Site icon NTV Telugu

Amit Shah: ‘ఇక ఆపండి’.. హర్యానా హోంమంత్రిని సున్నితంగా మందలించిన అమిత్‌ షా

Amit Shah

Amit Shah

Amit Shah: పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో హర్యానా హోంమంత్రి అనిల్‌ విజ్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సున్నితంగా మందలించారు. కేంద్ర హోంశాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుదీర్ఘ ప్రసంగం చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అనిల్ విజ్‌ ఎనిమిదిన్నర నిమిషాలు ప్రసంగించగా అమిత్‌ షా ఆయనకు నాలుగుసార్లు అంతరాయం కలిగించారు. మాట్లాడేందుకు ఆయనకు ఐదు నిమిషాలు మాత్రమే కేటాయించారని గుర్తు చేశారు. ‘మీ ప్రసంగం ఇక ఆపండి’ అని స్వయంగా షా గుర్తు చేయాల్సి వచ్చింది.

విజన్‌ 2047కు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేయడమే లక్ష్యంగా హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ సదస్సులో హర్యానా హోంమంత్రి అనిల్‌ విజ్‌ స్వాగత ఉపన్యాసం చేశారు. ఆయనకు ఇచ్చిన సమయం ఐదు నిమిషాలు కాగా.. అది కాస్తా దారి మళ్లింది. హర్యానా చరిత్ర, హరిత విప్లవానికి దాని సహకారం, ఒలింపిక్స్‌లో రాష్ట్ర క్రీడాకారుల ప్రతిభ, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన క్రీడా మౌలిక సదుపాయాల గురించి వివరించసాగారు. అలాగే, తన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహించే ఫిర్యాదుల పరిష్కార సెషన్ గురించి కూడా మాట్లాడారు. ఆయనకు కొంచెం దూరం కూర్చున్న ఆయన మాటలను వినసాగారు. ఇచ్చిన సమయం అయిపోవడంతో ఆయనకు సైగ చేశారు. కానీ అనిల్‌ మాత్రం మాట్లాడుతూనే ఉన్నారు. అనంతరం మైక్ తట్టి అంతరాయం కలించారు.

చివరకు అమిత్ షా కల్పించుకొని ‘అనిల్ జీ మీకు ఐదు నిమిషాలు మాత్రమే ఇచ్చారు. ఇప్పటికి ఎనిమిదిన్నర నిమిషాలు మాట్లాడారు. దయచేసి ముగించండి. ఇంత సుదీర్ఘంగా మాట్లాడేందుకు ఇది వేదిక కాదు’ అని చెప్పారు. అయితే రాష్ట్ర మంత్రి మరికొంత సమయం కావాలని అడగగా.. షా అంగీకరించారు. షా అంగీకరించడంతో విజ్ తమ రాష్ట్ర విజయాల సుదీర్ఘ జాబితాను వివరించడం కొనసాగించారు. దాంతో, అమిత్ షా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘అనిల్ జీ దయచేసి నన్ను క్షమించండి. ఇది పని చేయదు. ముగించండి’ అని చెప్పారు. అమిత్‌ షా స్పందన అనంతరం హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్ ఖట్టర్‌ తన ప్రసంగాన్ని మూడు నిమిషాల్లో ముగించడం గమనార్హం.

Farmhouse MLA Audio Leak: ఫామ్ హౌస్ ఘటనలో బయటికొచ్చిన సంచలన ఆడియో

ఈ సదస్సులో అమిత్‌ షా ప్రసంగించారు. 2024 నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రం ప్రభుత్వ ‘విజన్ 2047’ అమలు కోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు రెండ్రోజుల హోంశాఖ సదస్సు నిర్వహిస్తోందని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తీవ్రవాదానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని కలిగి ఉందని, నిర్ణయాత్మక విజయం సాధించడానికి ఎన్‌ఐఏ, ఇతర ఏజెన్సీలను బలోపేతం చేస్తున్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ శాఖలను ఏర్పాటు చేయడం ద్వారా ఉగ్రవాద వ్యతిరేక నెట్‌వర్క్‌ను నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వామపక్ష తీవ్రవాదం, జమ్మూకశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు ఒకప్పుడు హింస, అశాంతికి హాట్ స్పాట్‌గా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధిలో హాట్ స్పాట్‌లుగా మారుతున్నాయన్నారు. సైబర్ నేరాలు దేశానికే కాదు, ప్రపంచానికే పెద్ద సవాలు అని వెల్లడించారు. దేశాన్ని, యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడేందుకు మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇప్పటికే 20 వేల కోట్ల రూపాయల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని అమిత్ షా తెలిపారు.

Exit mobile version