YS Avinash Reddy: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండల కేంద్రంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్‌షోకు భారీ ఎత్తున ప్రజలు వైసీపీ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఈ రోడ్ షోలో వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకా హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనపైన అనవసరంగావైఎస్ వివేకా హత్య కేసు మోపారని.. నన్ను, మా నాన్నను చాలా ఇబ్బందులకు గురి చేశారని వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. జైల్లో నాన్నను కలిసినప్పుడల్లా.. తనకు తెలిసి జీవితంలో ఎవరికి ఏ పాపం చేయలేదని.. దేవుడు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు.. ఎందుకు ఇలా జరుగుతోంది అని నాతో అంటూ బాధపడేవాడరని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: PM Modi: వేములవాడలో కోడెమొక్కులు తీర్చుకున్న ప్రధాని.. సభలో మోడీ ప్రసంగం..
దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఇటీవల నాన్నకు బెయిల్ వచ్చిందన్నారు. మా కుటుంబంలో ఇద్దరు అక్కలు చంద్రబాబు ట్రాప్‌లో పడిపోయారని వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. వాళ్ల డైరెక్షన్లో వీళ్లు నడుచుకుంటున్నారని ఆయన అన్నారు. దయచేసి ప్రజలు చంద్రబాబు ట్రాప్‌లో పడకుండా వైయస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తనకు తోడుగా ఉండాలని ప్రజలను కోరారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ వచ్చేలా ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నానన్నారు. ఏ తప్పు చేయనప్పుడు భగవంతుడు ఎల్లప్పుడూ తోడుంటాడు.. తాత్కాలికంగా కష్టాలు వచ్చినా వాటి వల్ల ఇబ్బంది కలగకుండా దేవుడు తోడుంటాడు.. ఇది తాను నమ్మిన సిద్ధాంతమన్నారు. “నేను సౌమ్యుడిని కావచ్చు నా మాట మెత్తగా రావచ్చు కానీ నా గుండె గట్టిది.. ఎన్నింటినైనా ఎదుర్కొనే ధైర్యం నాకుంది. ఎన్ని వచ్చిన ఎదురు నిలబడతా..” అని వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు.