NTV Telugu Site icon

Annabathuni Sivakumar: తెనాలి ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే శివకుమార్‌..

Annabathuni Sivakumar

Annabathuni Sivakumar

Annabathuni Sivakumar: తెనాలి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అన్నాబ‌త్తుని శివ‌కుమార్ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది.. పోలింగ్‌ బూత్‌లో ఓ వ్యక్తిపై ఆయన చేయి చేసుకోవడం.. సదరు వ్యక్తి.. ఎమ్మెల్యేని తిరిగి కొట్టడం.. ఆ తర్వాత ఎమ్మెల్యే అనుచరులు అతడిపై దాడి చేయడం క్షణాల్లో జరిగిపోయాయి.. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. అయితే, ఈ ఘటనపై స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు ఎమ్మెల్యే శివకుమార్‌.. అసలు అలా ఆ ఘటన ఎలా జరిగింది..? దాడికి ఎలా దారితీసిందనే దానిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Read Also: AP Elections 2024: చివరి గంటల్లో పోలింగ్‌.. ఈసీ ప్రత్యేక దృష్టి..

తెనాలి ఐతాన‌గ‌ర్‌లో నా భార్యతో క‌లిసి ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డానికి ఈ రోజు ఉదయం వెళ్లాం అని తెలిపిన అన్నాబ‌త్తుని శివ‌కుమార్.. ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వ‌ర్గాల‌కు కొమ్ముకాస్తున్నావంటూ గొట్టిముక్కల సుధాక‌ర్‌ అనే వ్యక్తి నానా దుర్భాష‌లాడాడు.. నా భార్య ముందే న‌న్ను అస‌భ్యంగా దూషించాడు. బూత్‌లోకి వెళ్లేట‌ప్పుడు.. వ‌చ్చేట‌ప్పుడూ దుర్భాష‌లాడుతూనే ఉన్నాడు అని మండిపడ్డారు.. గొట్టిముక్కల సుధాక‌ర్ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన టీడీపీ వ్యక్తి.. అయితే, నువ్వు అస‌లు నువ్వు క‌మ్మోడివేనా అంటూ అస‌భ్యంగా మాట్లాడాడు..? పోలింగ్ బూత్ వ‌ద్ద మ‌ద్యం మ‌త్తులో అంద‌రి ముందు చాలా దురుసుగా ప్రవర్తించాడు.. మాల, మాదిగలకు కొమ్ముకాసే వ్యక్తివి నువ్వు అంటూ చెప్పలేని భాష వాడాడు.. పోలింగ్ బూత్‌లో ఉద‌యం నుండి అత‌డు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నట్లు అక్కడి ఓట‌ర్లే చెప్పారని వివరించారు. అంతే కాదు.. అత‌డు బెంగళూరులో ఉంటూ ఇక్కడ‌కు వ‌చ్చి హ‌డావిడి చేశాడని మండిపడ్డారు. టీడీపీ-జ‌న‌సేన వాళ్లు ఎక్కడెక్కడి నుండో వాళ్ల మ‌నుషుల‌ను పిలిపించి.. వైసీపీ ఎమ్మెల్యేల‌పై దాడులు చేయిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నాబ‌త్తుని శివ‌కుమార్.

Read Also: AP Elections 2024: చివరి గంటల్లో పోలింగ్‌.. ఈసీ ప్రత్యేక దృష్టి..

మరోవైపు.. తెనాలిలో ఎమ్మెల్యే పై చేయి చేసుకున్న వివాదంలో గొట్టిముక్కల సుధాకర్ మాట్లాడుతూ.. క్యూలో ఉండి ఓటు వేయమని అన్నందుకే నాపై ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ దాడి చేశాడని ఆరోపించారు.. శివకుమార్ అనుచరుల దాడితో నేను పోలింగ్ బూత్ లో దాక్కోవాల్సి వచ్చిందన్నారు. నేను సామాన్య పౌరుడిని, నన్ను రక్షించాల్సినవాళ్లే నాపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు పోలీసులు రక్షణ కల్పించాలి, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు గొట్టిముక్కల సుధాకర్.