NTV Telugu Site icon

YS Jagan: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సను గెలిపించాలి..

Ys Jagan

Ys Jagan

YS Jagan: ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సను గెలిపించాలని ఆయన కోరారు. ఈ ఎన్నికల్లో గెలిచినవారు, పోటీచేసిన అభ్యర్థులు అందరూ కూడా బొత్స పేరును ఏకగ్రీవంగా నిలబెట్టారని జగన్‌ చెప్పుకొచ్చారు. బొత్స గెలుపుకు మీరంతా అండగా ఉండాలని నేతలను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తగిన సంఖ్యా బలం లేదని.. నైతికలు విలువలు పాటిస్తే గనుక టీడీపీ పోటీ పెట్టకూడదని ఆయన అన్నారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే.. విలువలు పాటిస్తూ పోటీకి పెట్టే వాళ్ళం కాదన్నారు. సంఖ్యాబలం లేదని తెలిసినా టీడీపీ పోటీకి దిగుతోందన్నారు. 380 పైచిలుకు ఓట్ల ఆధిక్యత ఉందని తెలిసినా టీడీపీకి పోటీకి దిగుతోందని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు అధర్మ యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శలు గుప్పించారు. డబ్బుతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నాడని.. రాజకీయాల్లో విలువలను మరింత దిగజారుస్తున్నాడని ఆరోపించారు. విలువులు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చిరస్థాయిగా ఉంటాయన్నారు. ఇవి వదులుకున్నప్పుడు ప్రజలకే కాదు, మన ఇంట్లోకూడా మనకు విలువ తగ్గుతుందన్నారు.

Read Also: AP Cabinet Decisions: అక్టోబర్ నుంచి కొత్త మద్యం విధానం.. క్యూఆర్‌ కోడ్‌తో పాసు పుస్తకాలు.. కేబినెట్‌ నిర్ణయాలివే..

“నేను జీవితంలో విలువలకు, విశ్వసనీయ తకు కట్టుబడి ఉన్నాను. కాంగ్రెస్‌ నుంచి నేను బయటకు వచ్చినప్పుడు నేను, అమ్మ మాత్రమే బయటకు వచ్చాం. నాతో వచ్చేవాళ్లు రాజీనామాలు చేసి వచ్చారు. ఇద్దరితో మొదలైన పార్టీ.. పెద్ద స్థాయికి చేరుకుంది. విలువలు విశ్వసనీయతతోనే మనం రాజకీయాలు చేశాం. 2014లో ఎన్నికలప్పుడు రుణమాఫీ, నిరుద్యోగ భృతి హామీలను చంద్రబాబు ఇచ్చినప్పుడు నన్నుకూడా అలాంటి హామీలు ఇవ్వమని ఒత్తిడి తెచ్చారు. కాని చేయలేనిది, జరగనిది చెప్పడానికి నేను ఇష్టపడను. ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయాం. మనం ప్రతిపక్షంలో ఉన్నాం. తర్వాత చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలే అని ప్రజలు గుర్తించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు. మనం అధికారంలోకి వచ్చాం. మేనిఫెస్టోలో చెప్పింది తప్పకుండా అమలు చేశాం. రాజకీయాల్లో విలువలకు, విశ్వసనీయతకు అర్థంచెప్పాం. మేనిఫెస్టో అంటే.. భగవద్గీత, ఖరాన్‌, బైబిలు అని అమలు చేశాం. మన ఎమ్మెల్యేలు గడపగడకూ వెళ్లారు. మేనిఫెస్టోలో అమలు చేసిన అంశాలను ప్రజలకు చూపించారు. దేవుడు, ప్రజల ఆశీస్సులతో మనం గొప్పపాలన అందించాం.” అని జగన్ పేర్కొన్నారు.

కాని, 2024 ఎన్నికల్లో 10శాతంమంది ప్రజలు చంద్రబాబు మోసపూరిత హామీలను నమ్మారని జగన్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాడని.. కాని, ఏం జరిగింది? రెండు నెలలు అయినా ప్రజలకు ఏమీ జరగడంలేదన్నారు. “జగనే ఉండి ఉంటే అమ్మ ఒడి వచ్చేది.. రైతు భరోసా వచ్చేది…ఫీజు రియింబర్స్‌మెంట్‌… విద్యాదీవెన…సున్నావడ్డీలు వచ్చేవి.. మోసం, అబద్ధాలతో చేసే పాలన ఎక్కువ కాలం ఉండదు. ఇవ్వాళ్టికీ మనం తలెత్తుకుని ప్రజల వద్దకు గర్వంగా వెళ్లగలం. చంద్రబాబుకు చెందిన లీడర్లు, ప్రజాప్రతినిధులు.. మనలా ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు ఉన్నాయా? సూపర్‌ సిక్స్‌ గురించి ప్రజలు అడిగితే వాళ్లు ఏం సమాధానం చెప్తారు?” అని జగన్‌ ప్రశ్నించారు.

Show comments