YSR Death Anniversary: ఇప్పటికీ ఆ దివంగత నేత వైఎస్ఆర్ మనకు సజీవంగా ఉన్నట్లే.. ఒక్కసారి కాలం వెనక్కి వెళ్తే బాగుండు అన్నారు మంత్రి జోగి రమేష్.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.. రాజశేఖర రెడ్డికి విగ్రహానికి నివాళులు అర్పించారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఇతర నేతలు.. ఇక, సజ్జల జ్యోతి ప్రజ్వలన చేయగా.. పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు పార్టీ శ్రేణులు..
ఇక, ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సరిగ్గా ఇదే రోజు వైఎస్ఆర్ ప్రయాణించిన విమానం కనిపించలేదు.. అయినా ఒక ధీమా ఉండేది.. ఆయన ఎక్కడికి వెళతారు.. కచ్చితంగా వస్తారు అనుకున్నాం.. కానీ దురదృష్టం వెంటాడింది.. అయితే, ఒక వ్యక్తి పాలన పై, ప్రజల జీవితాల పై ఎంత ప్రభావం వేయగలరు అనటానికి వైఎస్సార్ ఒక ఉదాహరణ అన్నారు. కోట్లాది ప్రజల. గుండెల్లో రాజశేఖరరెడ్డి చిరస్థానం సంపాదించారు. సిద్ధాంతాలు పెట్టుకుని పాలించలేదు.. అందరూ తన కుటుంబ సభ్యులే అనుకున్నారు. రాష్ట్రాన్ని దేశంలో తలమానికంగా నిలబెట్టారు.. ప్రజల జీవితాల్లో ఒక వెలుగు తెచ్చారని గుర్తుచేశారు. వైఎస్సార్ తర్వాత అలుముకున్న చీకటిలో వెలుగు రేఖ తెచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ అన్నారు సజ్జల.. మాట మీద నిలబడే తత్వమే ప్రజల్లో ఆయన అంటే ఒక నమ్మకాన్ని సృష్టించిందన్న ఆయన.. ఆయనకు నిజమైన రాజకీయ వారసుడిగా జగన్ గత నాలుగేళ్లుగా పాలన చేస్తున్నారని కొనియాడారు.
మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఒక్కసారి కాలం వెనక్కి వెళితే బాగుండు అన్నారు. ఇప్పటికీ వైఎస్ఆర్ మనకు సజీవంగా ఉన్నట్లే.. వైఎస్సార్ నడకలో ఒక ఠీవి ఉండేది.. ఆయన దూరం అయి పద్నాలుగు సంవత్సరాలు అయ్యింది.. అయినా, పేదవాడి గుండె తాకితే వైఎస్సార్ అన్నారు. రాజశేఖరరెడ్డి మానవతా వాది.. రాజశేఖరరెడ్డి ఒక అడుగు వేస్తే ఆయన బాటలో జగన్ నాలుగు అడుగులు వేస్తున్నారని తెలిపారు. మరోవైపు.. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో పేద ప్రజల గుండె చప్పుడు వైఎస్ఆర్ అని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి.. కుల, మత, ప్రాంత విభేదం లేకుండా సంక్షేమ పథకాలు అందించారు.. వైఎస్సార్ గొప్ప పాలనాదక్షుడు.. వైఎస్సార్ ఆలోచనలను జగన్ ముందుకు తీసుకుని వెళుతున్నారని తెలిపారు మంత్రి మేరుగ నాగార్జున.