NTV Telugu Site icon

YS Jagan: కలుషితాహారం తిని విద్యార్థులు మృతి.. వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

Jagan

Jagan

YS Jagan: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన ఘటనపై వైయస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సరైన పర్యవేక్షణ కొరవడిందనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుందన్నారు. చికిత్స పొందుతున్న ఇతర విద్యార్థులకు మంచి వైద్య సదుపాయాలను అందించాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ జగన్‌ డిమాండ్‌ చేశారు. తప్పుడు ప్రచారాలు, బురద జల్లుడు కార్యక్రమాలు ఇకనైనా మాని వ్యవస్థలపై దృష్టి పెట్టాలని, ఇలాంటి ఘటనలు పురావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు.

Read Also: CM Chandrababu: కలుషిత ఆహారంతో విద్యార్థులు మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

కైలాసపట్నంలోని ఓ అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మొత్తం 86 మంది విద్యార్థులు ఉండగా.. వారిలో 27 మంది నిన్న ఉదయం అనారోగ్యానికి గురయ్యారు. వారికి వాంతులు, విరేచనాలు కావడంతో సిబ్బంది హూటాహూటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక, తీవ్ర అస్వస్థతకు గురైన స్టూడెంట్స్ లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో నలుగురు మరణించగా.. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో.. డిప్యూటీ డీఈఓ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగడంతోనే విద్యార్థులు ఆనారోగ్యం బారిన పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు విద్యార్థుల మృతితో.. కైలాసపట్నంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.