Site icon NTV Telugu

Yuvatha Poru: సీఎం ఎన్నికల హామీలు ఎప్పుడూ నెరవేర్చే వ్యక్తి కాదని చరిత్రే చెబుతోంది.. వైసీపీ ఆధ్వర్యంలో ‘యువత పోరు’..!

Yuvatha Poru

Yuvatha Poru

Yuvatha Poru: శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా పరిషత్ వరకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘యువత పోరు’ కార్యక్రమానికి యువత భారీగా ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం యవతకు మోసం చేస్తోందని, కూటమి హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. ఎందరో ఉద్యోగులను తొలగించారని, వారందరినీ వెంటనే పునర్నియామకం చేయాలి. తమ హామీలలో 70 శాతం అయినా నెరవేర్చారా..? అంటూ ప్రశ్నించారు. అలాగే ఎమ్మెల్సీ కుంబా రవిబాబు మాట్లాడుతూ.. కూటమి నెరవేర్చలేని హామీలతో ప్రజలను మభ్యపెడుతోంది. 20 లక్షల ఉద్యోగాల ప్రకటన, నిరుద్యోగ భృతి వాగ్దానం అన్ని పూర్తిగా వర్ణనాతీతంగా మోసం. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఎన్నికల హామీలు నెరవేర్చే వ్యక్తి కాదని చరిత్రే చెప్పుతోందన్నారు.

Read Also:Weather Report: మత్స్యకారులు అప్రమత్తంగా ఉండండి.. ఐఎండీ హెచ్చరిక..!

అలాగే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. యువతను చంద్రబాబు ఘోరంగా మోసం చేశారు. రాష్ట్రంలో వికృత రాజకీయాలు నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పర్యటనను తప్పుదోవ పట్టించేందుకు అవాస్తవ ప్రచారం జరుగుతోంది. జగన్ టూర్ అనూహ్యంగా జరిగిందన్న పేరుతో పోలీసుల చేత ఆంక్షలు విధించి, ప్రజల మద్దతును అడ్డుకున్నారు. ఈ చర్యలన్నీ ముందుగా పథకం ప్రకారం రూపొందించిన కుట్ర అన్నారు. జగన్ పై వచ్చిన వీడియోలను టీడీపీ ఐటీ సెల్ తయారు చేసిన క్రియేటెడ్ వీడియోలుగా అభివర్ణించారు. Z+ భద్రత కలిగిన నాయకుడికి కనీసం ఎస్కార్ట్ లేకపోవడం, రెండు భిన్నమైన వీడియోల్లో సింగయ్యను ఆటోలో, మరొక వీడియోలో 108లో చూపించడమే దుష్ప్రచారానికి నిదర్శనం. ఇది జగన్‌ను బంధించేందుకు చేస్తున్న రాజకీయ కుట్ర మాత్రమే అని ఆరోపించారు.

Read Also:Hate Speech Bill: సోషల్ మీడియాపై కర్ణాటక సర్కార్ ఆంక్షలు.. హేట్ స్పీచ్ చేస్తే మూడేళ్లు జైలు శిక్ష

అలాగే ప్రభుత్వం యోగా పేరుతో వందల కోట్ల వ్యయాన్ని సమర్థించుకుంటూనే, గతంలో 400 కోట్లతో ప్రభుత్వ భవనాలు కట్టడాన్ని దుబారాగా విమర్శించడాన్ని విడ్డూరంగా అభివర్ణించారు. ప్రజల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. గ్రామాలకే వెళ్లే ప్రతినిధులను ప్రశ్నించినా తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వానికి సమయం దగ్గర పడుతోంది అంటూ హెచ్చరించారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ‘యువత పోరు’ కార్యక్రమానికి పెద్దెత్తున స్పందన లభిస్తోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో ఈ కార్యక్రమం పెద్దెత్తున కొనసాగుతోంది.

Exit mobile version