YSRCP: ఒంగోలు ఎంపీ స్థానానికి దాదాపు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేరును ఖరారు చేసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఒంగోలు పార్లమెంట్, సంతనూతలపాడు, కందుకూరు, కావలి నియోజకవర్గాల రీజనల్ కో-ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం.. అయితే, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి సిట్టింగ్ సీటును కొనసాగించేందుకు పట్టుబడుతూ వచ్చారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. చివరకు అధిష్టానం మొత్తబడకపోవటంతో చేతులెత్తేశారు బాలినేని.. తన పని తాను చూసుకుంటానని తాజాగా వెల్లడించారు.
Read Also: Buddha Venkanna: దమ్ముంటే రండి.. మీరో మేమో చూసుకుందాం..!
మరోవైపు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో డోర్స్ క్లోజ్ కావటంతో ప్రత్యామ్నాయం వైపు మాగుంట చూస్తున్నారట.. తెలుగుదేశం పార్టీతో టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయన అనుచరులతో మాగుంట మంతనాలు పూర్తిచేశారట.. ఇక, తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఈసారి పోటీలో నిలపాలని భావిస్తున్నారట మాగుంట.. కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ మార్పుపై మాగుంట త్వరలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. మొత్తంగా జిల్లాలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి వ్యవహారం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. కాగా, ఐదో లిస్ట్ ద్వారా 4 ఎంపీ, 3 అసెంబ్లీ స్థానాల్లో మార్పులను ప్రకటించింది వైసీపీ అధిష్టానం. ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్‌కు నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ అధిష్ఠానం. ఐదో జాబితాలో మూడు కొత్త పేర్లు నూకతోటి రాజేష్, రేగం మత్స్యలింగం, డా. సింహాద్రి చంద్రశేఖర్ రావు ఉన్నాయి. రెండు నియోజకవర్గాల్లో రెండోసారి మార్పు జరిగింది. అరకు అసెంబ్లీకి గొడ్డేటి మాధవి స్థానంలో మత్స్యలింగంకు అవకాశం దక్కింది. ఆదిమూలం పార్టీ ఫిరాయింపుతో పాత స్థానానికి గురుమూర్తిని నియమించారు. తిరుపతి ఎంపీగా మళ్లీ గురుమూర్తికే అవకాశం కల్పించారు. తర్జనభర్జనల తర్వాత అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అవనిగడ్డ బాధ్యతలు ప్రముఖ సర్జికల్ అంకాలజిస్ట్ డా.సింహాద్రి చంద్రశేఖరరావుకు అప్పగించారు. మరోసారి కాకినాడ లోకసభ నుంచి బరిలో చలమలశెట్టి సునీల్ నిలబడనున్నారు.