Site icon NTV Telugu

YS Jagan: ముఖ్యమంత్రికి పాలన మీద కాదు.. సొంత ఆదాయాలు పెంచుకోవడం మీదే ధ్యాస!

Ys Jagan Speech

Ys Jagan Speech

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పాలన మీద ధ్యాస లేదని, సొంత ఆదాయాలు పెంచుకోవడం మీదే పూర్తి ధ్యాస పెట్టారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ విమర్శించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు, ఆయన బినామీల జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో దోచుకో.. పంచుకో.. తినుకో అనేదే కనిపిస్తోందని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులతో జగన్ సమావేశం నిర్వహించారు.

‘కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా రెండేళ్లు కావొస్తోంది. ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు భ్రమలు తొలగిపోయాయి. చంద్రబాబు గారి ప్రభుత్వం పట్ల జనాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రభుత్వం కళ్లార్పకుండా అబద్ధాలు చెప్తోంది, జంకు లేకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోంది. వ్యవస్థలన్నీ నిర్వీర్యం, అరాచకం, అవినీతి కనిపిస్తున్నాయి. పూర్తిగా పాలన గాడి తప్పింది. అక్రమాలకు అవకాశం లేకుండా మన హయాంలో లిక్కర్‌ పాలసీ ఉండేది. క్వాలిటీ విషయంలో ఏరోజు కూడా రాజీ పడలేదు. లిక్కర్‌ కొనుగోలు ఎంపానెల్‌ డిస్టలరీస్‌ నుంచే కొనుగోలు చేశాం. ప్రతి కోటా క్రమం తప్పకుండా క్వాలిటీ చెక్‌ చేసేవాళ్లు. క్వాలిటీ చెక్‌ చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లోకి లిక్కర్‌ వెళ్లేది. నిర్దిష్టమైన సమయాల్లోనే మాత్రమే లిక్కర్‌ అమ్మేవాళ్లం. షాపులు తగ్గించి, బెల్టుషాపులు ఎత్తివేశాం. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే నిర్వహించింది.,ఇల్లీగల్‌ పర్మిట్ రూమ్స్‌ రద్దు చేశాం. మూడింట ఒక వంతు షాపులు తగ్గించాం. మన హయాంలో ప్రతి బాటిల్‌పైన క్యూ ఆర్‌కోడ్‌ ఉండేది. ప్రతి బాటిల్‌ అమ్మేటప్పుడు క్యూ ఆర్‌కోడ్‌ స్కాన్‌ చేసి అమ్మేవాళ్లు. నూటికి నూరు శాతం క్వాలిటీతోనే మద్యం అమ్ముడుపోయేది. ఇప్పుడు కల్తీ లిక్కర్‌ మాఫియా నడుస్తోంది. దీని కోసం ప్రభుత్వ దుకాణాలను మూసేశారు. చంద్రబాబు, ఆయనకు సంబంధించిన మాఫియాకు ప్రైవేటు దుకాణాలు అప్పగించారు. వేలం పాట నిర్వహించి బెల్టు షాపులు వారి మనుషులకే అప్పగించారు. వీళ్లందరికీ మళ్లీ పోలీసుల నుంచి ప్రొటెక్షన్‌ ఉంటుంది’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Also Read: Pawan Kalyan: ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీ.. పవన్‌ కల్యాణ్‌ సూచనలతో ఉత్తర్వులు..

‘ఎమ్మెల్యేకు ఇంత, పోలీసులకు ఇంత, పైనున్న పెదబాబుకు ఇంత, చినబాబుకు ఇంత అని పంచుకుంటున్నారు. డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను మొత్తం చేతుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఇల్లీగల్‌గా ఆదాయాలు పెంచుకోవడానికి తెరలేపారు. వీరికి సంబంధించిన షాపుల నుంచి తమకు కావాల్సిన వారికి మాత్రమే ఆర్డర్లు ఇస్తున్నారు, ఇదోరకం మాఫియా. ఇదికాక మరో రకం మాఫియా నడుపుతున్నారు. ప్రజలు చనిపోయినా పర్వాలేదు, తమ జేబుల్లోకి డబ్బు వస్తే చాలనుకుంటున్నారు. చంద్రబాబు పరిపాలనలో రాక్షస పరిపాలన నడుస్తోంది. ఒక పద్ధతి ప్రకారం కల్తీ మద్యాన్ని పరిశ్రమ మాదిరిగా నడుపుతున్నారు. క్వాలిటీ లేని లిక్కర్‌ను తయారుచేసి, తన ప్రైవేటు మాఫియా నెట్‌వర్క్‌ద్వారా నేరుగా పంపిస్తున్నారు. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒక బాటిల్‌ కల్తీ బాటిల్‌. ఆ కల్తీ మద్యాన్ని తాగి మనుషులు చనిపోతున్న పరిస్థితి. ప్రాంతాల వారీగా కల్తీ దందా నడుపుతున్నారు. కల్తీ మద్యం తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇబ్రహీపట్నంలో భారీగా దొరికిన మద్యం, దాని తయారీకి సంబంధించిన వస్తువులు మాఫియా తీవ్రతను తెలియజేస్తున్నాయి. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ లూటీ చేస్తున్నారు’ అని జగన్ మండిపడ్డారు.

Exit mobile version