NTV Telugu Site icon

CM Revanth Reddy : విజయమే లక్ష్యంగా పని చేయాలి.. ఎమ్మెల్సీ ఎన్నిక జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

Cmrevanthreddy

Cmrevanthreddy

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు చేపట్టాల్సిన అన్ని రకాల చర్యలను ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా పకడ్బందీగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు రాత్రి నిజామాబాద్, మెదక్, అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జూమ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపదాస్ మున్షి కార్యదర్శులు విశ్వనాథ్, విశ్వనాథం లతోపాటు నాలుగు జిల్లాల సంబంధించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిసిసి అధ్యక్షులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేపడుతుందని ప్రధానంగా డీఎస్సీ ద్వారా 11 వేల ఉద్యోగాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, టీచర్లకు ప్రమోషన్లు, టీచర్ల బదిలీలు ఒక అద్భుతమైన విద్యా వ్యవస్థ, రుణమాఫీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, హ్యాండ్లూమ్ టెక్నీలజీ యూనివర్సిటీ లాంటి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతుందని ఆయన వివరించారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల కాబట్టి అత్యంత పకడ్బందీగా మంచి వ్యూహంతో ముందుకు పోవాలని ఆయన సూచించారు.

అనేకమంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఓట్ల కోసం ఉంటారని వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించి వచ్చే ఎన్నికల్లో వారు మన వైపు ఉండేలా చూసుకోవాలని అన్నారు. ప్రధానంగా యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ సంఘాలను ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా వ్యూహరచన చేయాలని సూచించారు.

ఈ నెల 15వ తేదీ వరకు ఈ ఎన్నికల సంబంధించి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని, అలాగే పార్లమెంట్ల వారీగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి అభ్యర్థి ఎంపిక కోసం సీనియర్ సీనియర్ నాయకులు చేత అభిప్రాయ సేకరించి అన్ని విధాల గెలుపు అవకాశాలున్న నాయకుని అభ్యర్థిగా నిలబెట్టాలని ఈ ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి ఎన్నికల సమన్వయ వ్యూహాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఏఐ సి సి ప్రధాన కార్యదర్శి దీపదాస్ మున్షి మాట్లాడుతూ ఓటరు నమోదు పెద్ద ఎత్తున చేపట్టాలని కొత్త ఓటర్ల నమోదులో ప్రత్యేక చర్యలు తీసుకొని పాత ఓటర్లు కొత్త ఓటర్లను మన వైపు ఆకర్షించేలా పకడ్బందీగా ప్రణాళిక చేపట్టాలని సూచించారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఓటర్ల నమోదు, సమన్వయ కమిటీ, పని విభజన, అభ్యర్థి ఎంపిక లాంటివి వెంటనే చేపట్టి ఎన్నికలకు సిద్ధం అవ్వాల్సి ఉందని నాయకులు ఎట్టి పరిస్థితులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అభ్యర్థి విజయాన్ని లక్ష్యంగా చేసుకొని పనిచేయాలని సూచించారు. ఇక ఈ సమావేశాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు డిసిసి అధ్యక్షులు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎన్నికలకు పూర్తిస్థాయి బాధ్యత తీసుకొని పనిచేయాలని ఆయన కోరారు.

కాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో తన అభ్యర్థిగా పోటీ చేసే సమయంలో కొంత సానుభూతి వ్యక్తం అయిందని అది విజయానికి దోహదపడిందని ఈ సారి అభ్యర్థి ఎంపిక ఓటర్ల నమోదు చాలా కీలకమని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, విజయం సాధించాలని ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నందున ఈ ఎమ్మెల్సీ ఎన్నిక గెలవడం చాలా ముఖ్యమన్నారు.

Show comments