మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇవాళ రెండవ రోజు ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ ముగిసింది. 8 గంటల పాటు విచారించిన సిబిఐ పలు విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. హత్యను గుండెపోటుగా ఎవరు చిత్రీకరించారనే దానిపై ఆరా తీశారు సీబీఐ అధికారులు. వివేకా హత్య జరిగిన రోజు ఉదయం అవినాష్ రెడ్డి ఇంటి దగ్గరలో ఉన్నట్లు గుర్తించారు. మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఇంట్లోనే ఉన్నట్లు చూపించిన తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. అవినాష్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా వైఎస్ భాస్కర్ రెడ్డి , ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ విచారించింది.
Read Also: Karnataka Elections: ఈపీఎస్ వర్సెస్ ఓపీఎస్.. పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటించిన అన్నాడీఎంకే
అవినాష్ రెడ్డి రాజకీయ ఎంట్రీపై కూపీలాగింది కేంద్ర దర్యాప్తు సంస్థ. నిందితులతో జరిపిన ఆర్థిక లావాదేవీలపై ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 40 కోట్ల రూపాయల డీల్‌కు సంబంధించి అవినాష్ రెడ్డి పాత్రపై ఆరా తీసింది సీబీఐ. ఇటు వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి , ఉదయ్ కుమార్ లకు రెండో రోజు సీబీఐ కస్టడీ విచారణ ముగిసింది.
ఈ ఇద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలించిన సీబీఐ అధికారులు..ఇద్దరినీ ఏడు గంటల పాటు విచారించారు. అనంతరం సీబీఐ అధికారులు వారిని చంచల్ గూడ జైలుకి తరలించారు. మరోవైపు వైఎస్ వివేకా కూతురు సునీత నర్రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. ఈ కేసులో ఈ నెల 25 వరకూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్ట్ ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ వివేకా కూతురు సునీత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జరిగే విచారణపై ఉత్కంఠ నెలకొంది.
Read Also: Volodymyr Zelensky: ఇదే సమయం.. మమ్మల్ని కూడా “నాటో”లో చేర్చుకోండి…