YSRCP: ఎన్నికలపై వైసీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ ప్రణాళికలను రచిస్తోంది. ఈ క్రమంలో పలు నియోజకవర్గాలకు పార్టీ ఇంఛార్జిలను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 175 నియోజకవర్గాల్లో చేసిన సర్వే ప్రకారం.. 45 నుంచి 50 నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లను మార్చే అవకాశం ఉంది. ఫస్ట్ ఫేజ్ లో 11 సెగ్మెంట్లలో పరిస్థితిని వైసీపీ విశ్లేషించింది. సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వివరాలను సోమవారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద మీడియాకు తెలియజేశారు. పదకొండు నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్‌లను నియమించినట్లు వెల్లడించారు. స్థాన చలనం కలిగిన వాళ్లలో పలువురు మంత్రులు కూడా ఉన్నారు. రెండు ప్రతిపాదనలపై ఫోకస్ పెట్టింది వైసలీపీ. ఒకటి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇంఛార్జులను వేరే నియోజకవర్గాలకు స్థాన చలనం కలిగించడం.. రెండోది పూర్తిగా పక్కన పెట్టి కొత్త అభ్యర్థిని బరిలో పెట్టడం లాంటివి ఉన్నాయి. గెలుపు గుర్రాలే ఏకైక ప్రాతిపదికగా నిర్ణయం తీసుకుంది. త్వరలో కసరత్తు కొలిక్కి రానుంది.
Read Also: Big Breaking: రైతు బంధు నిధుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
గుంటూరు పశ్చిమ- విడదల రజిని, మంగళగిరి-గంజి చిరంజీవి, పత్తిపాడు-బాలసాని కిషోర్ కుమార్, వేమూరు- అశోక్‌బాబు, సంతనూతలపాడు -మేరుగ నాగార్జున, తాడికొండ-మేకతోటి సుచరిత, కొండెపి -ఆదిమూలపు సురేష్, చిలకలూరిపేట- రాజేష్ నాయుడు, అద్దంకి -పాణెం హనిమిరెడ్డి, రేపల్లె -ఈవూరు గణేష్, గాజువాక-వరికూటి రామచంద్రరావులను నియమించినట్లు తెలిపారు. ఏపీ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలుపే ప్రతిపాదికన ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
ఈ మార్పుతో 2024 ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. నేతల గెలుపు అవకాశాల్ని బట్టి ఇంఛార్జ్‌లను మార్చామని తెలిపారు. అన్ని స్థానాల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా సాగుతోందని.. అందుకోసమే సీఎం జగన్ ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా అవసరాన్ని బట్టి మార్పులు ఉంటాయని సజ్జల చెప్పుకొచ్చారు.