NTV Telugu Site icon

ML Iqbal Join in TDP: వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ ఇక్బాల్‌

Iqbal

Iqbal

ML Iqbal Join in TDP: అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాకిస్తూ.. ఇటీవలే రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌.. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇక్బాల్‌కు పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా హిందూపురం అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన ఆయన.. టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ చేతిలో ఓటమిపాలయ్యారు.. అయితే, మరోసారి టికెట్‌ ఆశించి భంగపడ్డారు.. ఈ నేపథ్యంలో.. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన.. ఈ రోజు సైకిల్‌ ఎక్కారు. పార్టీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు మహమ్మద్‌ ఇక్బాల్.

Read Also: Balineni Srinivasa Reddy: ఇప్పుడున్న వాలంటీర్లను కొనసాగిస్తామని చంద్రబాబు చెప్పగలరా..?

కాగా, గత వారం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ ఇక్బాల్.. సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు మండలి చైర్మన్‌కు రాజీనామా లేఖను పంపించారు.. వ్యక్తిగత కారణాలతోనే ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజీనామాకు దారితీసిన అసలు కారణాలను వెల్లడిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూపూర్ టికెట్ ఇవ్వనందుకు కాదు.. అమర్యాదగా ప్రవర్తించినందుకే వైసీపీకి రాజీనామా చేశానని స్పష్టం చేశారు ఇక్బాల్. మైనారిటీలకు, పోలీసులకు ఏమీ చేసే అవకాశం ఇవ్వలేదన్న ఆయన.. చంద్రబాబు హయాంలోనే మైనారిటీలకు రక్షణ ఉండేదన్నారు. ఇక, చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతానని ప్రకటించిన ఆయన.. చంద్రబాబు చేతుల మీదుగా ఈ రోజు పసుపు కండువా కప్పుకున్నారు. మరోవైపు.. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరిన విషయం విదితమే.