యంత చౌకయిన, పునర్వినియోగ రాకెట్ గా ప్రసిద్ధి చెందింది. 2010 నుంచి ఇది వినియోగంలో ఉంది. దీని ద్వారానే ఇప్పుడు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి రానున్నారు. ఇక స్పేస్ ఎక్స్ రూపొందించిన డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా అంతరిక్ష కేంద్రానికి సరుకులు, వ్యోమగాములను తీసుకెళ్లగలదు. 2012లో ఇది ఐఎస్ఎస్ కు సరుకులు తీసుకెళ్లిన తొలి ప్రైవేటు సంస్థగా చరిత్ర సృష్టించింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న స్టార్ షిప్ అత్యంత శక్తివంతమైన పునిర్వినియోగ రాకెట్. అంతరిక్షంలో సుదూర ప్రాంతాలకు సరుకులు, మనుషులను తీసుకెళ్లేలా దీన్ని తీర్చిదిద్దారు. ఇక స్టార్ లింక్ ప్రాజెక్ట్ ద్వారా అంతర్జాతీయంగా ఇంటర్నెట్ సేవలను అందించేందుకు స్పేస్ ఎక్స్ కృషి చేస్తోంది. వేలాది నానో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి.. వాటి నుంచి ఎక్కడైనా ఇంటర్నెట్ అందించాలనేది దీని లక్ష్యం.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎలాన్ మస్క్ మస్తిష్కంలోంచి పుట్టిన స్పేస్ ఎక్స్ సంస్థ అంతరిక్ష ప్రయోగాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తోంది. భవిష్యత్తులో మనం ఆశ్చర్యపోయేలా మరిన్ని పరిశోధనలు చేస్తోంది.