YS Jagan Letter To Speaker: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు లేఖ రాశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మంత్రుల తర్వాత నాతో ప్రమాణస్వీకారం పద్దతులకు విరుద్ధం అని పేర్కొన్న ఆయన.. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారు..? అని ప్రశ్నించారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు. కానీ, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని తన లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటులో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ.. ఈ నిబంధన పాటించలేదన్నారు.. అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే నాపట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారని.. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని పేర్కొన్నారు.
Read Also: Kalki 2898 AD: “నన్ను చంపొద్దు ప్లీజ్” ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అమితాబ్.. ఎందుకో తెలుసా?
ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదని లేఖలో పేర్కొన్నారు వైఎస్ జగన్.. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని కోరుతున్నాని స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు రాసిన లేఖలో పేర్కొన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కాగా, అసెంబ్లీలో సీఎం, డిప్యూటీ సీఎం.. మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. వైఎస్ జగన్‌తో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి.. అయితే, ప్రతిపక్ష హోదాకు కావాల్సినన్ని సీట్ల సంఖ్య లేకపోయినా.. మేం జగన్‌ను గౌరవించామని అధికార పక్షం చెబుతున్న విషయం విదితమే.