NTV Telugu Site icon

Avinash Reddy: వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సీబీఐ దర్యాప్తు చేస్తోంది..

Avinash Reddy

Avinash Reddy

Avinash Reddy: వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను కొనసాగిస్తోంది. పులివెందులలో ఎంపీ అవినాష్‌ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌పై ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి స్పందించారు. విచారణలో కీలక విషయాలను సీబీఐ వదిలేసిందని.. సిల్లీ విషయాలను సీరియస్‌గా తీసుకుంటోందని అవినాష్‌ రెడ్డి పేర్కొన్నారు. భాస్కర్‌రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్ చేశారని.. మాట్లాడడానికి మాటలు కూడా రావడం లేదన్నారు. ధైర్యం కోల్పోకుండా నిజాయితీని నిరూపించుకుంటామని ఆయన తెలిపారు. తాము చెప్పిన అంశాలను సీబీఐ పరిశీలించలేదన్నారు. ‘లెటర్‌ దాచిపెట్టామని వివేకా అల్లుడు రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. హత్య విషయం నా కంటే గంట ముందు వివేకా అల్లుడికి తెలుసు. కీలక అంశాలను సీబీఐ విస్మరిస్తోంది. వివేకా హత్య విషయాన్ని ముందుగా పోలీసులకు చెప్పింది నేనే. పోలీసులకు సమాచారం ఇచ్చిన నన్నే దోషిగా చూపిస్తున్నారు. నేను గాలి మాటలు.. గాలి కబుర్లు చెప్పడం లేదు. సాక్షులు చెప్పిన స్టేట్‌మెంట్ల ఆధారంగానే చెబుతున్నాను.’ అని అవినాష్‌ రెడ్డి తెలిపారు.

సీబీఐ నమ్ముకున్న దస్తగిరి స్టేట్‌మెంట్‌లోనే అనేక కీలక అంశాలున్నాయని ఎంపీ అవినాష్‌ రెడ్డి వెల్లడించారు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సీబీఐ దర్యాప్తు చేస్తోందని ఆయన ఆరోపించారు. డాక్యుమెంట్లు చోరి కాబడ్డ ఏ4పై ఎందుకు కేసు నమోదు కాలేదని.. ఏ4కి ఎందుకు ఇంత రిలీఫ్‌ ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కలిసికట్టుగా ఎవరిపైనో నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అప్రూవర్‌గా మార్చేందుకు యాంటిసిపేటరీ బెయిల్‌ వేయించారని.. అప్రూవర్‌కు సహకరించి సీబీఐ బెయిల్‌ ఇప్పించిందన్నారు. వాస్తవాల ఆధారంగా దర్యాప్తు చేయాలని సీబీఐని కోరుతున్నానని.. ఏప్రిల్‌ 3న మా అభ్యంతరాలను సీబీఐ దృష్టికి తీసుకెళ్లామని అవినాష్ రెడ్డి తెలిపారు.

Read Also: YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో కీలక మలుపు.. పులివెందులలో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి అరెస్ట్

పోలీసులు రావొద్దని నేను చెప్పాననడం దారుణమన్నారు. పాత అధికారి చేసిన విచారణనే కొత్త బృందం ఫాలో అవుతోందని.. వాస్తవాల ఆధారంగా దర్యాప్తు చేయాలని సీబీఐని అవినాష్‌ రెడ్డి కోరారు. “రెండో భార్యకు ఆస్తి రాసివ్వాలని వివేకా అనుకున్నారు. స్టాంపు పేపర్లు పోతే సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయలేదు. వివేకా హత్యకు ముందు, ఆ తర్వాత స్టాంప్‌ పేపర్ల పరిశీలన, దొంగతనం జరిగింది. చోరీ కేసు ఎందుకు పెట్టలేదు.. ఆ దిశగా ఎందుకు విచారించలేదు?. సునీత, సీబీఐ ఒక లక్ష్యంతోనే వ్యవహరిస్తున్నాయి. వివేకా.. షేక్‌ మహ్మద్‌ అక్బర్‌గా 2010లో పేరు మార్చుకున్నారు. వివేకాకు పెహన్‌ షా అనే కుమారుడు ఉన్నాడు. వివేకా రాసిన లెటర్‌ అక్కడే ఉంది. లెటర్‌ దాచిపెట్టామని వివేకా అల్లుడు రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. విచారణలో సీబీఐ కీలక విషయాలను వదిలేసింది. మాకు పదవులపై వ్యామోహం లేదు. వ్యవస్థలు, న్యాయస్థానాలపై మాకు గౌరవం ఉంది. చివరకు నిజాయితీయే గెలుస్తుంది” అని ఎంపీ అవినాష్‌ రెడ్డి వివరించారు.