ప్రపంచం కోవిడ్(Corona) జ్ఞాపకాల నుంచి పూర్తిగా బయటపడకముందే మరో వైరస్ పేరు మెల్లగా వినిపిస్తోంది. ఇది కోవిడ్, ఫ్లూ(Flu) కంటే స్ట్రాంగ్ వైరస్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ వైరస్ కొత్తదేమీ కాదు. దాని పేరు అడెనోవైరస్.
అడెనోవైరస్(AdenoVirus) ఇప్పుడిప్పుడే పుట్టిన వైరస్ కాదు. దీన్ని మొదటిసారి 1953లో అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పట్లో పిల్లల్లో తరచుగా కనిపించే శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లను పరిశీలిస్తుండగా, గొంతులో ఉండే అడెనాయిడ్స్ అనే కణజాలంలో ఈ వైరస్‌ను కనుగొన్నారు. అదే కారణంగా దీనికి అడెనోవైరస్ అనే పేరు వచ్చింది.
భారీగా స్ట్రెయిన్లు:
అడెనోవైరస్ స్ట్రెయిన్లు దాదాపు 50 నుంచి 60 వరకు ఉన్నట్టు గుర్తించారు. ఈ వైరస్ కారణంగా జలుబు, దగ్గు, న్యుమోనియా లాంటి సమస్యలు వస్తాయి. కళ్ళను ప్రభావితం చేస్తే పింక్-ఐ కూడా వస్తుంది. జీర్ణవ్యవస్థలోకి వెళ్లితే డయేరియా, వాంతులు మొదలవుతాయి. కొన్ని అరుదైన సందర్భాల్లో మూత్రనాళం లేదా నరాల వ్యవస్థ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇది సాధారణ జనాభాలో మాత్రమే కాకుండా సైనిక శిబిరాల్లో కూడా పెద్ద సమస్యగా మారింది. అమెరికా సైన్యంలో 1960 నుంచే అడెనోవైరస్ కారణంగా భారీ ఎత్తున శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి. అందుకే అమెరికా సైన్యం ప్రత్యేకంగా అడెనోవైరస్ వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేసింది. అయితే అది సాధారణ ప్రజలకు కాదు, కేవలం సైనికులకు మాత్రమే పరిమితమైంది.
కంట్రోల్ కష్టమే:
ఈ వైరస్‌ను పూర్తిగా నియంత్రించడం చాలా కష్టం. దాని నిర్మాణం చాలా బలంగా ఉంటుంది. కోవిడ్ లాంటి వైరస్‌లకు ఉండే బయటి పొర దీనికి ఉండదు. అందుకే సబ్బు, ఆల్కహాల్ ఆధారిత డిస్-ఇన్ఫెక్టెంట్స్ దీనిపై పూర్తిగా పనిచేయవు. ఈ లక్షణమే దీన్ని ఆస్పత్రులు, స్కూల్స్, DAY-CARE సెంటర్లలో ఎక్కువసేపు బతికేలా చేస్తోంది. ఇటీవలి కాలంలో అడెనోవైరస్ మళ్లీ వార్తల్లోకి రావడానికి కారణం దాని మ్యూటేషన్ కాదు.. దాని వ్యాప్తి. కోవిడ్ ఎగ్జిట్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా హైజిన్ అలవాట్లు మారడం, మాస్కులు తొలగించడం, జనసమూహాలు పెరగడంతో ఈ వైరస్‌కు మళ్లీ అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
భయపెడుతున్న లెక్కలు:
అమెరికా CDC డేటా ప్రకారం, 2024 చివరి నుంచి 2025 మధ్యకాలంలో అడెనోవైరస్ సంబంధిత కేసులు కొన్ని రాష్ట్రాల్లో 30 నుంచి 40 శాతం వరకు పెరిగాయి. యూరప్‌లోని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా ఇదే విషయాన్ని గుర్తించింది. 2025 మొదటి మూడు నెలల్లో ఇంగ్లాండ్‌లో సాధారణ ఫ్లూ సీజన్‌తో పోలిస్తే అడెనోవైరస్ పాజిటివ్ కేసులు రెట్టింపు స్థాయికి చేరినట్టు అక్కడి పబ్లిక్ హెల్త్ డేటా చెబుతోంది. ఆసియా వైపు చూస్తే, చైనా, సింగపూర్ పిల్లల్లో అడెనోవైరస్ కేసులు పెరిగినట్టు స్థానిక ఆరోగ్య శాఖలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇక ఈ వైరస్ దగ్గు, తుమ్ము ద్వారా మాత్రమే కాదు… చేతులతో తాకిన వస్తువుల ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి చేరుతుంది.
ఇటు ప్రజలను భయపెడుతున్న మరో అంశం దాని చికిత్స. అడెనోవైరస్‌కు ప్రత్యేకంగా పనిచేసే మందులు లేవు. కోవిడ్‌లా వ్యాక్సిన్ లేదు. ఫ్లూ లాగా యాంటీవైరల్ డ్రగ్స్ కూడా సాధారణంగా ఇవ్వరు. ఎక్కువ మంది రోగులకు డాక్టర్లు చేసే పని ఒక్కటే. లక్షణాలను తగ్గించే మందులు ఇస్తారు. ఇక రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి. చిన్న పిల్లలు, వృద్ధులు, గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నవారిలో ఈ వైరస్ తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇది కోవిడ్‌తో పోల్చితే పూర్తిగా భిన్నమైన వైరస్. రెండూ శ్వాసకోశాన్ని ప్రభావితం చేస్తాయి కానీ కుటుంబాలు వేరు. కోవిడ్ వైరస్ సాధారణ డిస్ఇన్ఫెక్టెంట్స్‌తో సులువుగా నశిస్తుంది. అడెనోవైరస్ మాత్రం ఎక్కువకాలం బతుకుతుంది. అదే దీన్ని ఎక్కువగా వ్యాప్తి చెందేలా చేస్తోంది.
అయితే కోవిడ్‌లా పెద్ద ఎత్తున మరణాలకు కారణమవుతోందన్న ఆధారాలు లేవు. అందుకే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. అదే సమయంలో హైజీన్‌గా ఉంటూ, మాస్కులు ధరించడం తప్పనసరి అని హెచ్చరిస్తున్నారు.
