NTV Telugu Site icon

YSRCP: ముచ్చటగా మూడోసారి మారిన వైసీపీ అరకు ఇంఛార్జ్‌.. విషయం ఇదేనా..?

Araku

Araku

YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో మార్పులు, చేర్పులు కాకరేపుతున్నాయి.. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం.. బుధవారం రోజు ఐదో లిస్ట్‌ను ప్రకటించింది.. ఏడుగురు అభ్యర్థుల పేర్లతో ఇదో ఐదో లిస్ట్‌ వచ్చింది.. అయితే, అరకు అసెంబ్లీ సీటులో వైసీపీ ముచ్చటగా మూడోసారి కో-ఆర్డినేటర్ ను మార్చేసింది. లోకల్, నాన్ లోకల్ ఇష్యూ రచ్చ రచ్చగా మారడంతో హైకమాండ్ పునరాలోచనలో పడింది. ఇప్పటికే ప్రకటించిన ఎంపీ మాధవి స్థానంలో రేగం మత్స్య లింగం పేరును తెరపైకి తెచ్చింది. ఇక్కడ కొండ దొర సామాజిక వర్గం ఓటు బ్యాంకు కీలకం. మొత్తం ఓటర్లలో సుమారు 90వేలకు పైగా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. దీంతో మాధవి అభ్యర్థిత్వాన్ని అరకు అసెంబ్లీకి ఖరారు చేసింది.

Read Also: Ellyse Perry: ఎల్లీస్ పెర్రీ అందం ముందు హాలీవుడ్ హీరోయిన్స్ కూడా సరిపోరు!

అయితే, స్థానికత వివాదం చెలరేగడంతో కొంత కాలంగా అరకు వైసీపీలో ఆందోళనలు జరుగుతున్నాయి. వైసీపీ ముద్దు – మాధవి వద్దనే నినాదం కేడర్ లో బలంగా వెళ్లిపోయింది. దీంతో స్థానిక నాయకత్వానికి అవకాశం కల్పించాలని హైకమాండ్ నిర్ణయించింది. కొత్త కో ఆర్డినేటర్‌గా మత్స్య లింగం పేరును ప్రకటించింది.. ప్రస్తుతం హుకుంపేట జడ్పీటీసీగా వున్నారు మత్స్య లింగం. టీచర్ వృత్తిని వదిలి 2018లో వైసీపీలో చేరారు. గిరిజన ఉపాధ్యాయుల సంఘంతో పాటు ఆదివాసీ సంఘాలతో సత్సంబంధాలు కలిగిన నేతగా మత్స్య లింగంకు మంచి గుర్తింపు ఉంది.

Read Also: Budget 2024 : స్టార్ పెర్ఫార్మర్ కేటగిరిలో భారత ఆర్థిక వ్యవస్థ.. ధృవీకరించిన ఐఎంఎఫ్

కాగా, నిన్న తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇంఛార్జుల మార్పును ప్రకటించారు. 4 ఎంపీ, 3 అసెంబ్లీ స్థానాల్లో మార్పులను ప్రకటించారు. ఎమ్మెల్యేగా ఉన్న అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ అధిష్ఠానం. ఐదో జాబితాలో మూడు కొత్త పేర్లు నూకతోటి రాజేష్, రేగం మత్స్యలింగం, డా. సింహాద్రి చంద్రశేఖర్ రావు ఉన్నాయి. రెండు నియోజకవర్గాల్లో రెండోసారి మార్పు జరిగింది. అరకు అసెంబ్లీకి గొడ్డేటి మాధవి స్థానంలో మత్స్యలింగంకు అవకాశం దక్కింది. ఆదిమూలం పార్టీ ఫిరాయింపుతో పాత స్థానానికి గురుమూర్తిని నియమించారు. తిరుపతి ఎంపీగా మళ్లీ గురుమూర్తికే అవకాశం కల్పించారు. తర్జనభర్జనల తర్వాత అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అవనిగడ్డ బాధ్యతలు ప్రముఖ సర్జికల్ అంకాలజిస్ట్‌ డా.సింహాద్రి చంద్రశేఖరరావుకు అప్పగించారు. మరోసారి కాకినాడ లోకసభ నుంచి బరిలో చలమలశెట్టి సునీల్ నిలబడనున్నారు. వరుసగా మూడు సార్లు చలమలశెట్టి సునీల్ ఓటమి పాలయ్యారు. 2019లో టీడీపీ, 2014లో వైసీపీ, 2009లో పీఆర్పీ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి చలమలశెట్టి సునీల్ ఓటమి పాలైన విషయం విదితమే.