వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల రిటర్నింగ్ ఆఫీసర్ (RO) కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పులివెందుల ఎన్నికల్లో జరిగిన భారీ అక్రమాలు, దాడులు, రిగ్గింగ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, సీసీ కెమెరాల ఫుటేజ్‌లు, దాడుల వివరాలు, దొంగ ఓట్ల వివరాలతో కూడిన సమగ్ర వినతిపత్రాన్ని RO చిన్నయ్యకు అందజేశారు. తనతో పాటు సుమారు 70 మంది పోలింగ్ ఏజెంట్లతో కలిసి ఆయన ఆందోళనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయనేది మీ మనస్సాక్షికి బాగా తెలుసని వ్యాఖ్యానించారు. తాను తలుచుకుని పిలుపునిస్తే అసలు ఎన్నికలే జరగవని, అయినప్పటికీ తాము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నామని స్పష్టం చేశారు. తాము ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోతే సమాజానికి ఎలాంటి సందేశం ఇచ్చినట్లు అవుతుందని ప్రశ్నించారు. సుమారు 80 బూత్‌లకు చెందిన 70 మంది పోలింగ్ ఏజెంట్లు అక్కడే ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉన్నారని, ఓటర్లను ఓటు వేయకుండా ఎలా అడ్డుకుంటారని నిలదీశారు.
పోలీసులే స్వయంగా ఏజెంట్ల ఫారాలు తీసుకోవడం ఏమిటని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలను ప్రస్తావిస్తూ, వెంటనే పులివెందుల ఎన్నికలను రద్దు చేసి రీ-పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతా తప్పు జరుగుతోందని స్పష్టంగా కనిపిస్తున్నా, మీకు న్యాయం అనిపించినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులను నిలదీశారు. ఇప్పటికైనా ఓట్లు వేయడానికి సరైన అవకాశం కల్పిస్తే సగం పోలింగ్ జరిగేదని, ఎన్నికల ప్రక్రియలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని జగన్ మోహన్ రెడ్డి గట్టిగా డిమాండ్ చేశారు.

