NTV Telugu Site icon

YS Jagan: వల్లభనేని వంశీపై తప్పుడు కేసులు పెట్టారు.. పట్టాభిని సీఎం పంపించి గొడవ సృష్టించారు!

Untitled Design

Untitled Design

విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ములాఖత్‌లో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు వంశీతో జగన్‌ ములాఖత్ అయ్యారు. జగన్ వెంట వంశీ సతీమణి పంకజశ్రీ, సింహాద్రి రమేష్ జైలు లోపలికి వెళ్లారు. ములాఖత్‌లో వంశీని పరామర్శించడానికి కొడాలి నాని,పేర్ని నాని పేర్లు కూడా వైసీపీ నేతలు ఇచ్చారు. సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ఈ ఇద్దరికీ అనుమతి ఇవ్వలేమని జైలు అధికారులు చెప్పారు. విజయవాడ జైల్లో కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

వల్లభనేని వంశీతో ములాఖత్‌ అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దిగజారిపోయింది. అతి దారుణంగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే వ్యక్తి ఈ కేసుతో తనకు సంబంధం లేదని చెప్పాడు. జడ్జి ముందే తన వాంగ్మూలాన్ని ఇచ్చాడు, వంశీకి సంబంధం లేదని చెప్పాడు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో పట్టాభితో సీఎం చంద్రబాబు బూతులు తిట్టించారు. ఎవరేం పీకుతారో చూస్తానంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. వైసీపీ శ్రేణులు సంయమనంగానే వ్యవహరించారు. పట్టాభి మనుషులు ఓ దళిత సర్పంచ్ పై దాడి చేశారు. దాడి ఘటనలో సీఐ కనకారావుకు కూడా గాయాలు అయ్యాయి. ఇరు వర్గాలపై పోలీసులు కేసులు పెట్టారు. మేము అధికారంలో ఉన్నా.. న్యాయబద్దంగానే వ్యవహరించాం’ అని అన్నారు.

‘వంశీ ఘటనలో లేదు కాబట్టి ఎక్కడా ఆయన పేరు లేదు. పోలీసులు కావాలని ఆయన పేరును ఇరికించటం కోసం దళిత యువకుడు సత్యవర్ధన్‌తో అతనికి సంబంధం లేకుండా కేసు పెట్టారు. ఘటనా స్థలంలో వంశీ లేడు కాబట్టి ఆయన పేరు ఎవరూ చెప్పలేదు. సత్యవర్ధన్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో తనను ఎవరు తిట్టలేదని చెప్పాడు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కేసు రీ ఓపెన్ చేశారు. ఇదే సత్యవర్ధన్‌తో రెండవసారి 161 స్టేట్మెంట్ తీసుకున్నారు. వంశీ మీద ఉన్న ఆక్రోశంతో సీఎం చంద్రబాబు కేసు పెట్టించారు. వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా 71వ నిందితుడిగా చేర్చారు. టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టే ప్రయత్నం చేశారని మరో ఫాల్స్ కేసు పెట్టించారు. టీడీపీ కార్యాలయం కూడా ఎస్సీ, ఎస్టీ వ్యక్తులకు సంబంధించినదని మరో తప్పుడు కేసు పెట్టారు. చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగా వంశీకి బెయిల్ రాకూడదని అట్రాసిటీ కేసులు పెట్టించారు. మరో 44 మంది వైసీపీ నేతలపై కేసులు పెట్టారు. సత్యవర్ధన్ మెజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం ఇస్తే మిగతా వాళ్లకు బెయిల్ వస్తుందని ఆలస్యం చేశారు. సత్యవర్ధన్ జడ్జ్ ముందు ఘటన జరిగిన సమయంలో తాను లేను, తనను ఎవరూ తిట్టలేదని మొర పెట్టుకున్నాడు. చంద్రబాబాబు, లోకేష్ కు వంశీని అరెస్ట్ చేయలేకపోతున్నామని ఆక్రోశం వెళ్లగక్కారు. మళ్ళీ కోర్టును తప్పుదోవ పట్టించారని మరో కేసు పెట్టించారు. సత్యవర్ధన్ అమ్మ, నాన్న, సోదరుడిని బెదిరించి తప్పుడు కేసు పెట్టించారు. కిడ్నాప్, బెదిరింపు అంటూ ఆ కేసు పెట్టారు’ అని జగన్ మండిపడ్డారు.