Site icon NTV Telugu

Chittoor District Bandh: నేడు చిత్తూరు జిల్లా బంద్‌

Ycp

Ycp

Chittoor District Bandh: చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తతల్ని రాజేసింది. చంద్రబాబు స్పీచ్‌తో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. చిన్నపాటి నిరసనగా మొదలైన ఆందోళన కాస్తా.. పోలీసులపై దాడి, పోలీసుల వాహనాల దగ్ధం వరకు వెళ్లింది. తబంళ్లపల్లె డి.కొత్తకోట నుంచి అంగళ్లకు వెళ్తున్న చంద్రబాబును నిరసిస్తూ వైసీపీ శ్రేణులు గో బ్యాక్‌ నినాదాలు చేశారు. దీంతో ఇరుపార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. రాళ్ల దాడికి దారి తీసింది. ఆ తర్వాత అంగళ్లకు చేరుకున్న చంద్రబాబు.. టీడీపీ కార్యకర్తలకైన గాయాలు చూసి తరిమికొట్టండి.. వదలకండి అంటూ పరుష పదజాలం ఉపయోగించారు. పోలీసులపైనా విమర్శలు చేశారు. పెద్దరౌడీ పుంగనూరులో ఉన్నాడు.. అక్కడే తేల్చుకుందాం అంటూ మంత్రి పెద్దిరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతుండగానే.. టీడీపీ కార్యకర్తలు పుంగనూరు వైపు పరుగులు తీశారు.

పుంగనూరుకు చంద్రబాబు, టీడీపీ క్యాడర్ రాకుండా బీమగానిపల్లె దగ్గర పోలీసులు రోడ్లపై బారికేడ్లు పెట్టారు. కానీ, ఆ బారికేడ్లు తొలగించి పుంగనూరు వైపు చొచ్చుకెళ్లారు టీడీపీ కార్యకర్తలు. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అదే సమయంలో పోలీసులపై రాళ్లు రువ్వారు టీడీపీ కార్యకర్తలు. బీర్‌ బాటిళ్లు విసిరారు. మరోవైపు పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. పుంగనూరులో జరిగిన రాళ్లు, బాటిళ్ల దాడిలో.. 14 మంది పోలీసులకు గాయాలయ్యాయి. మరో 50మందికి గాయాలయ్యాయి. బైపాస్ నుంచి వెళ్లాల్సిన చంద్రబాబు.. పుంగనూరుకు రావడంతో హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు పోలీసు ఉన్నతాధికారులు. పక్కా ప్లాన్ ప్రకారం పోలీసులపై దాడులు జరిగాయన్నారు చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి.

పుంగనూరులో టీడీపీ నేతలు ప్లాన్ మార్చి గొడవ చేశారని, గవర్నమెంట్ సర్వెంట్‌లను చంపడానికి ప్రయత్నించారని అన్నారు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి. కేడర్‌ను నేతలు రెచ్చగొట్టడం సరికాదన్నారు. ఇక, పుంగనూరులో జరిగిన అల్లర్లు, టీడీపీ శ్రేణుల నిరసిస్తూ ఇవాళ చిత్తూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది వైసీపీ. దీంతో జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. అటు పుంగనూరులో పోలీసులు భారీగా మోహరించారు.

Exit mobile version