PUBG: ప్రాణం తీసిన పబ్జీ .. మెదడులో రక్తస్రావం జరిగి యువకుడు మృతి

  • ప్రాణం తీసిన పబ్జీ
  • మెదడులో రక్తస్రావం జరిగి యువకుడు మృతి
  • మీరట్‌లో 22 ఏళ్ల మహ్మద్ కైఫ్ పబ్జీ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు
Pubg

Pubg

ఆన్‌లైన్ మొబైల్ గేమ్‌లు ప్రమాదకరమే కాదు ప్రాణాంతకంగా మారాయి. ఆన్‌లైన్ కొరియన్ డ్రామా గేమ్‌లో మునిగిపోయిన ముగ్గురు సోదరీమణులు ఘజియాబాద్‌లోని భారత్ సొసైటీ తొమ్మిదవ అంతస్తు నుండి దూకిన ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా మీరట్‌లో 22 ఏళ్ల మహ్మద్ కైఫ్ పబ్జీ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఖైర్‌నగర్‌లోని గులార్ వాలి గలిలో నివసిస్తున్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు కైఫ్, ఆన్‌లైన్ గేమ్ PUBG ఆడుతున్నప్పుడు మెదడు రక్తస్రావంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో, అతన్ని ఢిల్లీకి తరలించారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో రెండు రోజుల చికిత్స తర్వాత కైఫ్ ఆదివారం మరణించాడు. ఒక్కాగొనక్క కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Also Read:PNB Recruitment 2026: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 5,138 పోస్టులు.. జస్ట్ డిగ్రీ ఉంటే చాలు..

ఢిల్లీ గేట్‌లోని ఖైర్‌నగర్ గులార్ వాలి నివాసి అయిన మహ్మద్ ఫరూఖ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తు్న్నాడు. కైఫ్ తన తండ్రికి సాయపడుతుంటాడు. శుక్రవారం నాడు, కైఫ్ ఆఫీస్ లో కూర్చుని తన మొబైల్ ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్ PUBG ఆడుతున్నాడని ఫరూఖ్ చెప్పాడు. అతను ఇయర్‌ఫోన్ ధరించి ఉన్నాడు. అకస్మాత్తుగా, కైఫ్ స్పృహ తప్పి పడిపోయాడు. ఆఫీసులో ఉన్నవారు అతన్ని సమీపంలోని వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అతని రక్తపోటును తనిఖీ చేశారు. అది 300 కంటే ఎక్కువగా ఉంది. కైఫ్‌ను వెంటనే హోప్ నర్సింగ్ హోమ్‌లో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉండటం చూసి వైద్యులు వెంటనే అతన్ని రిఫర్ చేశారు.

Also Read:Tragedy: కూకట్‌పల్లిలో విషాదం.. ట్రాన్స్‌ఫార్మర్‌పై పడిన పతంగి తీస్తూ బాలుడు విద్యుత్ షాక్‌

అతని కుటుంబ సభ్యులు అతన్ని ఢిల్లీకి తరలించి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. అధిక రక్తపోటు కారణంగా అతని మెదడులోని రక్తనాళం చీలిపోయి అంతర్గత రక్తస్రావం జరిగిందని వైద్యులు నిర్ధారించారు. కైఫ్‌ను కాపాడే ప్రయత్నాలు రెండు రోజులు కొనసాగాయి. ఆదివారం చికిత్స పొందుతూ కైఫ్ మరణించాడు. కైఫ్ మొబైల్ ఫోన్ తో ఎక్కువ గడిపేవాడని ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ తరచుగా వీడియో రీల్స్ కూడా చేసేవాడని తెలిపారు. వద్దని వారించినా వినేవాడు కాదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.