YS Sharmila: APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడలో ఏపీలో అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాలపై కూటమి ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ అని పేర్కొనడం సిగ్గుచేటుతో కూడినదని, ప్రజలకు ఇవ్వాల్సిన వాగ్దానాలు పూర్తిగా అమలులోకి వచ్చాయని చెప్పడం హాస్యాస్పదమని ఆమె పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీలలో ఒక్కటైనా పూర్తిగా అమలు అయ్యిందా? రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులలో ఒక్కరికి కూడా 3,000 రూపాయల భృతి అందించిందా? కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? స్థాపించని పరిశ్రమలతో అగ్రిమెంట్లు చేసుకోవడం ద్వారా ఉద్యోగాలు వచ్చాయని చెప్పగలరా? ఒక్కరికి భృతి ఇవ్వకుండా, ఉద్యోగం రాకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఎలా చెప్పగలరు? అంటూ షర్మిలా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మహిళల కోసం ప్రతీ నెల 1500 రూపాయలు అందించే హామీ అమలు అయ్యిందా? అన్నదాతలకు ఇచ్చే వాగ్దానం మోసమని ఆమె తెలిపారు. కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలతో మాత్రమే రైతులను లింక్ చేసినట్టు.. 44 లక్షల రైతులకే 7,000 రూపాయలు ఇచ్చి, మిగతా 30 లక్షల రైతులకోసం పథకాన్ని కోత పెట్టారన్నారు. తల్లికి వందనం పథకంలో 87 లక్షల మంది బిడ్డల్లో 20 లక్షల మంది కోత పెట్టారని ఆమె వ్యాఖ్యానించారు. అలాగే మూడు సిలిండర్ల పథకం అమలు వివరాలు కూడా తెలియడం లేదు.
సూపర్ సిక్స్ అమలు అయ్యిందని చెప్పడం ప్రజలను నవ్విస్తున్నదని, గోరంత చేసి కొండంత వాగ్దానాలు చెప్పడం కూటమి ప్రభుత్వానికి మాత్రమే చెల్లుతుందని షర్మిలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్, వ్యవసాయానికి సబ్సిడీ, భూమి పథకాలు, ఫీజు రీయింబర్స్, ఆరోగ్యశ్రీ చెల్లింపులు, విద్యుత్ ఛార్జీల నియంత్రణ, పెట్రోల్-డీజిల్ ధరల తగ్గింపు, జర్నలిస్టులకు ఉచిత నివాసం వంటి ప్రధాన హామీలలో ఒక్కటైనా అమలు అయ్యిందా? అంటూ ఆమె ప్రశ్నించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని, షర్మిలా రెడ్డి సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
